పెగడపల్లి, వెలుగు : మండలంలోని నంచర్ల గ్రామంలో రోడ్డు వెడల్పు పేరుతో అధికార పార్టీ లీడర్లు ఏకపక్షంగా ఒకే వాడలో ఇళ్లు కూలుస్తున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం గ్రామంలోకి ఎవరు రాకుండా రోడ్డుకు అడ్డంగా ముళ్లకంచెలు వేసి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలోని ఒకే సైడ్ లో నిరుపేదల ఇండ్లు ఉన్నాయని, ఇప్పటివరకు అధికార పార్టీ నాయకులు 15 ఇండ్లు, కొన్ని ఇండ్ల గోడలు కూల్చారని ఆందోళన వ్యక్తం చేశారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఇండ్లు పడగొడితే తాము ఎక్కడికి వెళ్లాలని వాపోయారు.
రోడ్డు వెడల్పు చేయాలంటే ఊరు మొత్తం రోడ్లు వెడల్పు చేయాలని, కానీ ఒకే వాడలో ఒకే సైడ్లో ఎలా చేస్తారని ప్రశ్నించారు. తమకు న్యాయం చేయకపోతే కలెక్టరేట్ ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు. దీనిపై సర్పంచ్ మహేందర్ రెడ్డిని వివరణ కోరగా గతేడాది డిసెంబర్ లో నిర్వహించిన గ్రామసభలో రోడ్డు వెడల్పు కోసం తీర్మానం చేశామన్నారు. జీపీ పాలకవర్గంతో పాటు 250 మంది గ్రామస్తులు రోడ్డు వెడల్పుకు సానుకూలత తెలిపారన్నారు. ఫిబ్రవరిలో ప్రహరీలతోపాటు ఇండ్లు కోల్పోతున్న వారికి నోటీసులు జారీ చేశామని సర్పంచ్ తెలిపారు.