వరంగల్‌‌ జిల్లాలో మరో ఏడు పేర్లు ఖరారు

  • కాంగ్రెస్‌‌ సెకండ్‌‌ లిస్ట్‌‌ రిలీజ్‌‌ చేసిన హైకమాండ్‌‌
  • ఉమ్మడి జిల్లాలో ఫస్ట్‌‌ లిస్ట్‌‌లో 4, సెకండ్‌‌ లిస్ట్‌‌లో 7 పేర్లు ఖరారు
  • డోర్నకల్‌‌పై తొలగని సందిగ్ధం
  • జనరల్‌‌ స్థానాలన్నీ ఓసీలకే కేటాయింపు

వరంగల్/జనగామ/మహబూబాబాద్‌‌ అర్బన్‌‌, వెలుగు : కాంగ్రెస్‌‌ రిలీజ్‌‌ చేసిన సెకండ్‌‌ లిస్ట్‌‌లో ఉమ్మడి వరంగల్‌‌ జిల్లాకు చెందిన మరో ఏడుగురికి ఛాన్స్‌‌ దక్కింది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 12 నియోజకవర్గాలు ఉండగా ఫస్ట్‌‌ లిస్ట్‌‌లో నాలుగు కన్ఫర్మ్‌‌ కాగా, శుక్రవారం ప్రకటించిన సెకండ్‌‌ లిస్ట్‌‌లో ఏడు పేర్లు కనిపించాయి. ఇందులో వరంగల్‌‌ తూర్పు నుంచి కొండా సురేఖ, పశ్చిమలో నాయిని రాజేందర్‌‌రెడ్డి, పరకాలలో రేవూరి ప్రకాశ్‌‌రెడ్డి, వర్ధన్నపేటలో కేఆర్‌‌.నాగరాజు, జనగామలో కొమ్మూరి ప్రతాప్‌‌రెడ్డి, పాలకుర్తిలో యశస్వినిరెడ్డి, మహబూబాబాద్‌‌లో మురళీనాయక్‌‌కు టికెట్లు దక్కాయి.  ఇప్పటి వరకు ప్రకటించిన 11  స్థానాల్లో రెడ్డి సామాజిక వర్గానికి 5, ఎస్సీ, ఎస్టీలకు రెండు చొప్పున, వెలమ, బీసీలకు రెండు చొప్పున దక్కాయి. మొత్తం స్థానాల్లో నాలుగు చోట్ల మహిళలకు ఛాన్స్‌‌ వచ్చింది. 

డోర్నకల్‌‌లో కాంపిటీషన్‌‌ టఫ్‌‌

మహబూబాబాద్‌‌ జిల్లా పరిధిలోని డోర్నకల్‌‌ ఎస్టీ స్థానంలో టఫ్‌‌ కాంపిటీషన్‌‌ నెలకొంది. ఇక్కడ కాంగ్రెస్‌‌ టికెట్‌‌ కోసం డాక్టర్‌‌ రామచంద్రునాయక్‌‌, మాలోతు నెహ్రూ మధ్య తీవ్ర పోటీ ఉంది. స్థానిక కోటాలో నెహ్రూ నాయక్‌‌ ప్రయత్నం చేస్తుండగా, గత ఎన్నికల్లో మాజీ మంత్రి రెడ్యానాయక్‌‌కు గట్టి పోటీ ఇచ్చిన వ్యక్తిగా రామచంద్రునాయక్‌‌ బరిలో ఉన్నారు. 

పాలకుర్తిలోఅత్తప్లేస్‌‌లో కోడలు

పాలకుర్తి నియోజకవర్గంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌‌రావుకు గట్టి పోటీ ఇవ్వాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్‌‌ హనుమాండ్ల ఝాన్సీరెడ్డిని రంగంలోకి దింపింది. ఆమె కూడా అమెరికా నుంచి వచ్చినప్పటి నుంచే నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. కానీ ఝాన్సీరెడ్డికి ఉన్న అమెరికా పౌరసత్వం ఎలక్షన్‌‌ రూల్స్‌‌కు అడ్డంకిగా మారడం, ఎలక్షన్‌‌ టైం వరకు ఆ సమస్య పరిష్కారం అయ్యే ఛాన్స్‌‌ లేకపోవడంతో పాలకుర్తి టికెట్‌‌ను ఝాన్సీరెడ్డి కోడలు యశస్వినిరెడ్డికి ఖరారు చేస్తూ కాంగ్రెస్‌‌ హైకమాండ్‌‌ నిర్ణయం తీసుకుంది.

మరో వైపు జనగామ క్యాండిడేట్‌‌గా జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్‌‌రెడ్డి ఖరారయ్యారు. గతంలో ఇక్కడ పొన్నాల లక్ష్మయ్య, కొమ్మూరి మధ్య తీవ్ర పోటీ నెలకొంది. కానీ పొన్నాల ఇటీవల కాంగ్రెస్‌‌ను వీడడంతో కొమ్మూరికి లైన్‌‌ క్లియర్‌‌ అయింది.