- సికింద్రాబాద్‌లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య పోరు
- ఉనికి చాటుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు
హైదరాబాద్, వెలుగు: సికింద్రాబాద్అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ అభ్యర్థులు ఎవరికి వారే తమ సత్తా చాటేందుకు పోటీ పడుతున్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి ఇప్పటికే సిట్టింగ్ఎమ్మెల్యేగా ఉన్న టి. పద్మారావు గౌడ్ మరోసారి తన సీటును కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో పేద, మధ్యతరగతి, ధనిక వర్గాలతో పాటు క్రిస్టియన్, ముస్లిం మైనారిటీలు కీలకంగా ఉన్నారు.
ప్రత్యేకించి రైల్వే ఓటర్లు అభ్యర్థుల తలరాత రాసే సంఖ్యలో ఉండడం గమనార్హం. నియోజకవర్గం నుంచి పోటీ చేసే వారు మైనారిటీ, క్రిస్టియన్, రైల్వే ఓటర్లను ప్రసన్నం చేసుకుంటే విజయం ఖాయమని భావిస్తున్నారు. 2014, 2018 ఎన్నికల్లో వరుసగా గెలుస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యే టి. పద్మారావు గౌడ్ మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలని అనుకుంటున్నారు.
ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉన్న ఆదం సంతోష్ కూడా కీలకంగా మారారు. ఆయన మొదటిసారి ఎమ్మెల్యే రేసులో ఉన్నారు. బీజేపీ తరఫున మేకల సారంగపాణి తన ఉనికి చాటుకునేందుకు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. ప్రచారానికి మరికొన్ని రోజుల సమయం ఉండడంతో బీజేపీ తన జోరు చూపించేందుకు సిద్ధమవుతుంది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే పార్టీ అభ్యర్థియే గెలుస్తూ ఉండటం ఈ నియోజకవర్గానికి ఉన్న ప్రత్యేకత.
పోటాపోటీ ప్రచారాలు
సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి విజయం సాధించేందుకు బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈ నియోజకవర్గంలో మధ్య తరగతి ప్రజల మనసు గెలిచిన వారే పోటీలో విజయం సాధిస్తున్నారు. ఇక్కడ ముస్లిం మైనారిటీ, క్రిస్టియన్, రైల్వే ఓటర్లను ప్రసన్నం చేసుకోవాల్సి ఉంటుంది. ఓటర్ల జాబితా సవరణ తర్వాత ప్రస్తుతం నియోజక వర్గంలో 2,56,555 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుష ఓటర్లు 1,29,144 మంది కాగా, మహిళా ఓటర్లు 1.27 లక్షలకు పైనే ఉన్నారు.
ఈ నియోజక వర్గంలో అతి పెద్ద మురికివాడ అడ్డగుట్ట ఉంది. మెట్టుగూడ, ఆలుగడ్డ బాయి, శాంతినగర్, లాలాగూడ, చిలకలగూడ, మహమ్మద్‌గూడ, తదితర ప్రాంతాల్లో క్రిస్టియన్, ముస్లిం ఓటర్లు అధికంగా ఉన్నారు. వారాసిగూడ, సీతాఫల్మండి, బౌద్ధనగర్ తదితర ప్రాంతాల్లో మధ్యతరగతి, ఉన్నత వర్గాలు ఉన్నారు. చిలకలగూడ, తుకారామ్‌గేట్, బీదలబస్తీ తదితర ప్రాంతాల్లో పేదవర్గాలు అధికంగా ఉన్నారు.
ప్రభుత్వ పథకాలపైనే బీఆర్‌ఎస్ నమ్మకం
సికింద్రాబాద్ ప్రజలు తనకే మూడోసారి పట్టం కడతారని బీఆర్‌ఎస్ అభ్యర్థి టి. పద్మారావుగౌడ్ ధీమాగా ఉన్నారు. ప్రభుత్వ పథకాలే తమను గెలిపిస్తాయని విశ్వసిస్తున్నారు. నియోజకవర్గం ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే నేతగా పద్మారావుకు పేరుంది. ఏ పేదింటి పెళ్లికయినా హాజరవుతారు. విషాదం జరిగినా తెలిసిన వెంటనే వచ్చి ఓదారుస్తారనేది ఇక్కడి ప్రజల మాట.
