సగమే కొన్నరు .. నిజామాబాద్లో గవర్నమెంట్​ వడ్ల కొనుగోళ్ల పరిస్థితి

  • 8 లక్షల టన్నుల టార్గెట్​కు కొనుగోలు చేసింది 4 లక్షల టన్నులే
  • కర్నాటక, ఆంధ్రా మిల్లర్లు కొన్న వడ్లు 9 లక్షల టన్నులు
  • అధిక ధర చెల్లించడంతో మిల్లర్లకు అమ్మేందుకే రైతుల ఆసక్తి
  • జిల్లాలో కస్టమ్​ మిల్లింగ్​పై ప్రభావం

నిజామాబాద్, వెలుగు: ఖరీఫ్​లో రైతుల నుంచి 8 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించాలని టార్గెట్​ పెట్టుకున్న సివిల్ ​సప్లయ్​ ఆఫీసర్లు 4 లక్షల టన్నులతో సరిపెట్టారు. వరి కోతలు షురూ కాగానే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన మిల్లర్లు ఎక్కువ శాతం వడ్లను కొన్నారు. దీంతో గవర్నమెంట్​కొనుగోళ్లు తగ్గాయి. సర్కారు మద్దతు ధర కంటే మిల్లర్లు ఎక్కువ రేటు ఇవ్వడంతో రైతులు అటే మొగ్గుచూపారు. జిల్లాలో మిల్లర్లు సుమారు 9 లక్షల టన్నుల వడ్లను కొన్నారు.

ఎలక్షన్​.. మిల్లర్ల అధిక ధర..

జిల్లాలో 5.20 లక్షల ఎకరాల సాగు భూమి ఉంది. ఖరీఫ్​లో 4.10 లక్షల ఎకరాల్లో రైతులు వరి వేశారు.13 లక్షల టన్నుల దిగుబడి అంచనా వేయగా, అందులో 80 శాతం వడ్లు సన్నాలే. గవర్నమెంట్​ మద్దతు ధరను పెంచి ఏ గ్రేడ్​ రకం క్వింటాల్​కు రూ. 2,260, బీ గ్రేడ్​కు రూ.2,183 చెల్లించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ఆఫీసర్లు కనీసం 8 లక్షల టన్నుల ధాన్యం కొనాలని లక్ష్యం పెట్టుకున్నారు.

నవంబర్​లో 433 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి కొనుగోళ్లు స్టార్ట్ ​చేశారు. దానికి ముందే కర్నాటక, ఆంధ్రా నుంచి వచ్చిన రైస్​మిల్లర్లు పచ్చి వడ్లను క్వింటాల్​కు రూ.2,600 రేటుతో కొన్నారు. కొన్న రెండు రోజులకే ఆన్​లైన్​లో బిల్లులు చెల్లించారు. ఎక్కువ రేటు చెల్లించి, పచ్చి వడ్లు కొనడం లాభసాటి కావడంతో రైతులు మిల్లర్లకు సన్నరకం వడ్లు అధిక శాతం అమ్మారు.

మిల్లర్లు వెళ్లిపోయాక మిగిలిపోయిన సన్నాలతో పాటు వారు కొనని దొడ్డరకం వడ్లనే ఆఫీసర్లు గవర్నమెంట్​తరఫున సేకరించారు. రెండు రోజుల కింద గవర్నమెంట్ కొనుగోళ్లు కూడా ముగిశాయి. సీజన్ ​మొత్తం కేవలం 4 లక్షల టన్నులు ధాన్యం సేకరణతో సరిపెట్టారు. అదే గతేడాది ఖరీఫ్​లో 6.5 లక్షల టన్నులు, యాసంగిలో 9 లక్షల టన్నులు కొనుగోలు చేశారు.

మిల్లర్ల హై రేటెందుకు..?

వరిసాగు ఆశాజనకంగా లేని రాష్ట్రాల మిల్లర్లు అక్కడ సన్నబియ్యానికి ఉన్న డిమాండ్​ను ఇక్కడి కొనుగోళ్లతో భర్తీ చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 2,55,461 మంది రైతులుండగా,  62,375 మంది మాత్రమే గవర్నమెంట్​కు వడ్లు అమ్మారు. మిగిలిన వారిలో వరికి బదులు ఇతర పంటలు సాగుచేసిన రైతులను తీసేసినా దాదాపు లక్షన్నర మంది మిల్లర్లకు తమ ధాన్యాన్ని విక్రయించారు.

యాసంగిలో కూడా ఇదే పరిస్థితి పునరావృతమైతే జిల్లాకు బియ్యం కొరత ఏర్పడే ప్రమాదముంది. అయితే మిల్లర్లు చెల్లిస్తున్న రేటును గవర్నమెంట్​ కూడా ఇవ్వొచ్చు కదా అనే ప్రశ్న రైతుల నుంచి మొదలైంది. కాంగ్రెస్ ​పార్టీ ఎన్నికల టైమ్​లో ప్రకటించిన క్వింటాల్​కు రూ.500 బోనస్​ను ఈ సందర్భంగా తెరమీదికి తెస్తున్నారు.

కస్టమ్​మిల్లింగ్​పై ప్రభావం

గవర్నమెంట్​ కొనుగోలు చేసే వడ్లను బియ్యంగా మార్చి పీడీఎస్​ కింద రేషన్​కార్డు హోల్డర్లకు అందిస్తోంది. వడ్ల మిల్లింగ్​ బాధ్యతను మిల్లర్లకు అప్పగిస్తుంది. జిల్లాలో 4.02 లక్షల కార్డులుండగా, ప్రతినెలా 8,700 మెట్రిక్​టన్నుల బియ్యం సరఫరా అవుతోంది. కొరత ఏర్పడితే బియ్యాన్ని సర్కార్​ ఇతర జిల్లాల నుంచి తెప్పించి పంపిణీ చేస్తుంది. ఈ సీజన్​లో వడ్ల కొనుగోళ్లు తక్కువగా ఉండడం కస్టం మిల్లింగ్​యాక్టివిటీని తగ్గించనుంది. ఈ ప్రభావం మిల్లర్లపై పడనుంది.