- పోలీసులకు తలనొప్పిగా మారిన రేషన్ బియ్యం దందా
- నాయకుల అండతో బార్డర్ దాటిస్తున్న అక్రమార్కులు
- లోడ్లను వదిలేయాలని పోలీసులకు లీడర్ల ఫోన్
- సూర్యాపేట టు కాకినాడ పోర్టుకు తరలిపోతున్న రైస్
సూర్యాపేట, వెలుగు : సూర్యాపేట జిల్లాలో యథేచ్ఛగా సాగుతున్న రేషన్ బియ్యం దందా నాయకులకు కాసులు కురిపిస్తుండగా, పోలీసులకు మాత్రం తలనొప్పిగా మారుతోంది. బియ్యం వ్యాపారులకు నాయకులకు అండదండలు ఉండడంతో వారు చెప్పినట్లే పోలీసులు వినాల్సిన పరిస్థితి ఏర్పడింది. తమకు అనుకూలంగా వ్యవహరించిన పోలీసులకు నజరానాలు అందుతుండగా, వినని వారికి ట్రాన్స్‌ఫర్లు, పనిష్మెంట్లు తప్పడం లేదు.
నెలకు రూ. 15 కోట్ల వ్యాపారం
సూర్యాపేట, హుజూర్‌నగర్, కోదాడ ప్రాంతాల్లో రేషన్ బియ్యం దందా జోరుగా సాగుతోంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న 15 మందికిపైగా ఏజెంట్లు డీలర్లు, లబ్ధిదారుల నుంచి బియ్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. అలా సేకరించిన బియ్యాన్ని గ్రామాల్లో డంప్ చేస్తూ రాత్రివేళల్లో ఆటోలు, ట్రాలీల ద్వారా గుట్టుచప్పుడు కాకుండా మఠంపల్లి నుంచి ఏపీకి తరలిస్తున్నారు. అక్కడి నుండి డైరెక్ట్‌గా కాకినాడ పోర్టుకు చేరవేస్తున్నారు. ఇలా సూర్యాపేట జిల్లాలో నెలకు రూ. 15 కోట్లకు పైగా బిజినెస్ జరుగుతున్నట్లు సమాచారం.
పావులుగా మారుతున్న పోలీసులు
హుజూర్‌నగర్ నియోజకవర్గ కేంద్రంగా జరుగుతున్న రేషన్ దందాలో లీడర్ల ప్రమేయం ఉండడంతో వారు పోలీసులను పావులుగా వాడుకుంటున్నారు. తాము చెప్పిన వారి లోడ్లను చూసీచూడనట్లుగా వదిలేయాలని ఒత్తిడి తెస్తున్నారు. తమ మాట వినని వారిని ట్రాన్స్‌ఫర్ చేయిస్తున్నారు. ఇటీవల మఠంపల్లి మండలంలో ఓ కానిస్టేబుల్ పీడీఎస్ బియ్యాన్ని పట్టుకునే ప్రయత్నం చేశాడు. దీంతో అతడిని ఏకంగా మరో జిల్లాకు ట్రాన్స్‌ఫర్ చేయించారు. ఈ మండలంలో పీడీఎస్ దందా యథేచ్ఛగా సాగుతున్నా రెండేళ్ల నుంచి ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అలాగే సూర్యాపేట రాజీవ్‌నగర్ కేంద్రంగా రేషన్ బియ్యం డంపింగ్ జరుగుతున్నా పోలీసులు అటువైపు కన్నెత్తి చూడడం లేదు. దందాలో అధికార పార్టీ లీడర్ల ప్రమేయం ఉండడమే ఇందుకు కారణమని పలువురు చర్చించుకుంటున్నారు. మేళ్లచెర్వు, చింతల పాలెం, కోదాడ, మఠంపల్లి మండలంలో అధికార పార్టీ నేతలకు భయపడి పోలీసులు నిల్వలు , లారీల జోలికి వెళ్లడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
తెలంగాణ, ఏపీ పోలీసుల మధ్య గొడవ
రేషన్ బియ్యం పట్టుకునే విషయంలో తెలంగాణ, ఏపీ పోలీసుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. మఠంపల్లి మండలంలో కొందరు వ్యక్తులు ఇటీవల రేషన్ బియ్యాన్ని లోడ్ చేస్తుండగా గ్రామస్తుల సమాచారంతో పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. లారీని పోలీస్ స్టేషన్‌కు తరలించే క్రమంలో డ్రైవర్ లారీని మట్టపల్లి బ్రిడ్జి వైపు తీసుకెళ్లి బార్డర్ దాటించారు. దీంతో పోలీసులు ఏపీ చెక్‌పోస్టు ఆఫీసర్లకు సమాచారం ఇవ్వడంతో వారు లారీని అడ్డుకొని కానిస్టేబుల్ వెనక్కి పంపించారు. అయితే లారీని తామే పట్టుకున్నామని తిరిగి అప్పగించాలని తెలంగాణ పోలీసులు కోరగా ఏపీ ఆఫీసర్లు తిరస్కరించారు. ఈ విషయంలో ఇరు రాష్ట్రాల పోలీసుల మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది.
రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాలి
మునుగోడు, వెలుగు : పంట నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీని విడుదల చేయాలని బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు కాసాల వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లా చండూరులో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ఎనిమిదేళ్ల పాలనలో ఒక్కసారి మాత్రమే ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చారన్నారు. పంట నష్టం అంచనాలను తయారు చేసి చేతులు దులుపుకుంటున్నారే తప్ప ఒక్కరికి కూడా పరిహారం ఇవ్వడం లేదన్నారు. బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి నకిరేకంటి లింగస్వామి, జిల్లా కార్యవర్గ సభ్యుడు ఏనుగు వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.
నేడు మెగా లోక్ అదాలత్
హుజూర్‌నగర్, వెలుగు : సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ కోర్టులో శనివారం జాతీయ మెగా లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సాముల రాంరెడ్డి, అధికార ప్రతినిధి కాల్వ శ్రీనివాసరావు శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సీనియర్, జూనియర్ సివిల్ జడ్జిలు సీహెచ్‌ఏఎన్. మూర్తి, సంకేత్ మిత్రాల ఆధ్వర్యంలో లోక్ అదాలత్ జరుగుతుందన్నారు. క్లయింట్లు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
పులిచింతలకు కొనసాగుతున్న వరద
మేళ్లచెరువు (చింతలపాలెం), వెలుగు : నాగార్జునసాగర్ నుంచి నీటిని విడుదల చేస్తుండడంతో సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం పులిచింతల ప్రాజెక్ట్‌కు భారీగా ఇన్‌ఫ్లో వస్తోంది. ఎగువ నుంచి 3,92,623 క్యూసెక్కుల వరద వస్తుండడంతో 14 గేట్లను ఎత్తి 3,57,946 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్ట్‌లో 32.7 టీఎంసీల నీరు నిల్వ ఉందని, పవర్ జనరేష్ కొనసాగుతోందని ప్రాజెక్ట్ ఎస్‌ఈ దేశ్యానాయక్ తెలిపారు.
రేవంత్ పాదయాత్రను సక్సెస్ చేయాలి
చౌటుప్పల్, వెలుగు : ఆజాదీ కా గౌరవ్ యాత్రలో భాగంగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి శనివారం యాదాద్రి జిల్లా సంస్థాన్‌నారాయణపురం నుంచి చౌటుప్పల్ వరకు నిర్వహించనున్న పాదయాత్రను సక్సెస్ చేయాలని మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి పిలుపునిచ్చారు. చౌటుప్పల్‌లో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఉదయం 10 గంటలకు నారాయణపురం నుంచి ప్రారంభమయ్యే పాదయాత్ర సాయంత్రం వరకు చౌటుప్పల్‌కు చేరుకుంటుందన్నారు. కాంగ్రెస్‌ను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. సమావేశంలో యాదాద్రి డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, నాయకులు రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, పాల్వాయి స్రవంతి, చెరుకు సుధాకర్, పల్లె రవికుమార్, చలమల కృష్ణారెడ్డి, పున్న కైలాశ్‌నేత, అనిల్, చెవిటి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
మునుగోడు కమ్యూనిస్టుల కంచుకోట
మునుగోడు, వెలుగు : మునుగోడు నియోజకవర్గం కమ్యూనిస్టుల కంచుకోట అని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి చెప్పారు. నల్గొండ జిల్లా చండూరు పార్టీ ఆఫీస్‌లో శుక్రవారం నిర్వహించిన మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. 2018లో కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చి రాజగోపాల్‌రెడ్డిని గెలిపిస్తే ఆయన నియోజకవర్గానికి చేసిందేమీ లేదన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం రాజీనామా చేసి బీజేపీలో చేరుతున్నారు గానీ అభివృద్ధి కోసం కాదన్నారు. రేట్లు పెంచిన సామాన్యులపై భారం మోపుతున్న బీజేపీ ప్రభుత్వానికి ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. బీజేపీ ఓటమే లక్ష్యంగా పనిచేస్తామని స్పష్టం చేశారు. మునుగోడు బైపోల్‌లో అభ్యర్థిని నిలబెటట్టే విషయంపై ఆలోచన చేస్తున్నామన్నారు. పెండింగ్‌లో ఉన్న నక్కలగండి ఎత్తిపోతల పథకాన్ని వెంటనే పూర్తి చేయాలని, నిర్వాసితులకు మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ తరహాలో పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 4 నుంచి 7 వరకు జరిగే రాష్ట్ర మహాసభలను సక్సెస్ చేయాలని పిలుపునిచ్చారు. మండల కార్యదర్శి నలపరాజు సతీశ్‌కుమార్ అధ్యక్షత జరిగిన మీటింగ్‌లో జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం, జిల్లా కార్యవర్గ సభ్యుడు ఉజ్జిని యాదగిరిరావు, మందడి నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మిర్యాలగూడ జిల్లా సాధనే లక్ష్యం
మిర్యాలగూడ, వెలుగు : మిర్యాలగూడ జిల్లా సాధనే లక్ష్యంగా అన్ని వర్గాలతో కలిసి ముందుకు సాగుతున్నామని ఐక్య వేదిక సభ్యులు వస్కుల మట్టయ్య చెప్పారు. మిర్యాలగూడ జిల్లాను ప్రకటించేలా కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యేలు జూలకంటి రంగారెడ్డి, తిప్పన విజయసింహారెడ్డికి శుక్రవారం వినతిపత్రాలు అందజేశారు. దేవరకొండ, నాగార్జునసాగర్, మిర్యాలగూడ, హుజూర్‌నగర్ నియోజకవ్రగాలను కలుపుకొని మిర్యాలగూడ జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా సాధనకు ప్రతిఒక్కరూ పోరాటం చేయాలని కోరారు. కార్యక్రమంలో పరంగి రాము, కాశీ, అంజి, నసీరుద్దీన్, తలకొప్పుల సైదులు, సలీం, గోపి, కిరణ్ పాల్గొన్నారు.
మునుగోడులో టీఆర్‌ఎస్‌దే గెలుపు
మునుగోడు/సంస్థాన్‌నారాయణపురం, వెలుగు : నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో ఈ నెల 20న నిర్వహించే సీఎం సభా స్థలాన్ని శుక్రవారం విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పరిశీలించారు. మునుగోడుతో పాటు, సంస్థాన్‌నారాయణపురంలోని స్థలాలను చూశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించేందుకే సీఎం సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తన వ్యక్తిగత లాభం, వ్యాపారాల కోసం రాజీనామా చేసి బీజేపీలో చేరారని ఆరోపించారు. మునుగోడులో టీఆర్‌ఎస్ బలంగా ఉందని, కాంగ్రెస్, బీజేపీ రెండో స్థానం కోసమే పోటీ పడుతున్నాయన్నారు. సీఎం సభకు కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. అంతకుముందు గుడిమల్కాపురంలో దళితబంధు పథకం లబ్ధిదారులు ఏర్పాటు చేసుకున్న వస్త్ర దుకాణాన్ని ప్రారంభించారు. ఆయన వెంట ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్‌రావు, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, ఎంపీపీ కర్నాటి స్వామియాదవ్, నాయకులు నారబోయిన రవి, మండల అధ్యక్షుడు బండ పురుషోత్తంరెడ్డి, నారాబోయిన రవి, నారాయణపురం ఎంపీపీ గుత్తా ఉమాదేవి, కర్నాటి స్వామి తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ గెలవగానే సమస్యలు పరిష్కరిస్తాం
యాదాద్రి, వెలుగు : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిర్వహిస్తున్న ప్రజాసంగ్రామ యాత్ర శుక్రవారం యాదాద్రి జిల్లా రామన్నపేట, నల్గొండ నార్కట్‌పల్లి మండలంలో కొనసాగింది. ఉదయం రామన్నపేట మండలం మునిపంపుల వద్ద పలువురు మహిళలు బండి సంజయ్‌కు రాఖీలు కట్టారు. అనంతరం పాదయాత్రను ప్రారంభించిన ఆయన పల్లివాడకు చేరుకొని పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్ చుగ్, మాజీ ఎంపీలు వివేక్ వెంకటస్వామి, గరికపాటి మోహన్‌రావు, జితేందర్‌రెడ్డి, ఎంపీ ధర్మపురి అర్వింద్ అక్కడికి వచ్చి బండి సంజయ్‌ని కలిశారు. అక్కడి నుంచి నాగులంచగూడెం, ఎన్నారం, పెద్దబావిగూడెం, నార్కట్‌పల్లి మండలంలోని పల్లెపహాడ్ మీదుగా పెరమండ్లబావికి చేరుకున్నారు. ఈ సందర్భంగా తమకు ఇండ్లు, రేషన్ కార్డులు లేవని ప్రజలు బండి సంజయ్ దృష్టికి తీసుకొచ్చారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పడగానే అన్ని సమస్యలను పరిష్కరిస్తామని, అర్హులైన వారందరికీ ఇండ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. అనంతరం నార్కట్‌పల్లి మండలం అమ్మనబోలులో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. యాత్ర ప్రముఖ్ గంగిడి మనోహర్‌రెడ్డి, యాదాద్రి, నల్గొండ జిల్లాల అధ్యక్షులు పీవీ శ్యాంసుందర్‌రావు, కంకణాల శ్రీధర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్, గోలి మధుసూదన్‌రెడ్డి, పడమటి జగన్మోహన్‌రెడ్డి, దాసరి మల్లేశం పాల్గొన్నారు.
ఘనంగా రాఖీ
రాఖీ పౌర్ణమి వేడుకలను శుక్రవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు తమ సోదరులకు రాఖీ కట్టి స్వీట్లు తినిపించారు. సూర్యాపేటలో మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డికి ఆయన సోదరి కట్టారేణుక రాఖీ కట్టారు. ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత ప్రగతిభవన్‌కు వెళ్లి సీఎం కేసీఆర్ రాఖీ కట్టారు. యాదగిరిపల్లిలో ఆలేరు ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్‌కు, చౌటుప్పల్‌లో మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి పలువురు వార్డు సభ్యులు, కౌన్సిలర్లు రాఖీలు కట్టారు. సూర్యాపేటలో నిర్వహించిన జాతీయ సమైక్యత కార్యక్రమంలో భాగంగా ఎస్పీ రాజేంద్రప్రసాద్, చైర్‌పర్సన్ పి.అన్నపూర్ణ పాల్గొన్నారు.
- వెలుగు నెట్‌వర్క్