బతుకమ్మ చీరల బకాయిలు 200 కోట్లు

  • సిరిసిల్ల నేతన్నలకు చెల్లించని గత బీఆర్ఎస్ ప్రభుత్వం 
  • నూలు సబ్సిడీ మరో 20 కోట్లు కూడా పెండింగ్
  • కొత్త ప్రభుత్వం చెల్లిస్తుందా? లేదా? అని కార్మికుల్లో ఆందోళన

రాజన్న సిరిసిల్ల, వెలుగు: బతుకమ్మ చీరలకు సంబం ధించి సిరిసిల్ల నేతన్నలకు దాదాపు రూ.200 కోట్ల బకాయిలు రావాల్సి ఉంది. ప్రతిఏటా బతుకమ్మ పం డుగకు మహిళలకు చీరలు పంపిణీ చేసిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం.. వాటిని తయారు చేసిన నేతన్నలకు పూర్తి స్థాయిలో బిల్లులు చెల్లించలేదు. ఆ బకాయిలు మొత్తం రూ.200 కోట్ల వరకు ఉంటాయని నేతన్నలు చెబుతున్నారు. వీటితో పాటు 2022, 2023 సంవత్సరాలకు సంబంధించి నూలు సబ్సిడీ కింద ఇవ్వాల్సిన దాదాపు రూ.20 కోట్లు కూడా పెండింగ్ లో పెట్టారని అంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో తమ బకాయిలు వస్తాయో లేదోనని నేతన్నలు ఆందోళన చెందుతున్నారు.

అసలు వచ్చే ఏడాది నుంచి బతుకమ్మ చీరల పంపిణీ ఉంటుందా? ఉంటే ఆ ఆర్డర్లు తమకే ఇస్తారా? లేదా? అని టెన్షన్ పడుతున్నారు. ‘‘కాంగ్రెస్ సర్కార్ రాజకీయాలకు అతీతంగా ఆలోచించి, మాకు రావాల్సిన బకాయిలు చెల్లించాలి. ఎప్పట్లాగే బతుకమ్మ చీరల ఆర్డర్లు కూడా ఇవ్వాలి” అని కార్మికులు కోరుతున్నారు. గత ప్రభుత్వంలో బతుకమ్మ చీరలతో పాటు స్కూల్ యూనిఫామ్ క్లాత్ ఆర్డర్లు కూడా తమకే ఇచ్చారని, ఇకపైనా తమకే ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 

ఈసారి పంచింది కోటి చీరలు.. 

గత బీఆర్ఎస్ ప్రభుత్వం బతుకమ్మ పండుగ సందర్భంగా ఏటా మహిళలకు చీరలు పంపిణీ చేసింది. ఆ ఆర్డర్లను నేత కార్మికులకు ఇచ్చింది. ఇందులో భాగంగా ఈ ఏడాది ఫిబ్రవరి15న చేనేత జౌళి శాఖ ద్వారా సిరిసిల్ల నేతన్నలకు 5.56 కోట్ల మీటర్ల క్లాత్ కు ఆర్డర్ ఇచ్చారు. 25 కలర్స్, 25 డిజైన్లలో ఇవ్వాలని చెప్పి.. సెప్టెంబర్ 15 వరకు గడువు విధించారు. దాదాపు 5 వేల మంది నేత కార్మికులు ఆరు నెలల పాటు శ్రమించి కోటి చీరలు రెడీ చేసి, గడువులోగా సర్కారుకు అందించారు.

ప్రతి మహిళకు ఒక చీర చొప్పున అందజేసి, వచ్చే ఎన్నికల్లో తమకే ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. కానీ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నేతన్నలకు చెల్లించాల్సిన బిల్లులు మాత్రం ఇవ్వలేదు. ‘‘మాతో బతుకమ్మ చీరలు నేయించారు. వాటిని పంపిణీ చేశారు. ఓట్లు వేయించుకున్నారు. కానీ మాకు మాత్రం పైసా చెల్లించలేదు’’ అని సిరిసిల్ల  నేత కార్మికులు మండిపడుతున్నారు.

మాకే ఆర్డర్లు ఇవ్వాలి.. 

ఎప్పట్లాగే ఈసారి కూడా బతుకమ్మ చీరల ఆర్డర్లను సిరిసిల్ల నేత కార్మికులకు ఇచ్చేలా ప్రభుత్వం చొరవ చూపాలి. త్వరలోనే మంత్రులను కలిసి ఆర్డర్లు ఇవ్వాలని కోరుతాం. పెండింగ్ బిల్లులు ఇప్పించాలని ఉమ్మడి జిల్లా మంత్రులకు విజ్ఞప్తి చేస్తాం.


- సత్యం, అధ్యక్షుడు, సిరిసిల్ల పాలిస్టర్ పవర్​లూమ్ వస్త్ర ఉత్పత్తిదారుల సంఘం