పెరిగిన సన్నాల సాగు.. నిజామాబాద్లో 4 లక్షల ఎకరాల వరిలో 3.60 లక్షల ఎకరాలు సన్నాలే

పెరిగిన సన్నాల సాగు.. నిజామాబాద్లో 4 లక్షల ఎకరాల వరిలో  3.60 లక్షల ఎకరాలు సన్నాలే
  •     ఇప్పటికే 2 లక్షల ఎకరాల్లో పూర్తయిన నాట్లు
  •     ఖరీఫ్​లో మిల్లర్లు చెల్లించిన రేటు మళ్లీ దక్కుతుందని ఆశ
  •     మార్కెట్​లో సన్నబియ్యం రేటు పెరగడమూ కారణమే  

నిజామాబాద్, వెలుగు :  జిల్లాలో ఈ యాసంగి సీజన్​లో సన్నరకం వరిసాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. మొన్నటి ఖరీఫ్​సీజన్​లో రైస్​మిల్లర్లు ఎంఎస్​పీ కంటే ఎక్కువ రేటు చెల్లించి రైతుల నుంచి సన్న వడ్లు కొన్నారు. యాసంగిలోనూ అదే ధర వస్తుందనే ఆశతో రైతులు సన్నరకం సాగుకు మొగ్గుచూపారు. జిల్లాలో 5.7 లక్షల ఎకరాల వ్యవసాయ అనుకూల భూమి ఉంది. 4 లక్షల ఎకరాల్లో వరి సాగు చేసేందుకు రైతులు రెడీ కాగా, అందులో 3.60 లక్షల ఎకరాల్లో సన్నరకం వడ్లను పండించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే సగానికి పైగా నాట్లు పూర్తి చేశారు. మిగిలిన విస్తీర్ణంలోనూ జోరుగా నాట్లు కొనసాగుతున్నాయి. 

సన్నరకం వడ్లకు తెగుళ్ల బెడద ఎక్కువగా ఉంటుందనే కారణంతో రైతులు గతంలో సన్నాల సాగుపై రైతులు ఆసక్తి చూపేవారు కాదు. పంట విస్తీర్ణంలో సగానికి పైగా దొడ్డు రకమే పండించేవారు. కోతలు ముగిశాక గవర్నమెంట్​ కొనుగోలు కేంద్రాల్లో అమ్మేవారు. మొన్నటి ఖరీఫ్​లో రైస్​మిల్లర్లు తరుగు లేకుండా సన్నరకం పచ్చి వడ్లను క్వింటాల్ కు రూ.2,900 చెల్లించి కొన్నారు. గవర్నమెంట్​ ఏ గ్రేడ్ రకం వడ్లకు రూ.2,203, సాధారణ బీ గ్రేడ్​ రకానికి రూ.2,183 మద్దతు ధర ప్రకటించింది. రైస్​మిల్లర్లు అంతే కంటే ఎక్కువ ధర చెల్లించడంతో రైతులు అటే క్యూ కట్టారు. సర్కార్​ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించేందుకు ఆస్తకి చూపలేదు. 

నీటి విడుదలపై ధీమా

జిల్లాలో నిజాంసాగర్, అలీసాగర్ ప్రాజెక్టులు, గుత్ప, చౌట్​పల్లి హన్మంత్​రెడ్డి ఎత్తిపోతల పరిధిలో రెండున్నర లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఎస్సారెస్పీ కింద 33,131 ఎకరాలు, గోదావరి, మంజీరా నదులపై ఉన్న మైనర్​ లిఫ్ట్​ఇరిగేషన్ల​ కింద మరో నాలుగు వేల ఎకరాల ఆయకట్టు ఉంది. జిల్లాలో 1.80 లక్షల బోరుబావులు ఉన్నాయి. 

కాంగ్రెస్​గవర్నమెంట్​ వచ్చాక కరెంట్​సరఫరా మెరుగయ్యింది. గతంలో లేనివిధంగా ప్రాజెక్టులు, లిఫ్ట్​ల ద్వారా ఇప్పటికే ఒక విడత నీటి తడి విడుదల చేశారు. దీంతో పంట సాగుపై రైతుల్లో ధీమా ఏర్పడింది. ప్రతి పది రోజుల వ్యవధిలో యాసంగి సీజన్ ముగిసేదాకా ఆరు తడుల్లో నీటిని విడుదల చేయాలని ఇరిగేషన్​ఆఫీసర్లు ప్రణాళికలు రూపొందించారు. అయితే గతేడాది 1,475 ఎకరాలున్న కూరగాయాల సాగు, ఈసారి 755 ఎకరాలకు తగ్గడం మాత్రం బాధాకరం. 

15 రోజుల్లో నాట్లు పూర్తి 

సన్నరకం వరి సాగు కోసం అధిక శాతం రైతులు గంగా కావేరి, జేజీఎల్​1784 సీడ్​ఎంచుకున్నారు. ఇప్పటికే 2 లక్షల ఎకరాల్లో నాట్లు పూర్తయ్యాయి.​ బెంగాల్, బిహార్​ రాష్ట్రాల నుంచి వచ్చిన కూలీలు ఎకరం లెక్కన డబ్బులు తీసుకొని నాట్లు వేస్తున్నారు. మరో 15 రోజుల్లో జిల్లాలో నాట్లు పూర్తి కానున్నాయి. ఇప్పటి వరకు జిల్లాలో 40 వేల ఎకరాల్లోనూ దొడ్డురకం వరి నాట్లు పూర్తి కాలేదు.