- డిటోనేటర్లు పెట్టి మమ్మల్ని చంపేస్తారా?
- షాద్ నగర్ లో పేలుడుతో కంపించిన ఇండ్లు
- భయం గుప్పిట్లో శ్రీ బాలాజీ టౌన్ షిప్ వాసులు
- ఇండ్లు నుంచి బయటకు పరుగులు తీసిన స్థానికులు
షాద్ నగర్, వెలుగు: షాద్ నగర్ పట్టణంలోని శ్రీ బాలాజీ టౌన్‌షిప్ కాలనీలో ఆదివారం డిటోనేటర్ల పేలుళ్ల ధాటికి ప్రజలు భయంతో ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కాలనీవాసుల కథనం ప్రకారం.. చౌడమ్మ గుట్టపై మధ్యాహ్నం 3.20 గంటలకు డిటోనేటర్లను పెట్టి భారీ శబ్దాలతో రాళ్లను పేల్చారు. దీంతో ఇండ్లల్లో ఉన్న స్థానికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటకు పరుగులు తీశారు.
బీజేపీ నేత పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించి అడ్డగోలుగా డిటోనేటర్లు పెట్టి పేల్చుతున్నారని మండిపడ్డారు. పట్టణ ఎస్సై బలరాం అక్కడికి చేరుకోగా.. మమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వరా ఒకేసారి చంపేయండని కాలనీవాసులు వాపోయారు.
రియల్ వెంచర్ నిర్వాహకులు డిటోనేటర్లు పేల్చడం దినచర్యగా మారిందని, ఎంత చెప్పినా వినడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ లీడర్ విష్ణువర్దన్ రెడ్డి శంషాబాద్ డీసీపీ రాజేశ్‌కు ఫోన్‌లో మాట్లాడారు. డిటోనేటర్ల పేలుడుకు భారీ శబ్ధంతో ప్రజల ఇండ్లపై రాళ్లు పడుతున్నాయని, ఇలాగే వదిలేస్తే ప్రజల ప్రాణాలకు ముప్పు కలుగుతుందని డీసీపీకి తెలిపారు. ఇప్పటికైనా పేలుళ్లు ఆపాలని కోరారు.