కబ్జా చెయ్యాలంటే గుండెలు వణకాలి: సీఎం రేవంత్ రెడ్డి

కబ్జా చెయ్యాలంటే గుండెలు వణకాలి: సీఎం రేవంత్ రెడ్డి
  • సిటీ అభివృద్ధికి 2050 మెగా ప్లాన్.. 
  • ఓఆర్ఆర్ లోపల 12 జోన్లుగా కోర్ అర్బన్ ఏరియా
  • రోడ్లపై వరద నిలవకుండా 10 లక్షల లీటర్ల కెపాసిటీతో వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ 
  • మీరాలం చెరువుపై కేబుల్ బ్రిడ్జి..లండన్ తరహాలో హైదరాబాద్​లో ‘హై టవర్​’
  • గోషామహల్ పోలీస్ క్వార్టర్స్ స్థానంలో ఉస్మానియా హాస్పిటల్ కొత్త బిల్డింగ్ 
  • మూసీ రివర్ ఫ్రంట్ కు రూ.లక్షన్నర కోట్లు అని చెప్పలేదు.. అవి సిటీ అభివృద్ధి కోసమని వెల్లడి

హైదరాబాద్, వెలుగు : హైదరాబాద్​లో కబ్జాలను నివారించడానికి, సిటీ విస్తరణకు అనుగుణంగా అభివృద్ధి చేయడానికి హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అండ్ అసెట్స్ (హైడ్రా)ను ఏర్పాటు చేశామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ‘చెరువులు ఆక్రమించాలంటే భయపడాలి.. నాలాలు కబ్జా పెట్టాలంటే గుండెల్లో వణుకురావాలి’ అనే హైడ్రాను తీసుకొచ్చామని చెప్పారు. రోడ్లను ఆక్రమించుకుంటూ అడ్డంగా ఉంటామంటే కుదరదని హెచ్చరించారు. 

చాలా దేశాల్లో స్టడీ చేశాకే హైడ్రా ఏర్పాటుపై నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. శుక్రవారం అసెంబ్లీలో హైడ్రాపై రిప్లై సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడారు. ఇంతకుముందు జీహెచ్ఎంసీ పరిధి 600 చదరపు కిలోమీటర్ల మేర మాత్రమే ఉందని, ఇప్పుడు హైడ్రా ఏర్పాటుతో దాన్ని 2 వేల చదరపు కిలోమీటర్ల వరకు విస్తరించామని తెలిపారు.

‘‘మేడ్చల్ నియోజకవర్గంలో 7 మున్సిపాలిటీలు, 3 కార్పొరేషన్లు ఉన్నాయి. ఇదే​నియోజకవర్గంలో పంచాయతీలు కూడా ఉన్నాయి. ఇలా మూడు రకాల అడ్మినిస్ట్రేషన్లు ఉండడంతో వ్యవస్థంతా చిందరవందరగా తయారైంది. దీంతో అధికారుల మధ్య సమన్వయం లేదు. దీని వల్ల జీహెచ్ఎంసీలో ఉంటే వంద ఫీట్ల రోడ్డుంటే, మున్సిపల్​కార్పొరేషన్​పరిధిలోకి పోయే సరికి 80 ఫీట్లు, మున్సిపాలిటీ పరిధిలో 40 ఫీట్లు, గ్రామపంచాయతీ పరిధిలోకి రాగానే 20 ఫీట్ల రోడ్డుగా మారిపోతున్నది. 

