- వ్యాపారులకు కలిసొచ్చిన ఉప ఎన్నిక
- బిర్యానీకి మస్తు డిమాండ్
- నాటుకోళ్లు ఖతం
- ఇంటి అద్దెలు డబుల్
- ఫాంహౌజ్‌లు, ఫంక్షన్ హాల్స్, లాడ్జిలు హౌస్ ఫుల్
నల్గొండ, వెలుగు : రాష్ట్ర వ్యాప్తంగా మునుగోడు ఉప ఎన్నిక పోరు ఉత్కంఠ రేపుతోంది. మరో మూడు నెలల పాటు ప్రధాన రాజకీయ పార్టీల రాష్ట్ర, జిల్లా స్థాయి నేతలు మునుగోడులోనే మకాం పెట్టాల్సి రావడంతో ఈ ఎన్నికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే లీడర్ల పర్యటనలు, మీటింగులతో గ్రామాల్లో, మండలాల్లో పండుగ వాతావరణం కనిపిస్తోంది. హోటళ్లు, లాడ్జిలు, రెస్టారెంట్లు, చాయ్కొట్లు, ఫంక్షన్ హాల్స్‌లో సందడి నెలకొంది. దీంతో ఇక్కడి వ్యాపారులు ఉప ఎన్నికను లాభసాటిగా మార్చుకునే పనిలో పడ్డారు. నెల రోజుల వ్యవధిలోనే టీ, టిఫిన్, భోజనం, బిర్యానీ రేట్లను అమాంతంగా పెంచారు. అద్దె ఇండ్ల ధరలు డబుల్చేసేశారు. వీఐపీల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. మునుగోడులో రాచకొండ అటవీ ప్రాంతం ఉండడంతో ఇక్కడ ఉండే ఫాంహౌజ్‌లకు డిమాండ్ పెరిగింది.
ఆ మండలాలకే క్యూ కడ్తున్రు..
రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే లీడర్లు, వారి వెంట వచ్చే వారికి బస ఏర్పాటు చేసేందుకు స్థానిక నేతలు తంటాలు పడుతున్నారు. చౌటప్పుల్, మునుగోడు, నారాయణపూర్మండలాల్లో ఉండేందుకు ఎక్కువ మంది నేతలు ఆసక్తి చూపిస్తుండడంతో ఆ ప్రాంతాల్లోని అద్దె ఇండ్లు, ఫాంహౌజ్‌లు నిండిపోతున్నాయి. వీటి కోసం నెలకు తక్కువలో తక్కువ రూ.50వేల వరకు పెడుతున్నారు. ఎయిర్ కండీషన్ సౌకర్యం, మీటింగ్‌హాల్, మూడు గదులు, పెద్ద డైనింగ్‌హాల్, కనీసం 20 మంది ముఖ్యులతో మాట్లాడుకునేలా ఏర్పాట్లు ఉండడంతో ఫాంహౌజ్లకే మొగ్గు చూపుతున్నారు. గెస్ట్‌హౌజుల్లో కూడా ఇలాంటి సౌకర్యాలే ఉండడం, రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు దొరుకుతుండడంతో రెండో ఆప్షన్‌కింద ఎంచుకుంటున్నారు. ఇక్కడికి వచ్చేవారందరికీ వండి పెట్టడానికి ప్రత్యేకంగా చెఫ్‌లను కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇక లాడ్జీల విషయానికి వస్తే నెల రోజుల ముందే చౌటుప్పల్‌లో ఉన్న నాలుగైదు లాడ్జీల అడ్వాన్స్ బుకింగ్అయిపోయింది. వీటితోపాటు మునుగోడు, నారాయణపూర్, చౌటుప్పల్‌లో మూడు నాలుగు వేలు పలికే అద్దె ఇండ్లు ఇప్పుడు ఎనిమిది వేలు పెడితే కానీ దొరకడం లేదు.
హోటల్స్, రెస్టారెంట్లు ఫుల్‌బిజీ
హోటల్స్, రెస్టారెంట్ల గిరాకీ కూడా పెరిగింది. బయటి నుంచి వచ్చే పార్టీల నాయకులు, కార్యకర్తలకు భోజనం కోసం క్యాటరింగ్ మాట్లాడుకుంటుండడంతో డిమాండ్ పెరిగింది. ఫంక్షన్ హాల్స్ ను అయితే రెండు, మూడు నెలల కోసం లీజుకు తీసుకుంటున్నారు. దీని కోసం ఒక్కో ఫంక్షన్‌హాల్‌కు నెలకు రూ.3 నుంచి రూ.5 లక్షలు ఇస్తున్నారు. చౌటుప్పల్హైవే పైన ఉన్న ఫంక్షన్ హాల్స్అయితే ఎప్పుడూ కిటకిటలాడుతూ కనిపిస్తున్నాయి. గతంలో రోజుకు రూ.పది నుంచి రూ. ఇరవై వేలు ఇచ్చేవారు. ఇప్పుడు నెలల చొప్పున తీసుకునేవారి సంఖ్య పెరగడంతో ఒక్క రోజుకు ఇవ్వడానికి ఓనర్లు ఆసక్తి చూపించడం లేదు. ఇవ్వాలనుకుంటే రూ.30 వేల నుంచి రూ.40 వేలకు తగ్గడం లేదు.
