- 367 మంది ఉద్యోగుల్లో 40 మంది ట్రాన్స్ఫర్
- వీరిలో చాలామంది 10 ఏండ్లకు పైగా పనిచేస్తున్నవారే..
- కొంతకాలంగా సిబ్బందిపై అవినీతి ఆరోపణలు
- అయినా కొందరికే బదిలీలు?
- త్వరలో మరిన్ని ట్రాన్స్ఫర్లు ఉండే చాన్స్
రాజన్నసిరిసిల్ల, వెలుగు : రాజన్న సిరిసిల్ల సెస్(సహకార విద్యుత్ సరఫరా సంస్థ)లో బదిలీల పర్వం కొనసాగుతోంది. ఏండ్లుగా పాతుకుపోయిన ఉద్యోగులను ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. సంస్థలో మొత్తం 367 ఎంప్లాయీస్ఉండగా వీరిలో చాలామంది 10 ఏండ్లకు పైగా పనిచేస్తున్నవారే.. కాగా కొంతకాలంగా పాలకవర్గం, కాంట్రాక్టర్లతో కుమ్మక్కై కొందరు ఉద్యోగులు అవినీతికి పాల్పడుతున్నారన్న ఆరోపణలున్నాయి.
విద్యుత్ మెటీరియల్స్ పంపిణీలో అవకతవకలు జరిగినట్లు తెలుస్తోంది. ఈక్రమంలో ఇప్పటివరకు 40 మంది ఉద్యోగులను ట్రాన్స్ఫర్ చేశారు. ఈ ట్రాన్స్ఫర్లు కూడా కొందరికే అమలవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు మరింత మందికి స్థానచలనం కలిగే చాన్స్ ఉన్నట్లు సమాచారం.
40 మంది ఉద్యోగులు ట్రాన్స్ఫర్
రాజన్న సిరిసిల్ల జిల్లాలో సస్ పరిధిలో సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలు, 13 మండలాలు, 255 గ్రామాలు ఉన్నాయి. సెస్ లో 367 మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. వీరిలో చాలామంది పదేండ్ల పై నుంచి పనిచేస్తున్నవారే ఉన్నారు. వీరిలో కొందరిని ట్రాన్స్ఫర్ చేస్తూ మూడు రోజుల కింద ఆర్డర్స్ రిలీజ్అయ్యాయి. ట్రాన్స్ఫర్ అయిన వారిలో ఆరుగురు ఏఏవోలు,14 మంది ఏఏఈలు, నలుగురు జేఏవోలు, ముగ్గురు ఎస్ఏలు, ప్రమోషన్ మీద ఇద్దరు ఎస్ఏలు, ముగ్గురు జేఏవోలు, ఆరుగురు జేఏలు, ఒకరికి హెల్పర్ నుంచి ఏఎల్‌ఎంగా, మరొకరు ఏఎల్‌ఎం నుంచి లైన్‌మెన్‌గా బదిలీ అయ్యారు.
కాగా వీరిలో సిరిసిల్ల పట్టణానికి చెందిన కొందరు ఉద్యోగులకు ఈ ట్రాన్స్ఫర్లు వర్తింపచేయడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈక్రమంలో మొత్తం సెస్‌లో బదిలీల పర్వంలోనూ అనుమానాలు రేకెత్తుతున్నాయి. కాగా ప్రస్తుతం వానాకాలం కావడంతో సెస్ లో అత్యధికంగా ఉన్న లైన్‌మెన్లకు బదిలీలు లేనట్లు సమాచారం. ఈ టైంలో కరెంట్సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. వీటిపై పాత లైన్‌మెన్లకే అవగాహన ఉంటుందని పాలకవర్గం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
పాత ఎండీ పేరుతో ఉత్తర్వులు
సెస్ లో బదిలీల ఉత్తర్వులు పాత ఎండీ పేరుతో రిలీజ్ చేశారు. ప్రస్తుత సెస్ ఎండీగా రామకృష్ణ రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. ఆయన పేరుతో ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉన్నా అలా చేయకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పాత ఎండీ పేరుతో ఉత్తర్వులు ఎందుకు వచ్చాయని సెస్ ఎండీ ని వివరణగా కోరగా టైపిస్ట్ తప్పిదమంటూ జవాబిచ్చారు. గతంలో సెస్ ఎన్నికల నిర్వహణలోనూ గందరగోళం నెలకొంది. సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో సెస్ విమర్శలపాలైంది.
మూడేండ్లు నిండితే ట్రాన్స్ఫర్
సెస్ లో మూడేండ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న ఉద్యోగులందరినీ బదిలీ చేస్తాం. మూడు రోజుల నుంచి ఈ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికి 40 మందిని బదిలీ చేశాం. ప్రస్తుతం బిల్లింగ్నడుస్తోంది. అది కంప్లీట్ అయ్యాక లైన్ మెన్ లను కూడా బదిలీ చేస్తాం. పదేండ్ల నుంచి పని చేస్తున్నవారిపై దృష్టిసారించి ముందుగా వారిని బదిలీ చేశాం.
- సెస్ ఎండీ, రామకృష్ణ