దీంతో జీహెచ్ఎంసీ ఏరియాలోనే సిటీ నుంచి పంచాయతీ పరిధిలో ఉన్న ప్రాంతానికి వెళ్లే సరికి ట్రాఫిక్​జామ్​అయిపోతున్నది” అని రేవంత్​ అన్నారు. నాలాలు కూడా కుంచించుకుపోతున్నాయని, చెరువులు చాలా వరకు కబ్జాకు గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘కండ్ల ముందే చెరువులు మాయమైతుంటే.. ఏం చేస్తున్నారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 

వరద మన దగ్గరికి రావడం లేదు.. మనమే నీళ్లు ఉండే దగ్గర ఇండ్లు కట్టుకుంటున్నాం. హైదరాబాద్​లో రెయిన్​వాటర్ డ్రైన్స్​ను కేవలం 2 సెంటీమీటర్ల వర్షం వరకే నిర్మించుకున్నాం. కానీ, ఇప్పుడు 16 సెంటీమీటర్ల వరకు వర్షం పడుతున్నది. మారిన వాతావరణ పరిస్థితులు, కాలుష్యం, క్లైమేట్​చేంజ్ వంటి వాటి వల్ల ఒక్కోసారి ఒక్కోచోట కుంభవృష్టిలాగా వర్షం కురుస్తున్నది.

 ఒకచోట ఎండ ఉంటే, మరోచోట భారీ వర్షం కురుస్తున్నది. ఇలాంటి టైమ్ లో రోడ్లపై భారీగా వరద చేరి, అది నాలాల్లోకి వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. దాంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అవుతున్నది. దీన్ని స్ట్రీమ్​లైన్​ చేయాల్సిన అవసరం ఉంది” అని పేర్కొన్నారు. గత పాలకులు విశ్వనగరం అంటూ అబద్ధాలు చెప్పారని విమర్శించారు. ‘‘అబద్ధాల మేడలు, అద్దాల గోడలు.. అభివృద్ధి కాదు. 

ప్రపంచంతో పోటీ పడేలా హైదరాబాద్ ను తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రచించాం. సిటీ అభివృద్ధి కోసం సంస్కరణలు తీసుకొస్తున్నాం. ఓఆర్ఆర్ లోపల రాచకొండ, సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్లు ఉన్నాయి. అటు మెదక్ కమిషనరేట్ ఉంది. ఇలా వివిధ ప్రాంతాలకు చెందిన అధికారులు ఉండడం వల్ల సమన్వయలోపం ఏర్పడుతున్నది. అందుకే మాస్టర్ ప్లాన్​తయారు చేయాలన్న ఉద్దేశంతో సిటీని విస్తరించేందుకు ప్రణాళిక రచించాం’’ అని వెల్లడించారు. 

రోడ్లపై వరద నిలవకుండా చర్యలు.. 

చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇద్దరికీ రాజకీయాల పరంగా భిన్నాభిప్రాయాలు ఉన్నా.. హైదరాబాద్ అభివృద్ధి కోసం ఇద్దరూ కలిసి పనిచేశారని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. చంద్రబాబు మొదలుపెట్టిన ఓఆర్ఆర్​ను వైఎస్ విస్తరిస్తే, దాన్ని రూ.7,300 కోట్లకు గత పాలకులు అమ్ముకున్నారని విమర్శించారు. ‘‘కాంగ్రెస్​ఏం చేసిందని కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. వాళ్ల నాయనను సింగిల్ విండో చైర్మన్​ను చేసింది. వాళ్ల బావ వార్డ్​మెంబర్ కాకపోయినా మంత్రిని చేసింది. సోనియాగాంధీ తెలంగాణ ఇస్తేనే.. వాళ్లు అధికారంలోకి వచ్చారు” అని అన్నారు.

 ‘‘చిన్న వర్షం పడినా రోడ్లపై భారీ వరద నిలుస్తున్నది. దాన్ని నియంత్రించేలా భారీ వాటర్​హార్వెస్టింగ్​వెల్స్​నిర్మించాలని అధికారులకు ఇప్పటికే సూచించాం. ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసుకు ఎదురుగా నీళ్లు నిలవకుండా, ఆర్టీఏ ఆఫీసులో 10 లక్షల లీటర్ల వాటర్​ హార్వెస్టింగ్​ పిట్​ను నిర్మించాలని ఇప్పటికే ఆదేశించాం. అక్కడి నుంచి నాలాలకు పంపింగ్​ చేసేలా చూడాలన్నాం. రాజ్​భవన్​ ముందు కూడా రోడ్లపై వరద ఉంటున్నది. నర్సింగ్​కాలేజీ దగ్గర కూడా ఓ వాటర్​హార్వెస్టింగ్​వెల్ నిర్మించాలని చెప్పాం. 

