భూములు తిరిగివ్వాలని రైతుల డిమాండ్.. పురుగు మందు తాగేందుకు యత్నం

నిజామాబాద్​  జిల్లా మంచిప్పలో తమ భూములు తిరిగివ్వాలంటూ పలువురు పురుగు మందు తాగుతామని నిరసన తెలపడం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచిప్పలో ఓ సంస్థ చేపట్టిన ప్రాజెక్టులో 21 వ ప్యాకేజీ నిర్మాణానికి పలువురు రైతులు భూములు లీజ్​కి ఇచ్చారు.ఆ భూముల్ని తిరిగి ఇవ్వాలని చాలా రోజులుగా కర్షకులు డిమాండ్​ చేస్తున్నారు.

సంస్థ భూముల్ని తిరిగి ఇవ్వకపోవడంతో నిర్మాణ పనుల వద్ద ఆందోళనలు తెలిపారు. ఈ క్రమంలో పలువురు రైతులు పురుగుల మందు తాగడానికి యత్నించారు. పక్కన ఉన్న వారు చేతిలోంచి డబ్బాను లాక్కున్నారు. నవయుగ కంపెనీ తమ భూములు కబ్జా చేస్తోందంటూ వారు ఆరోపిస్తున్నారు. మరి కొందరు రైతులు టవర్​ ఎక్కి నిరసన తెలిపారు. భూములు వెంటనే అప్పగించాలని వారు డిమాండ్​ చేశారు.