- కల్తీ కల్లు చావులు వడదెబ్బ ఖాతాలో!
- ఎక్సైజ్ మంత్రి రంగంలోకి దిగడంతో మారిన సీన్
- అప్పటిదాకా కల్తీ కల్లు అన్న డాక్టర్లు
- తర్వాత డీ హైడ్రేషన్ అని మాట మార్పు
- శాంపిల్స్ రిపోర్ట్ రాకముందే కల్తీ లేదన్న ఎక్సైజ్ఆఫీసర్లు
- మృతికి కల్లు కారణం కాదని చెప్పేందుకు తిప్పలు
- కల్లు వల్లేనని చెప్తే స్కీములు బంద్పెడ్తమని బాధిత కుటుంబసభ్యులకు బెదిరింపులు
- మృతుల ఫ్యామిలీలకు డబ్బులిచ్చి మేనేజ్ చేసే ప్రయత్నాలు
హైదరాబాద్, వెలుగు : ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పాలమూరు జిల్లాలో కల్తీ కల్లు తాగి ఇటీవల ముగ్గురు చనిపోగా, ఆ చావులను వడదెబ్బ ఖాతాలో వేసే ప్రయత్నం జరుగుతోంది. కల్లులో ఆల్ఫ్రాజోలం మోతాదు మించడంతో గత శుక్రవారం నుంచి సుమారు 40 మందికి పైగా బాధితులు పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తూ పాలమూరు ప్రభుత్వ దవాఖానలో చేరారు. వీరిలో పరిస్థితి విషమించి ఆదివారం ఒకరు, బుధవారం మరో ఇద్దరు చనిపోయిన సంగతి తెలిసిందే. కాగా, ఆదివారం ఒకరు చనిపోగానే, మీడియా ద్వారా విషయం బయటకు రావడంతో మంత్రి శ్రీనివాస్ గౌడ్ సీన్లోకి వచ్చారు. దీంతో అప్పటిదాకా రోగులంతా కల్తీ కల్లు బాధితులే అన్న డాక్టర్లు మాట మార్చి, డీ హైడ్రేషన్ వల్లే దవాఖానలో చేరారని, వారే పరిస్థితి విషమించి చనిపోతున్నారని చెప్తున్నారు. కల్తీ కల్లు శాంపిల్స్ తీసి హైదరాబాద్ పంపిన ఎక్సైజ్ ఆఫీసర్లు కూడా ఆ రిపోర్టులు రాకముందే జిల్లాలో ఎక్కడా కల్తీ కల్లు లేదని ప్రెస్‌మీట్‌పెట్టి తేల్చేశారు. అటు బాధిత కుటుంబసభ్యులనూ కొందరు బీఆర్ఎస్ లీడర్లు, కల్లు వ్యాపారులు బెదిరించారనే ఆరోపణలున్నాయి.
ఇదీ జరిగింది..
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని దొడ్లోనిపల్లి ఏరియాలోని ఓ డిపోలో కల్లు తాగిన బాధితులు పిచ్చిపిచ్చిగా ప్రవర్తించడంతో వారి కుటుంబసభ్యులు మహబూబ్‌నగర్‌లోని ప్రభుత్వ దవాఖానకు తీసుకురావడం ప్రారంభించారు. బుధవారం నాటికి దాదాపు 40 మంది బాధితులు చేరగా, డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తున్నారు. మొదట్లో వీరిని కల్తీ కల్లు బాధితులుగా పేర్కొన్న డాక్టర్లు కేస్‌షీట్‌లో ఇదే విషయం రాశారు. డాక్టర్లతో పాటు బాధితుల కుటుంబసభ్యులు కూడా మీడియాకు ఇదే చెప్పారు. ఈ క్రమంలో ఆదివారం.. రూరల్ మండలం కోడూరుకు చెందిన ఆశన్న అనే వృద్ధుడు, బుధవారం అంబేద్కర్ నగర్‌కు చెందిన విష్ణు ప్రకాశ్ (27), దొడ్లోనిపల్లి ఏరియాకు చెందిన రేణుక (54) చనిపోయారు. జడ్చర్ల మండలం మల్లెబోయిన్‌పల్లికి చెందిన రేణుక పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. కాగా, ఆశన్న చనిపోవడానికి ముందు శనివారం దవాఖానను సందర్శించిన మీడియా ప్రతినిధులతో బాధిత కుటుంబ సభ్యులు మాట్లాడారు. తమ వారికి కల్లు తాగే అలవాటు ఉందని, కల్లులో తేడా ఉన్నప్పుడల్లా పిచ్చిగా ప్రవర్తిస్తారని, ఈసారి సైతం మూతి వంకర్లు పోయి, నత్తి నత్తి మాట్లాడారని, కొందరి మెడలు వెనక్కి వాలిపోయాయని, కండ్లు తేలేసి, నాలుక బయటపెట్టడం లాంటివి చేశారని చెప్పారు. అందుకే హాస్పిటల్‌కు తీసుకొచ్చామన్నారు.
