పాలమూరులో నియోజకవర్గానికి వెయ్యి ఇండ్లపై సైలెన్స్!
15 రోజుల్లో కార్యాచరణ ప్రారంభిస్తామని సీఎం హామీ
నెల దాటినా ఆఫీసర్లకు ఎలాంటి ఆదేశాల్లేవ్
గతంలో మంజూరు చేసిన ఇళ్లల్లో 40 శాతమే పూర్తి
మహబూబ్‌నగర్, వెలుగు : ‘ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రతి నియోజకవర్గానికి అదనంగా వెయ్యి డబుల్ఇండ్ల చొప్పున మంజూరు చేస్తాం. ఇక్కడ ఇంప్లిమెంట్చేసిన తర్వాత రాష్ట్రంలోని మిగతా నియోజకవర్గాలకు ఇండ్లు కేటాయిస్తాం. రానున్న పది, పదిహేను రోజుల్లో ఖాళీ జాగాలు ఉన్నవాళ్లకి రూ.3 లక్షలతో ఎమ్మెల్యేల నాయకత్వంలో ఇండ్లు మంజూరు చేయిస్తాం. అందరం కలిసి అద్భుతమైన పాలమూరు తయారు చేసుకుందాం.’
– డిసెంబరు 4న పాలమూరులో జరిగిన బహిరంగ సభలో సీఎం ప్రకటించి నెల రోజులవుతున్నా ఇంత వరకు అదనంగా వెయ్యి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణానికి ఎలాంటి కార్యాచరణ చేపట్టలేదు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో 14 నియోజకవర్గాలు ఉండగా నియోజకవర్గానికి వెయ్యి చొప్పున 14 వేల డబుల్ఇండ్లు నిర్మించాల్సి ఉంది. గతంలో ఒక ఇంటి నిర్మాణానికి సర్కారు రూ.5.50 లక్షలు కేటాయించగా, పట్టణ ప్రాంతాల్లో మరో రూ.50 వేలు కలిపి రూ.6 లక్షల వరకు ఖర్చు చేసింది. ప్రస్తుతం పెరిగిన ఇనుము, సిమెంట్ధరలతో పోలిస్తే ఒక్కో ఇంటి నిర్మాణానికి దాదాపు రూ.8 లక్షల వరకు ఖర్చవుతోంది. దీనికితోడు భూముల రేట్లు విపరీతంగా పెరిగాయి. ఉమ్మడి జిల్లాలో ఎక్కడికి వెళ్లినా పల్లె ప్రాంతాల్లోనే ఎకరం విలువ దాదాపు రూ.30 లక్షలకుపైగా ఉంది. అలాగే డబుల్ ఇండ్లకు సంబంధించి హౌసింగ్, పంచాయతీరాజ్ఆఫీసర్లతో ఉన్నతస్థాయి అధికారులు ఇప్పటివరకు సమావేశాలు, సమీక్షలు నిర్వహించలేదు. అదనపు ఇండ్ల కేటాయింపునకు సంబంధించి అర్హులుగా ఎవరిని గుర్తించాలి? గతంలో ఎంతమంది ఈ స్కీం ద్వారా లబ్ధి పొందారు? ఎక్కడెక్కడ ప్రభుత్వ, ప్రైవేటు భూమి అందుబాటులో ఉంది? పెరిగిన రేట్లకు తగ్గట్లు ఇంటి నిర్మాణానికి ఎంత అవుతుందనే దానిపై ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ లేదు. సీఎం చెప్పినట్లు అదనంగా డబుల్ఇండ్లను మంజూరు చేస్తున్నట్లు ఆఫీసర్లకు సమాచారం కూడా రాలేదు. ఈ విషయంపై కొందరు ఆఫీసర్లను ప్రశ్నించగా అదనపు డబుల్ఇండ్ల కేటాయింపు గురించి సీఎం కేసీఆర్ చెప్పినట్లు పేపర్లలో చదివామే తప్ప తమకు ఎలాంటి ఆర్డర్స్రాలేదని చెప్పారు.
ఎంపీ, మంత్రులు, ఎమ్మెల్యేలు సైలెన్స్
ఉమ్మడి జిల్లాలోని ఇద్దరు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు రెగ్యులర్‌గా డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్‌లో పాల్గొంటున్నారు. కానీ, ఎక్కడా నియోజకవర్గాలకు అదనపు డబుల్ఇండ్ల గురించి ప్రస్తావన తేవడం లేదు. ప్రతి స్కీం గురించి గొప్పలు చెప్పుకొనే లీడర్లు దీని గురించి చప్పుడు చేయడం లేదు. గ్రామస్థాయి నుంచి మండల స్థాయి వరకు లోకల్లీడర్లు ఎవరూ ఈ విషయం గురించి మాట్లాడడం లేదు. నియోజకవర్గాల వారీగా ఎంత మందికి డబుల్ ఇండ్ల అవసరం ఉంది, జాగాలు ఉన్నవాళ్లు ఎంత మంది అనే విషయాలపై సమాచారం కూడా సేకరించడం లేదు.