మహిళల అభివృద్ధి స్కీమ్‌లు, ప్రోగ్రామ్‌ల విషయంలో నవీన్ పట్నాయక్ నాయకత్వంలోని బిజూ జనతా దళ్ (బీజేడీ) ప్రభుత్వానికి మంచి పేరుంది. చట్టసభల్లో ఆడవాళ్లకు 33 శాతం రిజర్వేషన్లు కేటాయించడానికి వివిధ రాజకీయ పార్టీలు ఇష్టపడకపోయినా ఆయన లీడర్‌షిప్‌లోని బీజేడీ ఆ పనిని పక్కాగా చేసి చూపింది. సెల్ఫ్ హెల్ప్ గ్రూపులను అద్భుతంగా నిర్వహిస్తూ ఒడిశాని దేశంలోనే అగ్ర స్థానంలో నిలిపింది. అదే స్ఫూర్తిని కొనసాగించటం కోసం మరో కొత్త స్కీమ్‌కి రూపకల్పన చేసింది.
తరతరాలుగా జరుగుతున్న బాల్య వివాహాలకు రానున్న పదేళ్లలో పూర్తిగా తెర దించటానికి ‘శక్తి వర్త’ అనే ప్రోగ్రామ్‌ను అమలు చేయనుంది. దీనికోసం వచ్చే ఐదేళ్లలో చేపట్టే స్ట్రాటజిక్ యాక్షన్ ప్లాన్‌ని ప్రవేశపెట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా 2024 నాటికి చైల్డ్ మ్యారేజ్‌లను 10 శాతానికి తగ్గించాలని టార్గెట్‌గా పెట్టుకుంది. ఒడిశాలో ప్రస్తుతం 21.3 శాతం మంది వయసు నిండని పిల్లలకు పెళ్లిళ్లు జరుగుతున్నట్లు నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే–4లో తేలింది. నేషనల్ యావరేజ్ 26.8 శాతంగా నమోదైంది.
స్టడీ, కెరీర్‌కే ఎక్కువ ప్రయారిటీ
ఈ దురాచారాన్ని అరికట్టడంకోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేపట్టనున్నారు. మహిళలు, ఆడపిల్లల కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్కీమ్‌లు, చట్టప్రకారం కల్పిస్తున్న రక్షణలపై కాన్వాసింగ్ చేస్తారు. హయ్యర్ సెకండరీ, వొకేషనల్, టెక్నికల్ (ఐటీఐ లేదా ఐటీసీ లేదా పాలిటెక్నిక్) ఎడ్యుకేషన్‌లో ఎన్రోల్మెంట్ పెంచటంపై ఫోకస్ పెడతారు. ఆడపిల్లలకు రెసిడెన్షియల్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తారు. డే స్కాలర్స్ భద్రంగా స్కూల్స్, కాలేజీలకు వెళ్లి వచ్చేలా సేఫ్ ట్రాన్స్‌పోర్టేషన్ సౌకర్యం కల్పిస్తారు. చైల్డ్ మ్యారేజ్‌ల సమాచారాన్ని ఆఫీసర్లకు చేరవేయటానికి యాప్‌ను అందుబాటులోకి తెస్తారు.
అమ్మాయిలు, అబ్బాయిలు రెగ్యులర్‌గా బడికి వెళ్లేలా చూడటం, డ్రాపౌట్లను తగ్గించటం వంటి బాధ్యతలను స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలకు, కమ్యూనిటీలకు అప్పగిస్తారు. ఆడపిల్లలు తమ కాళ్లపై తాము నిలబడేలా చూస్తారు. తద్వారా వాళ్లకు పెళ్లి చేయాలనే ఆలోచన పేరెంట్స్‌కి రాకుండా చూస్తారు. హైస్కూల్ స్థాయిలో కెరీర్ కౌన్సెలింగ్ ఇస్తారు. టాలెంట్‌ని బట్టి అమ్మాయిలు స్పోర్ట్స్‌ని కెరీర్‌గా సెలెక్ట్ చేసుకునేలా ఎంకరేజ్ చేస్తారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న ట్రేడ్‌లో, బతుకు దెరువు చూపే కోర్సులో ట్రైనింగ్ ఇస్తారు. వివిధ సామాజిక వర్గాల ప్రజల్ని స్వచ్ఛంద కార్యక్రమాల్లో పాల్గొని నేర్చుకునేలా ద్వారా వారికి సోషల్, డెవలప్మెంట్ ఇష్యూస్‌పై అవగాహన పెంచనున్నారు.
