- అభివృద్ధి పనుల పేరుతో లోన్లు తీసుకున్న జీహెచ్ంఎసీ
- గ్రేటర్ అభివృద్ధి విషయంలో కాంగ్రెస్ సర్కార్ ముందు సవాళ్లు
- బకాయిలపై ఎలాంటి నిర్ణయాలు ఉంటాయోనని వెయిట్ చేస్తున్న అధికారులు
- ప్రస్తుతం కొనసాగుతున్న పనుల్లో మార్పులు చేసే అవకాశం?
హైదరాబాద్, వెలుగు : గ్రేటర్ డెవలప్మెంట్పై కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ సర్కార్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటోందనని అధికారులు, సిటిజన్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బీఆర్ఎస్ పాలనలో చేపట్టిన పనులను యథావిధిగా కొనసాగిస్తారా? లేక కొత్త పనులకు ఏమైనా మొదలుపెడతారా అన్నది చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ హయాంలో మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ సిటీని ఎంతో డెవలప్ చేశామని చెప్పుకొచ్చారు. అప్పట్లో గ్రేటర్ పరిధిలో ఏ డెవలప్‌మెంట్ జరగాలన్నా మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ మాత్రమే ఏకపక్షంగా నిర్ణయం తీసుకునేవారన్న చర్చ కూడా జరిగింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో గ్రేటర్ డెవలప్మెంట్పై ఇది వరకు ఉన్నట్లుగా కాకుండా ఇప్పుడు అందరితో కలిసి చర్చించి నిర్ణయాలు తీసుకునే విధంగా కనిపిస్తోంది. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ హయాంలో అందరూ కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకునేవారు. అప్పట్లో మిగులు బడ్జెట్‌తో ఉన్న బల్దియా ఈ తొమ్మిదిన్నరేండ్ల బీఆర్ఎస్ పాలనలో రూ.6వేల కోట్ల అప్పుల్లో పడింది. ఈ అప్పులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలపై మేయర్ సహా కమిషనర్ ఎవరు నోరు విప్పలేకపోయారు. కౌన్సిల్ సమావేశంలోనూ ఇందుకు సంబంధించి ఎవరు ప్రశ్నించినా ఇన్నాళ్లుగా ఎవరి నుంచి జవాబు రాలేదు.
పెండింగ్‌లో ఎస్ఆర్డీపీ పనులు
బీఆర్ఎస్ పాలనలో స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్(ఎస్ఆర్డీపీ) ఫస్ట్‌ఫేజ్‌లో భాగంగా రూ.5,937 కోట్లతో మొత్తం 47 పనులు చేపట్టగా ఇందులో కొన్ని పెండింగ్‌లో ఉన్నాయి. సెకండ్ ఫేజ్ కోసం రూ.4,300 కోట్లతో 36 పనులకు అనుమతులు ఇస్తున్నామని ప్రకటించినప్పటికీ ఈలోపే ఎన్నికలు రావడం, బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోవడం జరిగిపోయింది. అదే విధంగా వరదల నివారణకు ఫస్ట్ ఫేజ్ కింద రూ. 737.45 కోట్లతో 37 నాలా పనులు చేపట్టారు. ఇందులో ఇంకా 6 పనులు కొనసాగుతున్నాయి. అయితే, రెండేండ్ల కిందట ఈ పనులు ప్రారంభించిన వెంటనే గ్రేటర్‌కు సంబంధించి రూ.వెయ్యి కోట్లతో దాదాపు 70 నాలాల పనులు చేపట్టాలని సెకండ్ ఫేజ్ కోసం అధికారులు ప్రభుత్వానికి ప్రపోజల్స్ పంపారు. అనుమతులు వస్తాయని అనుకున్నప్పటికీ రాలేదు. దీంతో ఆ పనులకు సంబంధించి ఎలాంటి అడుగు ముందుకు పడలేదు.
ఏటా రూ.400 కోట్లకు పైగా వడ్డీ చెల్లింపులు
జీహెచ్ఎంసీ ఇప్పటికే వివిధ పనుల కోసం ఆయా బ్యాంకుల్లో అప్పులు రూ. 5,275 కోట్లు అప్పు చేసింది. ఎస్ఆర్డీపీ పనుల కోసం ఎస్ బీఐలో 8.65 శాతం వడ్డీ కింద రూ.2,500 కోట్లు, కాంప్రహెన్సివ్ రోడ్ మెయింటెనెన్స్ ప్రోగ్రామ్(సీఆర్ఎంపీ) కోసం 7.20 శాతం వడ్డీతో రూ.1,460 కోట్లు, మళ్లీ ఎస్ఆర్డీపీ పనుల కోసం బాండ్ల ద్వారా రూ.490 కోట్లు, ఇందులో రూ.200 కోట్లను 8.90 శాతం వడ్డీ, 190 కోట్లను 9.38 శాతం, రూ.100 కోట్లు 10.23 శాతం వడ్డీకి తీసుకుంది. రూ.140 కోట్లను హడ్కో ద్వారా వాంబే హౌసింగ్ స్కీమ్ కోసం తీసుకుంది. ఇందులో రూ.100 కోట్లకు 10.15 శాతం, రూ.40 కోట్లకు 9.90 శాతం వడ్డీ చెల్లిస్తోంది. వీటితో పాటు గతేడాది ఆగస్టు తర్వాత నాలా పనుల కోసం రూ. 685 కోట్ల అప్పు తీసుకుంది. మొత్తం అన్ని కలిపితే రూ.5,275 కోట్ల అప్పు ఉంది. ఏడాదికి రూ.400 కోట్లకు పైగా వడ్డీని బల్దియా చెల్లిస్తోంది.
బడ్జెట్ కేటాయింపులు ఇలా....
8 ఏండ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి జీహెచ్ఎంసీకి నిధులు పూర్తిస్థాయిలో రాలేదు. పేరుకు బడ్జెట్‌లో కేటాయించినప్పటికీ ఆ మొత్తాన్ని విడుదల చేయలేదు. 2014–15 బడ్జెట్‌లో జీహెచ్ఎంసీకి రూ. 375. 93 కోట్లు కేటాయించిన బీఆర్ఎస్ సర్కార్.. రూ.288.14 కోట్లు మాత్రమే విడుదల చేసింది. 2015–16 లో రూ.428 కోట్లు కేటాయించి.. కేవలం రూ. 23 కోట్లతోనే సరిపెట్టింది. 2016–17లో రూ.70.30 కోట్లు కేటాయించి.. రూ.1.32 కోట్లే ఇచ్చింది. 2017–18 బడ్జెట్‌లో ప్రణాళికేతర నిధుల కింద రూ.67.28 కోట్లు కేటాయించినా ఒక్క పైసా కూడా విడుదల చేయలేదు. 2018–19, 2019–20 బడ్జెట్లలో అసలు నిధులే కేటాయించ లేదు. 2020–21 బడ్జెట్‌లో నగర అభివృద్ధికి రూ.10 వేల కోట్లు కేటాయించిన ప్రభుత్వం అందులో జీహెచ్ఎంసీ కేవలం రూ.17 కోట్లు మాత్రమే అందించింది. 2021–22 లోనూ నిధులను కేటాయించలేదు. 2022–23 లో కూడా రూ.2,500 కోట్ల నిధులు కావాలంటూ ప్రభుత్వానికి బల్దియా అధికారులు లేఖ రాసిన నిధులు రాలేదు. ఇలా బీఆర్ఎస్ప్రభుత్వం బల్దియాని అసలు పట్టించుకోలేదు.