సిటీ మొత్తం కాంక్రీట్ జంగిల్ అయి గ్రౌండ్​వాటర్ పడిపోతున్నది. దాన్ని పెంచుకునేందుకు కూడా ఈ వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ ఉపకరిస్తాయి. సిటీ బ్యూటీఫికేషన్​లో భాగంగా రోడ్డు మధ్యన ఐలాండ్స్​ కడుతున్నాం. దాని కింద భారీ వాటర్ ​హార్వెస్టింగ్ ​వెల్ నిర్మించాలని అధికారులకు చెప్పాం. బయో డైవర్సిటీ పార్క్​ దగ్గర కూడా అలాంటిది కట్టి, ఖాజాగూడ చెరువుకు కనెక్షన్​ఇచ్చేలా ప్రణాళిక తీసుకున్నాం” అని చెప్పారు. ‘‘సిటీలో 141 బ్లైండ్​స్పాట్స్​ను గుర్తించాం. ఆయాచోట్ల హైడ్రాకు చెందిన డిజాస్టర్​ మేనేజ్​మెంట్​సిబ్బందిని వర్షం రావడానికి గంట ముందే మోహరించేలా డిజైన్ చేశాం. వరదను పంపింగ్​చేసేందుకు భారీ మోటార్లను సిద్ధం చేస్తున్నాం’’ అని పేర్కొన్నారు. 

ఫిజికల్ పోలీసింగ్​కు ఆదేశాలిస్తాం.. 

సిటీలో రోడ్లపై వరద నిలవకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘‘ఇన్నాళ్లూ ఆఫీసు పనులకే పరిమితమైన పోలీసు అధికారులను ఫిజికల్ పోలీసింగ్​కు అలవాటు చేస్తున్నాం. రోడ్లపై ట్రాఫిక్ ఆగకుండా, వరద నిలవకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలిస్తాం. వారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు. ఒకవేళ వాళ్లు రోడ్ల మీదకు వచ్చి పని చేయకుంటే, సీఎంగా నేనే రోడ్డు మీదికొచ్చి పని చేయాల్సి ఉంటుంది. అప్పుడు అధికారులు ఎట్ల పని చేయరో చూస్తాను” అని హెచ్చరించారు.

 ‘‘హైదరాబాద్ నగరమే మన బ్రాండ్. ఈ బ్రాండ్​ను కాపాడుకునేందుకు అనుక్షణం ప్రయత్నిస్తున్నాం. కానీ ఈ బ్రాండ్​ను దెబ్బ తీసేందుకు చాలామంది ప్రయత్నిస్తున్నారు. శాంతి భద్రతలు లేవంటున్నారు. మర్డర్లు జరుగుతున్నాయంటున్నారు. అన్ని లెక్కలను నేను తీశాను. సింగరేణి కాలనీలో ఓ చిన్నారిని ఒకడు గంజాయి మత్తులో అత్యాచారం చేసి చంపేస్తే.. నాటి ప్రభుత్వం కనీసం పరామర్శించిందా? ఓ మంత్రి అయినా వాళ్ల ఇంటికి వెళ్లారా? శంషాబాద్ ఎయిర్​పోర్టుకు పక్కన ఓ డాక్టర్​ను క్రిమినల్స్​ఎత్తుకెళ్లి రేప్​ చేసి చంపేసినా గత పాలకులు వెళ్లారా? కానీ అలాంటి వాళ్లే ఇప్పుడు మా ప్రభుత్వంపై తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారు’’ అని మండిపడ్డారు.  

మూసీ ప్రాజెక్టు అంచనాలు రూపొందించలేదు.. 