ఏయే జిల్లాల్లో? ఎందుకు?
ఒడిశాలో ఎర్లీ మ్యారేజ్లు ఎక్కువ (39 శాతం) మల్కన్‌గిరి జిల్లాలోనే జరుగుతున్నట్లు గుర్తించారు. ఆ తర్వాత నవరంగ్‌పూర్, మయూర్భంజ్, కోరాపుట్, రాయగడ జిల్లాల్లోనూ చైల్డ్ మ్యారేజ్లు నమోదవుతున్నాయి. ఈ ప్రాంతాల్లో మూడో వంతు మందికి పైగా అమ్మాయిలకు పెళ్లీడు రాక ముందే మూడు ముళ్లు పడుతున్నాయి. నయాగఢ్, గంజాం, కియోంజార్, బాలాసోర్, డెంకనాల్, గజపతి జిల్లాల్లో నాలుగో వంతు మంది ఆడ పిల్లల్ని 18 ఏళ్లు నిండక ముందే ఒక అయ్య చేతిలో
పెడుతున్నారు.
మగవాళ్ల వలసల వల్లే!
పశ్చిమ ఒడిశా జిల్లాల్లో బాల్య వివాహాలకు గిరిజన సంప్రదాయాలతోపాటు పేదరికం ప్రధాన కారణమవుతోంది. వరకట్నాలు, పెళ్లి ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో అమ్మాయిల్ని సాధ్యమైనంతవరకు పెళ్లి చేసి పంపేయాలని ఆలోచిస్తున్నారు. దీంతో పిల్లల్ని బలవంతంగా పెళ్లి పీటలు ఎక్కిస్తున్నారు. వీటికితోడు మగవాళ్లు పొట్ట చేత పట్టుకొని వలస బాట పడుతుండటంతో ఇంట్లోని ఆడ పిల్లలకు రక్షణ కరువవుతోంది. త్వరగా ఓ ఇంటిదాన్ని చేస్తే బాధ్యత తీరిపోతుందని పేరెంట్స్ భావిస్తున్నారు. ఇంట్లో పెద్దోళ్ల సెంటిమెంట్లు, ఇతర కారణాలు కూడా బాల్య వివాహాలకు దారితీస్తున్నాయి.
‘శక్తి వర్త’లో ఆడవాళ్లకే బాధ్యతలు
‘శక్తి వర్త’ ఇనీషియేటివ్‌ని విజయవంతంగా అమలు చేసేందుకు ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఓ డ్రాఫ్ట్‌ని రెడీ చేసింది. స్ట్రాటజిక్ ప్లాన్‌ని గ్రామ స్థాయిలో మానిటర్ చేయటానికి మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్‌ని అభివృద్ధి చేస్తారు. తమ పిల్లలకు బాల్య వివాహాలు చేయకుండా పేరెంట్స్‌ని ఒప్పించటం, అవసరమైతే ఆఫీసర్ల సాయంతో అడ్డుకోవటం వంటి బాధ్యతలను సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల్లోని మహిళలకు అప్పగిస్తారు. వాళ్లనే కమ్యూనిటీ లీడర్లుగా నియమిస్తారు.
వర కట్నాల వసూళ్లు; వాటి పేరుతో ఆడవాళ్లపై వేధింపులు, అమ్మాయిలపై అఘాయిత్యాలు తదితర సమస్యల పరిష్కారానికి కూడా ఆ కమ్యూనిటీ లీడర్ల సేవలనే వాడుకుంటారు. బాలికలకు 18 ఏళ్లు నిండక ముందే పెళ్లి చేస్తే కలిగే నష్టాలు చెబుతారు. వివాహాలను వాయిదా వేసి ఆడపిల్లల్ని చదివించటం కలిగే ప్రయోజనాలను వివరిస్తారు.