వన్యప్రాణుల దాహార్తి తీరేదెలా?

  • పెరుగుతున్న ఎండలు.. తగ్గుతున్న నీటి వనరులు 
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 10 లక్షల ఎకరాల్లో అడవులు 
  • రూ.2.30 కోట్లకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు 
  • ఇంకా రాని బడ్జెట్.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో అధికారులు 

భద్రాచలం, వెలుగు  :  మండే ఎండల్లో వన్యప్రాణుల దాహార్తి తీర్చేందుకు ఇబ్బందులు తప్పడం లేదు. వర్షాలు లేక, పెరిగిన ఉష్ణోగ్రతలతో అడవుల్లోని నీటివనరులు వేగంగా తగ్గుతున్నాయి. వేసవిలో తాగు నీటికోసం అడవి జంతువులు బయటకు వచ్చి వేటగాళ్లకు చిక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో వన్యప్రాణులను కాపాడేందుకు చెక్​డ్యాంలు, సాసర్​ పిట్స్, నీటి కుంటలు,చిన్నకుంటలు నిర్మించేందుకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపితే ఇంకా బడ్జెట్​రాలేదు. దీంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై అటవీ శాఖ అధికారులు దృష్టి సారించారు. ఆంధ్రా, ఛత్తీస్​గఢ్​ సరిహద్దుల వరకు భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 10,13,460.07 ఎకరాల్లో అడవులు విస్తరించి ఉన్నాయి. 

రూ.2.30కోట్లు అవసరం..

భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని అడవుల్లో నీటి వనరుల పెంపు కోసం అటవీశాఖ రూ.2.30కోట్లతో  ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. రూ.71.51లక్షలతో 11 చెక్​డ్యామ్​లు, రూ.2.21లక్షలతో 45 సాసర్​ పిట్స్, రూ.90 లక్షలతో 38 నీటి కుంటలు, రూ.66.50 లక్షలతో 42 చిన్ననీటి కుంటలు నిర్మించాలని అధికారులు యాక్షన్​ ప్లాన్​ తయారు చేశారు. కంపా, బయోసాట్​ నిధులతో 136 పనులు చేపట్టాలని నిర్ణయించారు. కానీ దీనికి సంబంధించి బడ్జెట్ ఇంకా రాలేదు. కాగా ఇప్పటికే ప్రత్యామ్నాయంగా అధికారులు అడవుల్లో 30కు పైగా సోలార్​ పంపుసెట్లు ఏర్పాటు చేశారు. మరో నాలుగు చోట్ల సోలార్​ పంపుసెట్లు నిర్మిస్తున్నారు. ఎప్పటికప్పుడు సమీపంలోని నీటికుంటలను ఈ సోలార్ బోర్లు నీటితో నింపుతాయి. 

కట్టుదిట్టమైన ఏర్పాట్లు
 

నీటి వనరుల పెంపు కోసం బడ్జెట్​ పంపాం. ఇంకా రాలేదు. వేసవికాలంలో వన్యప్రాణుల సంరక్షణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినం. సాసర్​పిట్స్ లో నీటిని నింపుతున్నం. ప్రస్తుతం 30 వరకు సోలార్​ పంపుసెట్లు ఉన్నాయి. మరో నాలుగు నిర్మిస్తున్నాం. వేటగాళ్లను నియంత్రిస్తున్నం. నిఘాను పెంచి వన్యప్రాణుల సంరక్షణపై దృష్టి సారించాం. 
- క్రిష్టగౌడ్​, డీఎఫ్​వో