గ్రేటర్​లోని కొన్ని ప్రాంతాల్లో అడుగంటిన భూగర్భ జలాలు

గ్రేటర్​లోని కొన్ని ప్రాంతాల్లో అడుగంటిన భూగర్భ జలాలు
  • వానలు పడుతున్నా బోరుమంటున్నయ్!
  • ఎండాకాలం అంతా పుష్కలంగా నీళ్లు పోసిన బోర్లు
  • ఇప్పుడేమో ఇలా.. మరో నెల రోజులు ఇదే పరిస్థితి
  • అధిక వినియోగమే కారణమంటున్న అధికారులు
  • గ్రేటర్​లోని కొన్ని ప్రాంతాల్లో అడుగంటిన భూగర్భ జలాలు

హైదరాబాద్, వెలుగు: గ్రేటర్​లో వర్షా కాలం మొదలయ్యాక నీటి ఎద్దడి పెరిగింది. సిటీతోపాటు శివారులోని కొన్ని ప్రాంతాల్లో వరుసగా బోర్లు ఎండిపోతున్నాయి. నీటి మట్టం పూర్తిగా పడిపోవడంతో చుక్క నీరు రావడం లేదు. బోర్లను మరింత లోతుకు దింపినా ప్రయోజనం ఉండడం లేదు. దీంతో ఆయా ప్రాంతాల వారు వాటర్ ట్యాంకర్లను కొనుగోలు చేస్తున్నారు. వేసవి మొత్తం పుష్కలంగా నీళ్లు పోసిన బోర్లు ఇప్పుడు ఎండిపోవడం ఏంటని జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సిటీలో 45 డిగ్రీల ఎండలు ఉన్నప్పుడు కూడా ఇలాంటి సమస్య లేదని వాపోతున్నారు. ఏటా ఎండా కాలంలో బోర్లు ఎండిపోయి వర్షాలు కురిశాక నీళ్లు వచ్చేవని, కానీ ఈసారి పరిస్థితి పూర్తి భిన్నంగా ఉందని చెబుతున్నారు. గతేడాది అధిక వర్షాలతో గ్రౌండ్​వాటర్​పెరిగిందని, అందుకే ఈసారి సమ్మర్​లో నీటి ఎద్దడి రాలేదని ఆ శాఖ అధికారులు వివరిస్తున్నారు. ఎండా కాలంలో నీళ్లు మంచిగా రావడంతో అధికంగా వినియోగించారని, ఆ ప్రభావం ఇప్పుడు కనిపిస్తోందని అంటున్నారు. గత నెల వరకు ఫుల్​వాటర్​ఉన్న ఏరియాల్లో ఇప్పుడు పూర్తిగా అడుగంటడానికి ఇదే కారణమని చెబుతున్నారు.  

ఈ ప్రాంతాల్లోనే సమస్య..

షేక్ పేట్, మణికొండ, రాజేంద్రనగర్, బండ్లగూడ జాగీర్, కూకట్ పల్లి, జగద్గిరిగుట్ట, మల్కాజిగిరిలోని ఓల్డ్ నేరెడ్ మెట్, వినాయక్ నగర్, పటేల్​నగర్, మన్సూరాబాద్​లోని బాల్ రెడ్డి నగర్, వీరన్నగుట్ట, బృందావన్ కాలనీ, ఇందిరానగర్, వీకర్ సెక్షన్, మెహిదీపట్నంలోని అంబ గార్డెన్, అమీర్ పేటలోని పలు ప్రాంతాల్లో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటాయి. దీంతో ఇండ్లు, అపార్ట్​మెంట్లలోని బోర్లు ఎండిపోయాయి.

ఈ ప్రాంతాల్లో జలమండలి సరఫరా చేసే నీరు అస్సలు సరిపోవట్లేదని వాటర్ ట్యాంకర్లను తెప్పించుకుంటున్నారు. నీళ్ల కోసం ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తోందని జనం వాపోతున్నారు. అపార్ట్​మెంట్లలో అయితే ఒక్కో ఫ్యామిలీ 2 రోజులకు రూ.150 చెల్లించాల్సి వస్తోందని చెబుతున్నారు. వేసవిలో పొదుపుగా వాడి ఉంటే సమస్య వచ్చేది కాదని, వర్షాలు కురుస్తున్నప్పటికీ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అవడానికి 20 రోజుల నుంచి నెల రోజుల  టైం పడుతుందని సంబంధిత శాఖ అధికారులు అంటున్నారు. అప్పటివరకు ఇబ్బందులు తప్పవని చెబుతున్నారు. వాన నీళ్లు ఇంకేలా ప్రతి కాలనీ, ఇండ్లలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు.

10 రోజులుగా మస్తు​ ఇబ్బంది

మా అపార్ట్​మెంట్​లోని బోరు10 రోజుల కిందట ఎండిపోయింది. ఓ వైపు వర్షాలు పడుతున్నా నీళ్లు రాకపోవడంతో మస్తు​ఇబ్బంది అవుతోంది. వాటర్ ట్యాంకులు తెప్పించుకుంటున్నాం. మా బిల్డింగ్​లో మొత్తం తొమ్మిది ఫ్లాట్స్ ఉన్నాయి. ట్యాంకర్ నీళ్లు ఒక్క రోజుకే అయిపోతున్నాయి. మళ్లీ బుక్ చేద్దామంటే కావట్లేదు. స్కూళ్లు, ఆఫీసులకు వెళ్లే టైంలో నీళ్లకు చాలా ఇబ్బందిగా ఉంటోంది. -ప్రియ, ఓయూ కాలనీ, షేక్‌‌పేట్

మొన్నటి దాకా ఇబ్బందే లేదు
వానా కాలం వచ్చాక మా దగ్గర నీటి ఇబ్బందులు మొదలయ్యాయి. బోర్లు ఎండిపోయాయి. నీటిని బయట కొంటున్నాం. మొన్నటి వరకు నిండుగా నీళ్లు పోసిన బోర్లు ఇప్పుడు ఎండిపోతున్నాయి. సమస్యను గుర్తించిన వాటర్​బోర్డు అధికారులు ఉచితంగా నీళ్ల ట్యాంకర్లను పంపించాలె. - గణేశ్, పటేల్ నగర్, మల్కాజిగిరి

బురద వస్తుండడంతో..
నెల రోజుల నుంచి బోరు నుంచి నీళ్లు రావడం లేదు. వచ్చిన కొన్ని బురదతో కలిసి వస్తున్నాయి. దీంతో బోరును వాడటం లేదు. నల్లా నీళ్లను పట్టుకొని సరిపెట్టు కుంటున్నాం. చూసి.. చూసి వాడుకోవాల్సి వస్తోంది.  - అనిల్, జగద్గిరిగుట్ట