మూసీ రివర్ ఫ్రంట్​అభివృద్ధికి రూ.లక్షన్నర కోట్లు అవసరమవుతాయని తాను ఎప్పుడూ చెప్పలేదని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. బీఆర్ఎస్​సభ్యులు మాటలు విడ్డూరంగా ఉన్నాయని మండిపడ్డారు. అసలు ఇప్పటిదాకా ఆ ప్రాజెక్టుకు అంచనాలే రూపొందించలేదని స్పష్టం చేశారు. వచ్చే ఐదేండ్లలో సిటీ అభివృద్ధికి ఎన్ని నిధులు అవసరమవుతాయో మాత్రమే తాము చెప్పామని పేర్కొన్నారు. 

‘‘ఒక్క ట్రిపుల్ ఆర్​కే రూ.75 వేల కోట్లవుతాయి. కేంద్రం సాయం చేస్తే సగం డబ్బులతో పనవుతుంది. రేడియల్​రోడ్లకు రూ.15 వేల కోట్లు, సుంకిశాల నీళ్లు కావాలంటే ఇంకో రెండు వేల కోట్లు, గోదావరి జలాలు సిటీకి రావాలంటే రూ.7 వేల కోట్ల దాకా ఖర్చవుతాయి. ఇవన్నీ సిటీ అభివృద్ధికి అంచనాలు. పదేండ్లు పాలించినోళ్లు రూ.7 లక్షల కోట్ల అప్పులు చేసి పోయారు.

మేం అధికారంలోకి వచ్చి పది నెలలే అవుతున్నా, మాపై ఎందుకిన్ని ఆరోపణలు చేస్తున్నారు. పదేండ్లు ఏలిన మీరే అధికారం పోయిందని ఇంత బాధపడితే.. 700 ఏండ్లు పాలించిన నిజాం నవాబులు ఇంకెంత బాధపడాలి. అమెరికా చదువుని రాష్ట్రాన్ని చెడగొట్టడానికి ఎందుకు వాడాలి.. మంచి చేయడానికి వాడొచ్చు కదా’’ అని అన్నారు. 

మైక్​ఇవ్వొద్దనడానికి వాళ్లెవరు?  

ఇతర సభ్యులకు మైక్​ఇవ్వొద్దని చెప్పడానికి బీఆర్ఎస్​ఎమ్మెల్యేలు ఎవరని సీఎం రేవంత్​రెడ్డి ప్రశ్నించారు. సభ్యులకు మైక్​ఇచ్చే విచక్షణాధికారం స్పీకర్​దేనని చెప్పారు. ‘‘ఎవరైనా తమ నియోజకవర్గానికి సంబంధించి మాట్లాడాలనుకున్నప్పుడు స్పీకర్​విచక్షణాధికారంతో మైక్​ ఇస్తారు. కానీ మైక్​ కూడా ఎవరికివ్వాలో వాళ్లెలా డిసైడ్​ చేస్తారు. మైక్ ఇవ్వకుంటే పోడియం దగ్గరకు పోయి నిరసన చేయడమేంటి? ఏం చేయాలో మాకు కూడా తెలుసు. 

అన్నీ ఓపిక పడుతున్నాం. కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి, సంపత్​ కుమార్​లపై ఎలా అనర్హత వేటు వేశారో మాకు తెలియదా? మేం కూడా అరడజను మంది సభ్యులపై అనర్హత వేటు వేస్తే.. మళ్లీ ఎవరూ పోడియం వరకు పోరు’’ అని హెచ్చరించారు. 

కిషన్ రెడ్డిని పిలిచినా రాలేదు.. 

కేంద్రం నుంచి వచ్చే నిధులపై చర్చించేందుకు ఓసారి సెక్రటేరియెట్​కు రావాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని ఆహ్వానించానని.. కానీ వస్తానని చెప్పిన ఆయన ఇంత వరకు జాడ లేరని సీఎం రేవంత్​ రెడ్డి అన్నారు. ‘‘ప్రధాని మోదీ, అమిత్​షా మూడుసార్లు కలిసినా.. కిషన్ రెడ్డి మాత్రం కలవలేదు. హైదరాబాద్​కు వరదలొచ్చినా రూపాయి తేలేకపోయారు. తెలంగాణ ప్రజలు చేసుకున్న పాపమేంటి? కనీసం నన్ను కలవడానికి కూడా రాలేదు. 

