చెరువు కబ్జాలపై చర్యలెప్పుడు?

చెరువు కబ్జాలపై చర్యలెప్పుడు?
  • ఎన్జీటీ, హైకోర్టు ఆదేశించినా తొలగని ఆక్రమణలు
  • కేసరి సముద్రంలో ఆగని కబ్జాలు
  • పుట్నాల కుంట, సద్దల్​సాబ్​ కుంటల్లో రియల్​ దందా 
  • కాగితాలకే పరిమితమైన బయో ఫెన్సింగ్

నాగర్​ కర్నూల్, వెలుగు: నాగర్ ​కర్నూల్​ జిల్లాలో కబ్జాల పర్వం ఆగడం లేదు. కేసరి సముద్రం చెరువులో ఆక్రమణలు తొలగించి బయో ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలన్న ఎన్జీటీ, హైకోర్టు​ ఆదేశాలను సంబంధిత శాఖల అధికారులు పట్టించుకోవడం లేదు. కేసరి సముద్రంతోపాటు పుట్నాల కుంట, సద్దల్​సాబ్​ కుంట శిఖం, బఫర్ జోన్లలో దర్జాగా ప్లాట్లు వెలిశాయి.

కేసరి సముద్రంలో ఇదీ పరిస్థితి

జిల్లా కేంద్రానికి ఆనుకుని ఉయ్యాలవాడ, ఎండబెట్ల, చెర్ల తిర్మలాపూర్, చెర్ల ఇటిక్యాల చుట్టూ 1,100 ఎకరాల్లో విస్తరించి ఉన్న కేసరి సముద్రం ద్వారా దాదాపు 2,400 ఎకరాలకు సాగునీరు అందుతోంది. తొలుత ఎండబెట్ల వైపు కబ్జాల దందా మొదలై.. చెరువు శిఖంలో ఫామ్​ హౌజులు, డబుల్ ఫ్లోర్ ​బిల్డింగులు కట్టుకున్నారు. ప్రస్తుతం కేసరి సముద్రంలో 47 చోట్ల అక్రమంగా ఇండ్లు, ఫంక్షన్​ హాల్స్​, ఫామ్ ​హౌజులు కట్టినట్లు ఆధారాలు ఉన్నాయి.

స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నివాసానికి కూతవేటు దూరంలో ఉన్న చెరువు శిఖంలో ఇటీవల జేసీబీతో దాదాపు 500 మీటర్ల పొడవున కాలువ తీశారు. ఈ కాలువతో తమకు సంబంధం లేదని ఇరిగేషన్, మున్సిపల్​ అధికారులు చెప్పారు. రూ.వంద కోట్ల విలువ చేసే దాదాపు రెండున్నర ఎకరాల ఈ భూమిని దిగమింగేందుకు బాహటంగా ప్రయత్నాలు జరిగినా.. అధికారులు చూసీచూడనట్టుగా వ్యవహరించడం అనుమానాలకు తావిస్తోంది. 

ఎన్జీటీ ఆదేశించినా చర్యల్లేవు

కేసరి సముద్రంలో అక్రమ నిర్మాణాలపై మాజీ మంత్రి నాగం జనార్దన్​ రెడ్డి నేషనల్​ గ్రీన్ ​ట్రిబ్యునల్ (ఎన్జీటీ)​లో కేసు వేశారు. నాగర్​కర్నూల్​ పట్టణంలోని మురుగు నీటిని చెరువులోకి వదలడమే కాకుండా వ్యర్థాలను పారబోస్తూ మురికి కూపంగా మారుస్తున్నారని ఆరోపించారు. దీంతో అక్రమ కట్టడాలు, నీటి కాలుష్యంపై నిపుణుల కమిటీ ఏర్పాటు చేసి నివేదిక తెప్పించుకున్న ఎన్జీటీ.. అక్రమ కట్టడాలు తొలగించాలని ఆదేశించింది.

అయితే, జిల్లా మహిళా సమాఖ్య భవనాన్ని కొంత తొలగించి ఆక్రమణలు తొలగించామని అధికారులు నివేదిక ఇచ్చారు. చెరువు శిఖం, బఫర్ జోన్​ సరిహద్దులను గుర్తించి బయో ఫెన్సింగ్​ ఏర్పాటు చేయాలని ఎన్జీటీ స్పష్టం చేసినా చర్యల్లేవు. పుట్నాల కుంట, సద్దల్​సాబ్​ కుంటల పరిరక్షణ, కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని రెండేళ్ల కింద ఆదేశించినా ఇప్పటివరకు అధికారులు స్పందించలేదు.

హైడ్రా అమలైతే.. 

జిల్లాలో ఎన్ని చెరువుల శిఖం, బఫర్​ జోన్లు కబ్జాకు గురయ్యాయో ఇరిగేషన్​ అధికారుల వద్ద సమాచారం లేదు. నాగర్​కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి, ఇతర మండల కేంద్రాలకు సమీపంలో ఉన్న కుంటలు మాయమైపోతున్నాయి. సామాన్యులు కట్టుకునే ఇంటి విషయంలో ప్లాన్​ డీవియేషన్​ ఉందంటూ రూ.లక్షల్లో జరిమానా విధిస్తున్న అధికారులు.. కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నా పట్టించుకోవడం లేదు.

ఈ క్రమంలో గ్రేటర్ హైదరాబాద్​ పరిధిలో అక్రమ కట్టడాలపై కొరడా ఝలిపిస్తున్న హైడ్రా చర్యలపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. హైడ్రా పరిధిని విస్తరించి జిల్లాల్లో కూడా అమలు చేస్తే చెరువులు, కుంటలు కబ్జాకు గురి కాకుండా ఉంటాయని కామెంట్స్​ వినిపిస్తున్నాయి.  ​