నల్గొండలో బీఆర్ఎస్ లీడర్ల అండతో రెచ్చిపోతున్న గూండాలు

  • ఆఫీసర్లను చంపేస్తామని బెదిరిస్తున్న మట్టి మాఫియా
  • అమ్మగూడెంలోని గుట్టపై అక్రమంగా​ తవ్వకాలు 
  • గుట్ట పైనున్న ఐదు మిషన్​ భగీరథ ట్యాంకులకు ముప్పు
  • ఇక్కడి నుంచే 600 గ్రామాలకు వాటర్ ​సప్లై

నల్గొండ, వెలుగు:‘‘మీరు ఇక్కడి నుంచి వెంటనే వెళ్లిపోండి.. లేదంటే చంపేస్తాం’’.. నల్గొండ టౌన్​కు సమీపంలోని అన్నేశ్వర స్వామి గుట్టపై జరుగుతున్న అక్రమ మట్టి తవ్వకాలను ఆపేందుకు వెళ్లిన ఆర్​డబ్ల్యూఎస్​ ఆఫీసర్లకు మట్టి మాఫియా నుంచి వచ్చిన బెదిరింపులివి. గుట్టపై ఐదు మిషన్​భగీరథ ట్యాంకులు, వాటి పైపులు ఉన్నాయని.. తవ్వకాల వల్ల దెబ్బతింటాయని అధికారులు చెప్పి చూసినా లాభం లేకుండా పోయింది. గుట్టవైపు ఎవరు కన్నెత్తి చూసినా, అంతు తేలుస్తామని అక్కడి గూండాలు వార్నింగ్​ఇవ్వడం.. వారికి అధికార​ పార్టీ ప్రజాప్రతినిధులు అండగా ఉండడంతో ఆఫీసర్లు చేసేదేమీ లేక వెనక్కి తిరిగివచ్చారు.

రాష్ట్రంలో మైనింగ్​మాఫియా ఏ రేంజ్​కు వెళ్లిందో చెప్పేందుకు ఈ ఘటన ఉదాహరణగా నిలుస్తోంది. నల్గొండ మండలం అమ్మగూడెం సమీపంలోని అన్నేశ్వర గుట్ట 190 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఈ ప్రాంతంలోని 33, 477 సర్వే నంబర్లలో మట్టి తవ్వకాలు చేపట్టేందుకు రెండు సంస్థలు మైనింగ్​ డిపార్ట్​మెంట్​నుంచి పర్మిషన్​ పొందాయి. నల్గొండలో నిర్మిస్తున్న నేషనల్ హైవే పనులకు, బైపాస్ వద్ద నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ నిర్మాణాలకు మట్టి తవ్వుకునేందుకు మాత్రమే ఈ పర్మిషన్లు ​ఇచ్చారు. రెండు కంపెనీలకు కలిపి ఆరు ఎకరాల్లో.. ఒక కంపెనీకి 24 వేల టన్నులు, ఇంకో కంపెనీకి 10 వేల టన్నుల మట్టి తవ్వుకునేందుకు మాత్రమే అనుమతి ఉంది. కానీ అక్రమార్కులు తమ పరిధి దాటి గుట్టపై తవ్వకాలు చేస్తున్నారు. కాగా, ఇదే గుట్టపై 3,500 కిలోలీటర్ల కెపాసిటీ కలిగిన ఐదు మిషన్ భగీరథ ట్యాంకులు ఉన్నాయి. ఇక్కడి నుంచే నల్గొండ టౌన్, రూరల్, మునుగోడు, నకిరేకల్​ నియోజకవర్గాల్లోని 600 గ్రామాలకు వాటర్​సప్లై జరుగుతోంది. ప్రస్తుతం మట్టి తవ్వకాలు జరుగుతున్న ప్రాంతాల్లోనే భగీరథ పైప్​లైన్లు నిర్మించారు. అసలు ఎక్కడ పర్మిషన్​ఇచ్చారో? ఎక్కడ తవ్వుతున్నారో? తెలియని పరిస్థితుల్లో పైప్​లైన్లు డ్యామేజీ కాకుండా గుట్ట ప్రాంతాన్ని పరిశీలించేందుకు ఇటీవల వెళ్లిన భగీరథ ఆఫీసర్లను చంపుతామని మట్టి మాఫియా ముఠా బెదిరించి పంపేసింది. దీంతో గత్యంతరం లేక ఇటీవల జరిగిన జడ్పీ మీటింగ్​లో ఆఫీసర్లు తమ గోడు వెళ్లబోసుకున్నారు. కానీ ఈ మాఫియా వెనుక రూలింగ్​పార్టీ లీడర్లు ఉండడంతో ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ క్రమంలో రాజకీయ ఒత్తిళ్లు భరించలేకపోతున్నామని, తమ డ్యూటీ తమను చేసుకోనివ్వడం లేదని సీనియర్​ ఆఫీసర్లు ‘‘వెలుగు’’తో చెప్పారు. 

క్రైమ్ బ్యాక్​ గ్రౌండ్​ ఉన్నవాళ్లతో కాపలా...