నన్ను కలిస్తే ఆయన మిత్రుడు (కేసీఆర్) బాధపడతారనుకున్నారేమో” అని అన్నారు. కిషన్​రెడ్డి, బండి సంజయ్, బీజేపీ ఎమ్మెల్యేలు అందరూ వస్తే సెక్రటేరియెట్​లో అధికారులందరితో కలిసి చర్చించుకుందామని చెప్పారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసమే అందరితో సత్సంబంధాలు కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు.

గంజాయి అమ్మే దమ్ముందా? 

గత ప్రభుత్వ హయాంలో రాత్రి పాన్​షాపుల్లో గంజాయి దొరుకుతుండేది. కానీ ఆ పరిస్థితి మారింది. ఇప్పుడు ఎవడికైనా గంజాయి అమ్మే దమ్ముందా? ఎవడికైనా దమ్ముంటే వచ్చి అమ్మమనండి చూద్దాం? పార్టీలు, పబ్​ల పేర్లతో ఫామ్​హౌస్​లలో డ్రగ్స్​సరఫరా చేసేటోళ్లకు ఎవరితో సంబంధాలున్నాయో చర్చ చేద్దామా? అందరి జాతకాలూ మాకు తెలుసు. బాధ్యత గల పదవిలో ఉన్నాం కనుక.. వాటిని బహిరంగంగా చెప్పదలచుకోలేదు.- సీఎం రేవంత్ రెడ్డి

మీరాలం చెరువు మీద కేబుల్ ​బ్రిడ్జి.. 

మీరాలం చెరువు మీద 2.5 కిలోమీటర్ల పొడవునా మరో కేబుల్ బ్రిడ్జి కడతామని సీఎం రేవంత్​రెడ్డి తెలిపారు. త్వరలోనే దానికి సంబంధించిన ప్రణాళిక ఇస్తామని, ఆ బ్రిడ్జిని పీవీ నర్సింహారావు ఫ్లైఓవర్​కు కనెక్ట్​ చేస్తామని చెప్పారు. లండన్​హై లాంటి టవర్​ను మీరాలం చెరువులో కట్టాలనుకుంటున్నామని, ‘హైదరాబాద్​ హై’లాగా దాన్ని నిర్మిస్తామని వెల్లడించారు. ‘‘బీఆర్ఎస్​పాలకులు సిటీలో ఏం కట్టారు. వారి సౌలభ్యం కోసం ప్రగతి భవన్​తప్ప.. ఇంకేం కట్టారు? మసీదులను కూలగొట్టిన పాపం ఎక్కడికపోతుంది. వారి సెంటిమెంట్ల కోసం ప్రజల సెంటిమెంట్లను తుంగలోకి తొక్కితే.. ఏమవుతుందో వారిని చూస్తే తెలుస్తుంది” అని అన్నారు. 

సిటీకి తాగునీళ్లిచ్చిందే కాంగ్రెస్.. ​

హైదరాబాద్​కు తాగునీళ్లు తెచ్చిందే కాంగ్రెస్​అని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. ‘‘నిజాం కాలంలో కట్టిన హిమాయత్​సాగర్​, ఉస్మాన్​సాగర్​సిటీ తాగునీటి అవసరాలు తీరుస్తున్నాయి. అట్లాంటి మానవ నిర్మిత అద్భుతాలు మహానగరంలో ఉన్నాయి. కానీ తాగునీటి అవసరాలకు అవి సరిపోలేదు. అందుకే 1965లో కాంగ్రెస్​ప్రభుత్వం మంజీరా నీటిని అందించింది. సింగూరు ప్రాజెక్టు ద్వారా 1982లో తాగునీటిని తీసుకొచ్చింది. 

