రాజన్న సిరిసిల్ల, వెలుగు: రాజన్నసిరిసిల్ల జిల్లాలో మెడికల్ కాలేజీ నిర్మాణం కోసం అర్బన్పరిధిలోని పెద్దూర్ శివారులో 30 ఎకరాల ల్యాండ్‌ను అధికారులు కేటాయించారు. జూన్ నుంచి కాలేజీ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. పరిహారం చెల్లించకుండానే అధికారులు పనులు స్టార్ట్ చేశారని ఆరోపిస్తూ దళిత రైతులు మెడికల్ కాలేజీ పనులు అడ్డుకున్నారు. కనీసం సమాచారం ఇవ్వకుండానే భూములు చదును చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. నష్టపరిహారం ఇవ్వకుండా పనులు ఎలా ప్రారంభిస్తారని రైతులు ప్రశ్నిస్తున్నారు.
వెయ్యి గజాల స్థలాన్ని ఇస్తామని చెప్పి..
పెద్దూరు శివారులో 25 మంది రైతులకు 20 ఏండ్ల కింద అప్పటి ప్రభుత్వం 30 ఎకరాలకు పట్టాలు ఇచ్చింది. ప్రస్తుతం మెడికల్ కాలేజీ నిర్మాణానికి ఆ 30 ఎకరాలతోపాటు 6 ఎకరాల గుట్టభూమిని ప్రభుత్వం కేటాయించింది. కాలేజీకి భూమి ఇచ్చిన ప్రతి రైతుకు ఒక్కొక్కరికి వెయ్యి గజాల స్థలం కేటాయిస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. కానీ ఇప్పటివరకు అందజేయలేదు. కనీసం ఆఫీసర్లు ఒక్కసారి కూడా తమతో మాట్లాడలేదని రైతులు చెబుతున్నారు. భూమి కోల్పోయిన 25 మందిలో చాలా మంది దళిత నిరుపేదలు ఉన్నారు. పరిహారం చెల్లించకుండానే కాలేజీ కోసం తీసుకుందని రైతులు వాపోతున్నారు. పెద్దూరులో 408 సర్వేనంబర్‌లోని ప్రభుత్వ భూమిలో నిర్వాసితులకు భూమి కేటాయిస్తామని చెప్పారని, ఇప్పటివరకు ఎలాంటి భూమి ఇవ్వలేదని రైతులు చెబుతున్నారు. పైగా కనీసం సమాచారమివ్వకుండా కాంట్రాక్టర్పనులు ప్రారంభించారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుమారు 500 టేకు చెట్లను తొలగించారని రైతులు వాపోతున్నారు. కాలేజీకి భూమి ఇచ్చి తాము ఉపాధి కోల్పోయామని, పరిహారం ఇచ్చేవరకు నిర్మాణ పనులను సాగనివ్వమని రైతులు పేర్కొంటున్నారు.
పరిహారం అందేవరకు పనులు సాగనివ్వం
మెడికల్ కాలేజ్ నిర్మాణంలో నా ఎకరం భూమి కోల్పోయాను. ఆ భూమితోనే నా కుటుంబానికి ఉపాధి. ఇప్పుడు అది కూడా లేకపోవడంతో నాకు ఉపాధి లేకుండా పోయింది. పరిహారం ఇచ్చేంతవరకు పనులను అడ్డుకుంటాం.
- బాల్‌రాజ్‌యాదవ్ , పెద్దూర్ వాసి
ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం
మెడికల్ కాలేజ్ నిర్మాణంలో భూములు కోల్పోయిన ప్రతి రైతుకు వేరోచోట స్థలం కేటాయిస్తాం. దీనికి సంబంధించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. పెద్దూర్ నుంచి జెగ్గరావుపల్లె మధ్యలో 400 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది. ఇక్కడే రైతులకు స్థలం కేటాయించడానికి మున్సిపల్ ఆధ్వర్యంలో ల్యాండ్ పూలింగ్ నడుస్తోంది. స్థలాన్ని తీసుకునే ముందే రైతులతో చర్చించాం.
- ఆర్డీవో శ్రీనివాసరావు, సిరిసిల్ల