- చెలరేగిన ఫరూఖీ, ఒమర్‌జాయ్
- రాణించిన హష్మతుల్లా, రహ్మత్
- లంక సెమీస్ ఆశలపై నీళ్లు!
పుణె: వన్డే వరల్డ్‌కప్‌లో చిన్న జట్టు అఫ్గానిస్తాన్ అనూహ్యంగా చెలరేగిపోతోంది. ఇప్పటికే ఇంగ్లండ్, పాకిస్తాన్‌కు షాకిచ్చి ఆ రెండు జట్ల సెమీఫైనల్ అవకాశాలను దెబ్బకొట్టిన అఫ్గాన్స్ ఇప్పుడు శ్రీలంకను ముంచేశారు. ఖతర్నాక్ బౌలింగ్, సూపర్ బ్యాటింగ్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో అఫ్గాన్ 7 వికెట్ల తేడాతో లంకను చిత్తు చేసింది. ఆరు మ్యాచ్‌ల్లో మూడో విజయంతో ఆ జట్టు ఐదో ప్లేస్‌కు దూసుకురాగా... ఆరింటిలో నాలుగో ఓటమితో లంక సెమీస్ రేసు నుంచి దాదాపు వైదొలిగింది. ఏకపక్షంగా సాగిన ఈ పోరులో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 49.3 ఓవర్లలో 241 రన్స్‌కే ఆలౌటైంది.
ఓపెనర్ పాథుమ్ నిశాంక (60 బాల్స్‌లో 5 ఫోర్లతో 46) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కెప్టెన్ కుశాల్ మెండిస్ (39), సదీర సమరవిక్రమ (36) రాణించారు. అఫ్గాన్ బౌలర్లలో ఫజల్‌హక్ ఫరూఖీ (4/34) నాలుగు వికెట్లతో దెబ్బకొట్టాడు. ముజీబ్ రహ్మాన్ రెండు వికెట్లు తీశాడు. అనంతరం ఛేజింగ్‌లో అఫ్గాన్ 45.2 ఓవర్లలో 242/3 చేసి ఈజీగా గెలిచింది. అజ్మతుల్లా ఒమర్‌జాయ్ (63 బాల్స్‌లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 73 నాటౌట్), రహ్మత్ షా (74 బాల్స్‌లో 7 ఫోర్లతో 62), కెప్టెన్ హష్మతుల్లా షాహిది (74 బాల్స్‌లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 58 నాటౌట్)ఫిఫ్టీలతో సత్తా చాటారు. లంక బౌలర్లలో దిల్షన్ మదుషంక రెండు వికెట్లు తీశాడు. ఫరూఖీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
లంక కట్టడి
ఫ్లాట్ పిచ్‌పై మొదట బ్యాటింగ్‌కు వచ్చిన శ్రీలంకను ఫరూఖీ, ముజీబ్‌తో పాటు వందో వన్డే ఆడుతున్న రషీద్ ఖాన్ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఇబ్బంది పెట్టారు. క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో లంక అతికష్టంగా 200 మార్కు దాటింది. ఓపెనర్ నిశాంక ఉన్నంతసేపు కాన్ఫిడెన్స్‌గా బ్యాటింగ్ చేశాడు. సింగిల్స్, డబుల్స్‌తో పాటు చాన్స్ వచ్చినప్పుడల్లా బౌండ్రీలు కొట్టాడు. తరచూ లైన్ మిస్సవుతూ ఇబ్బంది పడ్డ మరో ఓపెనర్ దిముత్ కరుణరత్నే (15)ను ఆరో ఓవర్లో ఫరూఖీ ఎల్బీగా ఔట్ చేసి అఫ్గాన్‌కు ఫస్ట్ బ్రేక్ ఇచ్చాడు.
అయితే, వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ కుశాల్ మెండిస్ రెండో వికెట్‌కు నిశాంకతో 62, మూడో వికెట్‌కు సమరవిక్రమతో 50 రన్స్ జోడించాడు. దాంతో ఓ దశలో 134/2తో నిలిచిన లంక మంచి స్కోరు చేసేలా కనిపించింది. కానీ, తన వరుస ఓవర్లలో కుశాల్, సమరవిక్రమను పెవిలియన్ చేర్చిన స్పిన్నర్ ముజీబ్ లంక జోరుకు బ్రేక్ వేశాడు. కాసేపు ప్రతిఘటించిన ధనంజయ డిసిల్వ (14)ను రషీద్, చరిత్ అసలంక (22)ను ఫరూఖీ వెనక్కుపంపగా.. దుష్మంత చమీర (1) రనౌటవ్వడంతో లంక 185/7తో డీలా పడింది. చివర్లో ఏంజెలో మాథ్యూస్ (23), తీక్షణ (29) ఎనిమిదో వికెట్‌కు 45 రన్స్ జోడించడంతో లంక ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. ఈ ఇద్దరూ ఫరూఖీ బౌలింగ్‌లో ఔటవగా.. కాసున్ (5) రనౌటయ్యాడు.
అఫ్గాన్ అలవోకగా..
చిన్న టార్గెట్ ఛేజింగ్‌లో అఫ్గాన్‌కు స్టార్టింగ్‌లోనే ఎదురు దెబ్బ తగిలింది. ఇన్నింగ్స్ నాలుగో బాల్‌కే సూపర్ ఇన్‌స్వింగర్‌తో ఓపెనర్ గుర్బాజ్ (0)ను బౌల్డ్ చేసిన మదుషంక లంక శిబిరంలో జోష్ నింపాడు. కానీ, ఈ ఆనందం లంకకు ఎక్కువసేపు నిలవలేదు. మరో ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ (39), వన్‌డౌన్ బ్యాటర్ రహ్మత్ షా రెండో వికెట్‌కు 73 రన్స్ జోడించి మంచి పునాది వేశారు.
17వ ఓవర్లో జద్రాన్‌ను ఔట్ చేసిన మదుషంక మరోసారి లంకకు బ్రేక్ ఇచ్చాడు. ఈ దశలో రహ్మత్‌కు తోడైన హష్మతుల్లా ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. 22 ఓవర్లలో అఫ్గాన్ స్కోరు వంద దాటగా.. రహ్మత్ 61 బాల్స్‌లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత దూకుడు పెంచి వెంటవెంటనే రెండు ఫోర్లు కొట్టిన అతడిని కాసున్ పెవిలియన్ చేర్చాడు. దాంతో మూడో వికెట్‌కు 58 రన్స్ పార్ట్‌నర్‌షిప్ బ్రేక్ అవగా లంక పుంజుకునేలా కనిపించింది. కానీ, హష్మతుల్లాకు జతకలిసిన ఒమర్‌జాయ్ ఆ చాన్స్ ఇవ్వలేదు. క్రీజులో కుదురుకునేందుకు కాస్త టైమ్ తీసుకున్న అతను తర్వాత తీక్షణ, చమీర, మదుషంక ఓవర్లలో మూడు సిక్సర్లతో ఎదురుదాడికి దిగాడు. దాంతో లంక డిఫెన్స్‌లో పడింది. హష్మతుల్లాతో పాటు ఫిఫ్టీ పూర్తి చేసుకున్న ఒమర్‌జాయ్ అదే జోరు కొనసాగించడంతో మరో 28 బాల్స్ మిగిలుండగానే అఫ్గాన్ విజయాన్ని అందుకుంది