బస్సుల కోసం రోడ్డుపై విద్యార్థుల ధర్నా

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్ గ్రామంలో బస్సులను ఆపి గ్రామస్థులు రోడ్డుపై ధర్నా చేశారు. మార్నింగ్ టైంలో సరిపడా బస్సులు లేక అవస్థలు పడుతున్నామన్నారు. బస్ పాస్ లు ఉండి స్కూల్, కాలేజీ, ఉద్యోగాలకు వెళ్లే సమయంలో బస్సులేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు.  ఉదయం 8.30 గంటల సమయంలో గ్రామానికి వచ్చే బస్సులు.. ప్రయాణికులతో రష్ గా వస్తున్నాయన్నారు.  దీంతో బస్సుల్లో స్థలం లేక ప్రైవేట్ వాహనాలను అశ్రాయించాల్సి వస్తోందన్నారు. 

బస్సు పాస్ లు ఉన్నా ప్రైవేట్ వాహనాల్లో ఛార్జీలు పెట్టే స్థోమత లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల ధర్నాకు మద్దతుగా రాయపోల్ గ్రామ సర్పంచ్ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. గ్రామానికి సరిపడా బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులను కోరినా ఫలితం లేదన్నారు. ఉదయం ప్రత్యేక బస్సును నడపాలని డిమాండ్ చేశారు.