ముఖ్యంగా సీఎం రిలీఫ్ ఫండ్ సాయం అందజేయడంలో పద్మారావు ముందుంటారన్న టాక్ నియోజకవర్గంలో ఉంది. ఈ సారి ఎన్నికల్లో తనకు దీటైన అభ్యర్థి లేరని ఆయన ధీమా వ్యక్తం చేస్తుండగా.. తన అనుచరులు కొందరు, ఆయన కుమారులు పలు వివాదాలకు కారణం కావడం వ్యతిరేకమైన అంశాలుగా కనిపిస్తున్నాయి.
ప్రభుత్వ వ్యతిరేకత పైనే కాంగ్రెస్ ఆశలు
నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా మొదటిసారి పోటీలో ఉన్న ఆదమ్ సంతోష్ పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉన్నారు. రైల్వే కార్మిక సంఘాల్లోనూ చురుగ్గా పని చేస్తున్నారు. రైల్వే ఉద్యోగుల్లో తనకున్న పలుకుబడి తన విజయానికి దోహదం చేస్తుందని ఆయన ధీమాతో ఉన్నారు. గతంలో తన కుటుంబం నుంచి ఆదమ్ ఉమాదేవి బౌద్ధనగర్ కార్పొరేటర్‌గా కూడా పని చేయడంతో నియోజకవర్గంపై తనకు పూర్తి అవగాహన ఉందని సంతోష్ భావిస్తున్నారు.
నియోజకవర్గంలో దాదాపు 20 వేల వరకు రైల్వే ఓటర్లు, 25 వేల వరకు క్రిస్టియన్, మరో 20 వేల వరకు ముస్లిం మైనారిటీ ఓటర్లు ఉన్నారు. ఇక అతిపెద్ద మురికివాడలు అడ్డగుట్ట, తుకారాం గేట్, బీదల బస్తీ, అల్లాడి పెంటయ్యనగర్, కింది బస్తీ, ఆలుగడ్డ బాయి వంటి ప్రాంతాల్లో అత్యధికంగా ఉన్న ఎస్సీ, బీసీల ఓటర్లు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతారన్న ఆశ కాంగ్రెస్‌లో ఉంది.
కమల వికాసం పైనే సారంగపాణి ధీమా
సికింద్రాబాద్ నియోజక వర్గం నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న బీజేపీ అభ్యర్థి మేకల సారంగపాణి గెలుపు కోసం తన ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. స్థానికంగా నియోజకవర్గంపై పూర్తి అవగాహన కలిగి ఉన్న నేతగా ఆయనను చెప్పుకోవచ్చు. గతంలో టీడీపీలో కీలక నేతగా పనిచేసిన సారంగపాణి తర్వాత క్రమంలో బీజేపీలో చేరారు.
సికింద్రాబాద్‌లో బలమైన కార్యకర్తల వ్యవస్థ బీజేపీకి ఉంది.కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, ప్రజల్లో మోదీకి ఉన్న ఫాలోయింగ్ తనకు కలిసి వచ్చే అంశాలుగా చెప్పుకుంటున్నారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పట్ల ప్రజల్లో పెరిగిన వ్యతిరేకత కూడా తనకు కలిసి వచ్చే అంశమని భావిస్తున్నారు.
ALSO READ : జనం చూపు మావైపే..60 శాతం మంది మద్దతు మాకే : కేంద్రమంత్రి కిషన్రెడ్డి
మాజీ మేయర్ బండకార్తీక రెడ్డి, సీనియర్‌నేత బండపల్లి సతీష్ వంటి వారు టిక్కెట్ ఆశించారు. వారికి టిక్కెట్ రాకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. బండపల్లి సతీష్ అయితే ఏకంగా రెబల్అభ్యర్థిగా పోటీ చేస్తుండగా బండ కార్తీక రెడ్డి ప్రస్తుతం సైలెంట్‌గానే ఉన్నా ఆమె ప్రచారానికి రాకపోవడం వ్యతిరేకత కలగజేసే విషయం అని అనుకుంటున్నారు.