మంత్రి నుంచి ఫోన్...మారిన సీన్..
కల్తీ కల్లు వల్ల ఆదివారం ఒకరు చనిపోయారని తెలియగానే జిల్లాకు చెందిన ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ రంగంలోకి దిగారు. అటు డాక్టర్లపైనా, ఇటు ఎక్సైజ్ ఆఫీసర్లపైనా సీరియస్ అయ్యారు. ‘ ఇలాంటి ఇష్యూలను కూడా మేనేజ్ చేసుకోలేరా?’ అంటూ ఆగ్రహించినట్లు తెలిసింది. దీంతో సోమవారం మధ్యాహ్నం పాలమూరు ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్ రామ్‌కిషన్ ప్రెస్‌మీట్‌పెట్టి, వడదెబ్బ వల్లే ఆశన్న చనిపోయాడని చెప్పారు. అడ్మిట్ అయిన వాళ్లంతా కల్తీ కల్లు బాధితులు కాదని, ఎండలకు తిరగడం వల్లే డీ హైడ్రేషన్‌కు గురయ్యారని ప్రకటించారు. అదే రోజు మధ్యాహ్నం జిల్లా కేంద్రంలోని ఐదు డిపోల్లో కల్లు శాంపిల్స్ సేకరించి, టెస్టుల కోసం హైదరాబాద్ పంపిన ఆబ్కారీ ఆఫీసర్లు సాయంత్రం ఎక్సైజ్‌సూపరింటెండెంట్ సైదులు ఆధ్వర్యంలో ప్రెస్‌మీట్ పెట్టారు. డీ హైడ్రేషన్ వల్లే బాధితులు దవాఖానలో చేరారని, ఆశన్న కూడా అందుకే చనిపోయాడని, ఈ విషయాలను డాక్టర్లే చెప్పారన్నారు. పైగా జిల్లాలో ఎక్కడా కల్తీకల్లు అమ్మకాలు లేవని, చెట్ల వల్లే వచ్చే స్వచ్ఛమైన కల్లు మాత్రమే అమ్ముతున్నారన్నారు. దీనిని బట్టి పక్కా ప్లాన్ ప్రకారం ముందు డాక్టర్లతో చెప్పించి, ఆ తర్వాత ఎక్సైజ్ ఆఫీసర్లు ప్రెస్‌మీట్ పెట్టినట్లు అర్థమవుతోంది. కల్తీ కల్లు లేదని చెబుతున్న ఆఫీసర్లు రిపోర్టులను కూడా అనుకూలంగానే తెప్పించుకుంటారేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
లీడర్లు, వ్యాపారుల బెదిరింపులు
ఆదివారం ఆశన్న చనిపోవడంతో రూలింగ్ పార్టీకి చెందిన కొందరు లీడర్లు, కల్తీకల్లు వ్యాపారులు బాధిత కుటుంబాల వద్దకు వెళ్లి మాట్లాడారు. ఒక్కో బాధిత కుటుంబానికి రూ.20 వేల నుంచి రూ.30 వేలు ముట్టజెప్పి ఎవరూ మీడియాతో మాట్లాడవద్దని, కల్తీకల్లు తాగడం వల్లే దవాఖానలో చేరామని చెప్పవద్దని, అలా చేస్తే పింఛన్లు, ఇతర స్కీములన్నీ బంద్ అవుతాయని బెదిరించి, హామీ పత్రాలు రాయించుకున్నట్లు తెలిసింది. ఈలోగా బుధవారం విష్ణు ప్రకాశ్, రేణుక చనిపోవడంతో వారి కుటుంబసభ్యులకు రూ.3 లక్షల చొప్పున ఇస్తామని హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఆశన్న కుటుంబానికి అంత్యక్రియల కోసం రూ.30 వేలు ఇచ్చి..మిగిలిన రూ.2.70 లక్షలను త్వరలోనే ఇస్తామని చెప్పినట్లు తెలుస్తోంది. ఆశన్న చనిపోయినప్పటి నుంచి దవాఖాన వైపు మీడియా ప్రతినిధులనుగానీ, ప్రతిపక్ష లీడర్లను గానీ అడుగుపెట్టనివ్వడం లేదు. ఒకవేళ డాక్టర్లు చెప్పినట్లు డీ హైడ్రేషన్‌తోనే హాస్పిటల్లో చేరితే ఎందుకు పరామర్శించనివ్వరనే ప్రశ్నలు వస్తున్నాయి. ఈ విషయమై బుధవారం కొందరు మీడియా ప్రతినిధులు దవాఖాన ఎదుట ఆందోళనకు దిగగా, గురువారం కాంగ్రెస్ నేతలు లోనికి వెళ్లేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. ప్రస్తుతం హాస్పిటల్లో ఎంతమంది బాధితులు ఉన్నారో, వారి కండీషన్ ఏమిటో డాక్టర్లు కూడా బయటకు చెప్పడం లేదు.