కృష్ణా నది నుంచి నీళ్లను తీసుకొచ్చేందుకు నాడు పి.జనార్దన్​రెడ్డి ఎంతో పోరాడారు. ఆయన పోరాటంతో టీడీపీ ప్రభుత్వం తలొగ్గి 2004లో కృష్ణా ఫేజ్​1 ద్వారా తాగు నీటిని తీసుకొచ్చింది. 2008లో కృష్ణా ఫేజ్​2, 2014లో కృష్ణా ఫేజ్ 3 తాగునీటి పథకాలను హైదరాబాద్​కు నాటి కాంగ్రెస్​ ప్రభుత్వం తెచ్చింది. మేం పూర్తి చేసిన గోదావరి ఫేజ్​1ను ఒకాయన పోస్టర్లు వేసుకుని ప్రారంభిండు. 

మేం శిల్పారామం కడితే ఆయన సెల్ఫీలు తీసుకుండు.. మేం కట్టిన హైటెక్​ సిటీ, ఓఆర్ఆర్, ఇంటర్నే షనల్​ ఎయిర్​పోర్ట్, ఫార్మా క్లస్టర్లను వాళ్ల తాత ముత్తాతలే తెచ్చినట్టు చెప్పుకుంటూ సెల్ఫ్​డబ్బాలు కొట్టుకున్నా మేం ఏమీ అనలేదు. వారి కాలం కలిసొచ్చి అట్ల అయ్యారు. కాలం కలిసొస్తే వానపాము కూడా బుసకొడ్తదన్నట్టు వాళ్లు ప్రవర్తించారు. జైపాల్​ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు, వైఎస్​ సీఎంగా ఉన్నప్పుడే కాంగ్రెస్​మెట్రో తీసుకొచ్చింది’’ అని చెప్పారు. 

ఉస్మానియా ఆసుపత్రి కడ్తం..

గోషామహల్​లోని పోలీస్​క్వార్టర్స్​స్థానంలో కొత్తగా ఉస్మానియా ఆసుపత్రిని నిర్మిస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. మరో పది పదిహేను రోజుల్లో ఆ బిల్డింగ్​కు శంకుస్థాపన చేస్తామని చెప్పారు. ఉస్మానియా హాస్పిటల్ పాత బిల్డింగ్​ను పరిరక్షిస్తామని తెలిపారు. ‘‘హైదరాబాద్ 2050 మెగా ప్లాన్​ను తయారు చేస్తున్నాం. కోర్ అర్బన్​ఏరియా, కోర్​సెమీ అర్బన్​ఏరియా, ట్రిపుల్ ఆర్, ఇన్నర్​రెయిల్​రింగ్​రోడ్​ను నిర్మిస్తాం” అని వెల్లడించారు. 

‘‘రాత్రి 11 గంటలకు షాపులు బంద్​చేయాలంటూ పోలీసులు కొడుతున్నారంటూ అక్బరుద్దీన్​ అంటున్నారు. ఓల్డ్ సిటీ ఏరియాలో రాత్రి ఒంటి గంట వరకు టైమ్ ఇవ్వాలని పోలీసులకు చెప్పాను. అయితే, మద్యం షాపులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అనుమతించేది లేదు. మేము కాస్మెటిక్​ పోలీసింగ్​ కాకుండా కాంక్రీట్​ పోలీసింగ్​చేయాలనుకుంటున్నాం. లా అండ్​ ఆర్డర్​ చేయి దాటిపోతే కష్టమని, రాష్ట్రానికి పెట్టుబడులు రావాలంటే సిటీలో శాంతి భద్రతలు కంట్రోల్​లో ఉండాలి. రౌడీయిజం చేస్తామంటే ఊరుకోం. ఫార్మా, ఫుడ్​ ఇండస్ట్రీ వంటివి ఏర్పాటు చేయాల్సి ఉంది. 

అందుకు లా అండర్​ ఆర్డర్​ను కంట్రోల్​లో పెట్టాల్సిన అవసరం ఉంది. దేశంలోనే హైదరాబాద్​ను అత్యంత అభివృద్ధి చెందిన నగరంగా తీర్చిదిద్దుతాం” అని తెలిపారు. గత పాలకులు ఓల్డ్​ సిటీని ఇస్తాంబుల్, ఇంకేదో చేస్తామని చెప్పి ఏమీ చేయలేదని.. తాను అంత పెద్దపెద్ద మాటలు చెప్పనుగానీ, కచ్చితంగా అభివృద్ధి చేస్తామన్నారు. 

