పిడుగుపాటుతో గుండెనొప్పి వచ్చి రైతు మృతి

నిజామాబాద్ జిల్లాలో పిడుగుపడడంతో ఆ శబ్దానికి గుండెపోటు వచ్చి ఓ రైతు మృతిచెందాడు. మాక్లూర్ మండలం గుత్ప గ్రామానికి చెందిన బర్ల సాయన్న (సాయిరెడ్డి) అనే రైతు..వర్షంలో ధాన్యం కుప్పలపై తాటిపత్రి కప్పుతున్న క్రమంలో పిడుగు పడింది. ఆ పిడుగు శబ్దానికి గుండెనొప్పి వచ్చి చనిపోయాడు. ఆరబెట్టిన వరి ధాన్యాన్ని కాపాడుకునేందుకు వెళ్లిన రైతు మృతిచెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. సాయన్న మృతితో కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. 

తెలంగాణలోని పలు జిల్లాలో వర్షం కురుస్తోంది. పగటిపూట ఎండ..రాత్రి సమయంలో పలు చోట్ల వర్షం కురుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో బలమైన ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడి వర్షం పడుతోంది. ఈ క్రమంలోనే నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. 

పిడుగుపాటుతో రెండు గేదెల మృతి

మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం లింగాపూర్ గ్రామంలో పిడుగుపాటుతో రెండు గేదెలు మృతిచెందాయి. బాధిత రైతు పాల రాములు తనను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాడు. 

తూప్రాన్ లో ఈదురుగాలులు భీభత్సం సృష్టించాయి. పలు చోట్ల భారీ వృక్షాలు నెలకొరిగాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు.. గాలి దుమారానికి వరి పంట నెలకొరిగింది. అంతేకాదు.. ఈదురుగాలులకు మామిడి కాయలు రాలిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.