- దరఖాస్తులు తీసుకొని పంపిణీ మరిచిన గత సర్కారు
- కేటాయింపులకు ముందే ఇండ్లు శిథిలం
నిజామాబాద్, వెలుగు: డబుల్ బెడ్ రూమ్ ఇండ్లిస్తామని ఆశ చూపి జిల్లాలోని పేదల నుంచి గత ప్రభుత్వం వేల సంఖ్యలో దరఖాస్తులు తీసుకుంది. కానీ కొద్ది మందికి మాత్రమే ఇండ్లను కేటాయించింది. నిర్మాణాలు పూర్తయిన ఇండ్లను లబ్ధిదారులకు కేటాయించకపోవడంతో కొన్ని చోట్ల ఇండ్ల తలుపులు, కిటికీలను దొంగలు ఎత్తుకెళ్లారు. నిజామాబాద్, బోధన్‌లో నిర్మించిన ఇండ్లు శిథిలావస్థకు చేరాయి. జనసంచారం లేని ప్రాంతాల్లో నిర్మించిన ఇండ్లు పేకాట, మందు తాగడం లాంటి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి.
దిష్టిబొమ్మల్లా ఇండ్లు..
గడిచిన పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్జిల్లాలో 10,416 ఇండ్లను నిర్మించింది. బోధన్‌లో 1,712, ఆర్మూర్‌లో 2,130, బాల్కొండలో 2,580, రూరల్‌లో 1,514, అర్బన్‌లో 2,330 డబుల్బెడ్రూమ్ ఇండ్లు కట్టారు. వీటిలో బాల్కొండ, అర్బన్నియోజకవర్గాల్లో కొద్దిపాటి ఇండ్లను మాత్రమే లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అర్హులైన మిగతావారికి కూడా ఇస్తామంటూ వేల సంఖ్యలో దరఖాస్తులు తీసుకొని వదిలేశారు.
ఇలా అర్బన్‌లో 45 వేల దరఖాస్తులు రాగా, 22,350 మంది అర్హులుగా ఆఫీసర్లు లెక్క తేల్చారు. నిర్మాణాలు పూర్తయిన వాటిని ఎప్పటికప్పుడు అర్హులకు కేటాయిస్తే ఫలితం ఉండేది, కానీ అలా జరగలేదు. నిర్మాణాలకు రూ.కోట్లు ఖర్చు చేసి రాజకీయాలు చేశారు. అసహనంతో పేదలు ఇండ్లను ఆక్రమించుకునేందుకు ప్రయత్నాలు చేయగా, పోలీసులతో అడ్డుకున్నారు. సిటీలోని దొడ్డి కొమురయ్య కాలనీలో పూర్తయిన 390 ఇండ్లకు రెండేండ్ల కింద మంత్రి హోదాలో కేటీఆర్ ప్రారంభోత్సవం చేయగా, అర్హులకు అప్పగించనే లేదు. ఇండ్లలోని కరెంట్ వైర్లు, తలుపులను దొంగలు ఎత్తుకెళ్లారు. నాగారంలో నిర్మించిన ఇండ్లను రెండు రోజుల కింద పేదలు ఆక్రమించే ప్రయత్నం చేయగా, అక్కడ పోలీసులను కాపలాగా పెట్టారు.
సర్కార్ ఆశపెట్టి మోసం చేసింది
ఇండ్లు అడిగినప్పుడల్లా దరఖాస్తు పెట్టుకోమనేవారు. ఎవరికీ ఇవ్వక కండ్ల ముందే ఇండ్లు ఖరాబ్ అవుతుంటే బాధగా ఉంది. ప్రజల పైసలతో నిర్మించిన ఇండ్లు పేదలకు ఇవ్వడానికి బాధేందో తెల్వదు. కొత్త గవర్నమెంట్ అయిన ఇండ్లు ఇస్తుందన్న భరోసాతో ఉన్నాం.
– లత, నిజామాబాద్
ఏండ్లుగా కిరాయి ఇంట్లో ఉంటున్నం
12 ఏండ్ల సంది కిరాయి ఇంట్లో ఉంటున్నం. మా ఆయన సంపాదన అంతంత మాత్రమే. సొంతంగా ఇల్లు కట్టుకునే స్థోమత లేదు. డబుల్‌బెడ్ రూమ్ ఇండ్లపై ఆశతో పలుమార్లు దరఖాస్తులు చేశాం. ఇగో ఇస్తున్నమంటూ ఎలక్షన్ల దాకా లాక్కొచిండ్రు. వాటిని ఖాళీగా వదిలేయడం వల్ల కలిగే ప్రయోజనమేందో అర్థమైతలే.
లక్ష్మీ, గాయత్రీనగర్