మట్టి తవ్వకాలు జరుపుతున్న ప్రాంతంలో ఎక్కడికక్కడ క్రైమ్ బ్యాక్​ గ్రౌండ్​ ఉన్న వ్యక్తులను కాపలా పెట్టారు. గంజాయి బ్యాచ్, గతంలో పలు మర్డర్​ కేసుల్లో నిందితులుగా ఉన్న వ్యక్తులను గుట్ట పరిసర ప్రాంతాల్లో ఉంచి దందా నడిపిస్తున్నారు. పగటిపూట లీగల్ గానే దందా నడిపిస్తున్నట్లు చెబుతున్నప్పటికీ .. అర్ధరాత్రి వేళ పెద్ద పెద్ద టిప్పర్లు, ట్రాక్టర్లతో పెద్ద ఎత్తున ఇల్లీగల్​ట్రాన్స్​పో ర్ట్​జరుగుతోంది. ఎప్పటి నుంచో ఈ తవ్వకాలు జరుపుతున్నా అధికారులు ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. పోయిన వానాకాలంలో మునుగోడు నియోజకవర్గానికి పది రోజుల పాటు నీళ్లు బంద్​పెట్టారు. ఎందుకని ఆరా తీయగా గుట్టపైన రాళ్లు, మట్టి దిబ్బులు కూలిపోయి పైప్​లైన్లు దెబ్బ తిన్నాయని తేలింది. దీంతో రిపేర్లు​చేసేంత వరకు మునుగోడు ప్రాంతంలోని 300 ఊర్లకు వాటర్ నిలిచిపోయింది. 

ప్రమాదంలో భగీరథ ట్యాంకులు...

తవ్వకాలు జరుగుతున్న ప్రాంతాలను పరిశీలించిన అధికారులు భగీరథ ట్యాంకులకు ప్రమాదం పొంచి ఉందని చెబుతున్నారు. గుట్టపై పైప్​లైన్లు నిలబడేందుకు సపోర్ట్​గా సిమెంట్​పిల్లర్లు నిర్మించారు. వీటికి డ్యామేజ్ జరిగే ఆస్కారం ఉంది. పర్మిషన్లు పొందిన ప్రాంతానికి, పైప్​లైన్లకు మధ్య 500 మీటర్ల దూరం ఉంటుందని మైనింగ్​అధికారులు చెబుతున్నారు. కానీ ఫీల్డ్​లో మాత్రం పైప్​లైన్​పక్కనే తవ్వకాలు జరుపుతున్నారు. దీనివల్ల వానాకాలంలో మట్టి సపోర్ట్​ లేక పైనుంచి రాళ్లు పడిపోయి పైప్​లైన్లు పగిలిపోతాయని, అదీగాక సిమెంట్ పిల్లర్ల వద్ద మట్టి సపోర్ట్​లేకపోతే మొత్తం పైప్​లైన్​వ్యవస్థే దెబ్బతింటుందని భగీరథ అధికారులు అంటున్నారు. మట్టి తవ్వుకునే పరిధిని నిర్ధారించకుంటే ట్యాంకులకు ప్రమాదం తప్పదని హెచ్చరిస్తున్నారు.

అనుమతులు ఒకచోట.. తవ్వకాలు మరోచోట

34 వేల టన్నుల మట్టిని తవ్వుకునేందుకు పర్మిషన్​ పొందిన కాంట్రాక్ట్​సంస్థలు.. అంతకు ఎన్నో రెట్లు తవ్వుకొని బయటకు తరలిస్తున్నా ఆఫీసర్లు ఏమీ చేయలేని పరిస్థితి ఉంది. ప్రస్తుతం తవ్వుతున్న మట్టినంతా తరలించి పానగల్లు బైపాస్, దండంపల్లి రోడ్డు సమీపంలో పోస్తున్నారు. ప్రస్తుతం ఆ మట్టి కూడా గుట్టల అంత ఎత్తులో పేరుకుపోతోంది. పనులు జరుగుతున్న ప్రాంతాల్లోకి మైనింగ్, రెవెన్యూ డిపార్ట్​మెంట్​తరఫున ఆఫీసర్లు ఎవరూ తనిఖీలకు వెళ్లడం లేదు. ట్యాంకులు కాపాడుకునేందుకు భగీరథ స్టాఫ్, ఇంజినీర్లు వెళ్లేందుకు భయపడుతున్నారు. అనుమతులు ఒకచోట తీసుకొని, ఇంకోచోట తవ్వకాలు చేపడుతున్నారని ఆఫీసర్లు చెబుతున్నారు. 


అధికారులు జోక్యం చేసుకోవాలి

మట్టి మాఫియాపై జడ్పీ స్టాండింగ్ కమిటీలో చర్చించాం. అధికారుల ఫిర్యాదు మేరకు అప్పటికప్పుడే తహసీల్దార్, ఆర్డీఓ, మున్సిపల్​చైర్మన్​కు చెప్పాం. కానీ అక్కడికి వెళ్లిన అధికారులను చంపుతామని బెదిరిస్తున్నరట. పై అధికారులు జోక్యం చేసుకుంటే గానీ మట్టి మాఫియాను ఆపడం కష్టం. 
- బండా నరేందర్ రెడ్డి, జడ్పీ చైర్మన్, నల్గొండ

ఇంజినీర్లు భయపడుతున్నరు 

గుట్ట దగ్గర జరుగుతున్న మట్టి తవ్వకాల్లో ఏది లీగల్? ఏది ఇల్లీగల్? అని​కనిపెట్టలేకపోతున్నాం. పైప్ లైన్లు దెబ్బతినకుండా పర్మిషన్ ఇవ్వాలని తహసీల్దార్, ఆర్డీఓలకు లెటర్లు రాశాం. మైన్స్, మా డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో జాయింట్​ ఇన్ స్పెక్షన్ కూడా జరిగింది. కానీ అక్కడికి వెళ్లేందుకు మా ఇంజినీర్లు భయపడుతున్నారు. అక్కడ పని చేస్తున్న వాళ్లు సేఫ్ ​కండీషన్​లో లేరు. గత వానాకాలంలో ఇసుక దిబ్బలు, రాళ్లు కూలిపోవడంతో మునుగోడుకు పది రోజులు నీళ్లు బంద్​పెట్టాం. 
- సురేశ్ కుమార్, మిషన్ భగీరథ ఎస్ఈ