నాటుకోళ్లు దొర్కుతలేవ్
బాయిలర్చికెన్కు కొరత లేకపోయినా నాటుకోళ్లు మాత్రం దొరకడం లేదు. కిలో నాటు కోడి రూ.500కు పైగానే పలుకుతోంది. ఈ నాటుకోళ్ల కోసం గ్రామాలకు వెళ్లినా లేవనే చెబుతున్నారు. కొంతమంది వ్యాపారులైతే చికెన్, మటన్ ఆర్డర్ఇస్తేనే పంపించే పరిస్థితి ఉందని, డైరెక్ట్వస్తే వెయిట్చేయాల్సిందేనని చెబుతున్నారు.నాటుకోళ్లను ఇతర జిల్లాల నుంచి తెప్పిస్తున్నామంటున్నారు.
కాస్ట్ లీ చాయ్..కాఫీ..బిర్యానీ..
ఉప ఎన్నికల ప్రభావం అన్ని ధరలపైనా పడింది. చాయ్ దగ్గర నుంచి బిర్యానీ వరకు రేట్లు భారీగా పెంచారు. రూ.6 ఉన్న చాయ్ ధర రూ.10, కాఫీ రూ.10 ఉంటే రూ.15 చేశారు. రూ.80లు ఉండే ఫుల్ మీల్స్ రౌండ్ఫిగర్చేసి రూ. వంద తీసుకుంటున్నారు.ఇంతకుముందు చికెన్ బిర్యానీ రూ.90 ఉంటే దీన్ని కూడా రూ.200 చేశారు. కిలో చికెన్ ధర రూ.180 నుంచి రూ.230కి పెంచారు. ఇడ్లీ, వడ, దోశ ఇలా టిఫిన్స్పైన రూ.5 నుంచి రూ.10 వరకు పెంచారు.
ఎప్పుడూ గిట్లనే ఉంటే బాగుండు..
గతంలో ఫుల్ మీల్స్రూ.90 తీసుకునేది ఇప్పుడు రూ.120 తీసుకుంటున్నం. బిర్యానీకి డిమాండ్ పెరిగింది. గతంలో సింగిల్బిర్యానీకి రూ.100 తీసుకునేవాళ్లం. ఇప్పుడు రూ.140 చేసినం. మీటింగులు జరిగినప్పుడు ఎక్కువ తీసుకుపోతున్నరు. ఉప ఎన్నిక పుణ్యాన గిరాకీ పెరిగింది. ఎప్పుడూ ఇట్లనే ఉంటే బాగుండు.
- ప్రసాద్, మిస్టర్ టీ హోటల్ నిర్వాహకుడు
150 కిలోలు అమ్ముతున్నా..
గతంలో రోజుకు రూ.50 కిలోల నుంచి 60 కిలోల వరకు చికెన్అమ్మేవాడిని. ఉప ఎన్నిక సందడి మొదలైనప్పటి నుంచి 130 కిలోల నుంచి 150 కిలోల వరకు అమ్ముడుపోతోంది. పెద్ద పెద్ద లీడర్లు వచ్చి మీటింగ్పెడితే 200 నుంచి 250 కిలోలు అమ్ముతున్నా. టైంకు ఫామ్ నుంచి కోళ్లు రాక గిరాకీ మర్లి పోతోంది.
- అంజి, రేణుక ఎల్లమ్మ చికెన్ షాప్ నిర్వాహకుడు
రూ.10 వేలైనా సరే ఇస్తరట
డబుల్ బెడ్ రూమ్ పోర్షన్రూ.4 వేల నుంచి రూ.5 వేలు ఉండేది. మునుగోడులో ఉప ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీల లీడర్లు వచ్చి రూంలు కావాలని అడుగుతున్నారు. మూడు నెలల వరకు ఉంటామని రూ. 10 వేలయినా సరే ఇస్తామని చెప్తున్నరు. మూడు నెలలకు అడ్వాన్స్ కూడా ఇచ్చిన్రు.
- పాక చిరంజీవి, ఇంటి ఓనర్, చౌటుప్పల్