మూసీ కబ్జాలు తొలగిస్తాం.. 

ఓఆర్ఆర్​లోపల కోర్ అర్బన్​ఏరియాను ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. హైడ్రాలో భాగంగా ఈ ఏరియాను 12 జోన్లుగా ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఒక్కో జోన్ కు ఒక్కో అధికారిని నియమిస్తామని పేర్కొన్నారు. హైదరాబాద్ లో హౌస్​నంబర్లనూ స్ట్రీమ్​లైన్​ చేయాల్సిన అవసరం ఉందన్నారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్​మెంట్ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తామని వెల్లడించారు. 

‘‘ప్రధాని మోదీ నిర్మించిన సబర్మతి రివర్ ఫ్రంట్ పై అధ్యయనం చేసేందుకు అధికారులను పంపించాం. 55 కిలోమీటర్ల మేర మూసీ రివర్​ఫ్రంట్​ను డెవలప్​చేస్తాం. ఈ ప్రాజెక్టుకు డీపీఆర్​లేదని విమర్శిస్తున్న వాళ్లు.. ఒక్కసారి వాళ్లు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఆలోచించుకోవాలి. ఆ ప్రాజెక్టును కట్టి లక్ష కోట్లు మింగారు. అదేమో కూలిపోయింది. ఇప్పటికీ ఆ ప్రాజెక్టుకు డీపీఆర్​లేనే లేదు. మేమెప్పుడు 80 వేల పుస్తకాలు చదివినమని చెప్పలేదు. మెదడంతా రంగరించి ప్రాజెక్టులు కట్టినమని అనలేదు. మేడిగడ్డ కడితే అది మేడిపండైంది. కానీ, మేం పని మొదలుపెట్టకముందే డీపీఆర్​లు కావాలంటే ఎట్లా? డీపీఆర్ లు, కాంట్రాక్టర్లెవరో తెలుసుకుని.. వాళ్ల నుంచి మళ్లీ కమీషన్లు దండుకుంటారా?” అని విమర్శించారు.

 మూసీ రివర్ ఫ్రంట్​కు రూ.10 వేల కోట్ల సాయం చేయాలని ప్రధాని మోదీని కోరామని, ప్రాజెక్టు కోసం గ్లోబల్​టెండర్ పిలిచామని తెలిపారు. ‘‘మూసీలోని కబ్జాలు తొలగించి, వాళ్లకు న్యాయం చేస్తాం. మూసీ చుట్టూ 10,800 మంది ఇండ్లు కట్టుకున్నారు. వాటి మీద లెక్కలు తీస్తున్నాం. పేదలు, నిరుపేదలకు ఆశ్రయం కల్పిస్తాం. వాళ్లకు డబుల్​ బెడ్రూం ఇండ్లు ఇవ్వాలని ఆదేశించాం. 

వాళ్లు తమ ఆస్తినిస్తే టీడీఆర్​ఇవ్వాలని నిర్ణయించాం. మూడో ఆప్షన్​ కింద ప్రభుత్వ భూములిచ్చేందుకూ నిర్ణయించాం. నాలుగో ఆప్షన్​గా ప్రైవేటు వ్యక్తుల నుంచి భూసేకరణను పెట్టుకున్నాం. తొందర్లోనే టెక్నికల్ కమిటీ  ఏర్పాటు చేస్తాం. ఏ విధంగా ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలో ఆ కమిటీ చెప్తుంది. నేను రాష్ట్రానికి సీఎంగా ఏం చెప్పాలో అదే చెప్తాగానీ.. అంతకుమించి నేనేం చెప్పను. ఎవరు చేయాల్సిన పని వారిని చెయ్యనివ్వాలి’’ అని అన్నారు.