హైదరాబాద్ ఎల్బీనగర్ లోని సిరినగర్ కాలనీలో క్షుద్రపూజల కలకలం రేగింది. సిరినగర్ కాలనీలోని ఓ ఇంట్లో క్షుద్రపూజలు చేస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. వెంటనే ఎస్వోటీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వైద్యం పేరుతో ఫేక్ డాక్టర్ గా చలామణి అవుతున్న జ్ఞానేశ్వర్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఇతడు నార్త్ ఇండియన్ కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. గత రెండు సంవత్సరాలుగా డాక్టర్ అని అందరికీ చెప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. భారీగా పూజా సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
జ్ఞానేశ్వర్ కు చెందిన సర్టిఫికెట్లను SOT పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిరీస్ రోడ్డులో ఉన్న GNR ఆయుర్వేదం పేరుతో కొంతకాలంగా హాస్పిటల్ నడుపుతున్నాడు జ్ఞానేశ్వర్. వైద్యం కోసం వచ్చిన వారికి చేతబడి చేశారంటూ పూజలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు.