ఆడపిల్ల అని తేలితే అబార్షనే

కోడ్​ లాంగ్వేజ్​ తో ఆర్ఎంపీల అబార్షన్​ దందా 
ఖమ్మం కేంద్రంగా సూర్యాపేట లో అబార్షన్లు 
ఇటీవల 10 మంది ఆర్ఎంపీలను అరెస్ట్ చేసిన పోలీసులు 
పరారీలో మరి కొంతమంది  
ఒక్కో అబార్షన్ కోసం రూ.30 వేలకు పైగా వసూళ్లు 

సూర్యాపేట వెలుగు : జిల్లాలో ఆర్‌‌‌‌‌‌‌‌ఎం‌‌‌‌‌‌‌‌పీలు గుట్టుగా గర్భిణులకు అబార్షన్లు చేయిస్తూ దందా సాగిస్తున్నారు.  రూ.20 వేలు ఇస్తే లింగ నిర్ధారణ చేస్తూ ఆడ పిల్లలు అని తేలితే  కొన్ని ప్రైవేట్ హస్పిటల్స్​  సాయంతో అబార్షన్ చేయిస్తున్నారు.  ఖమ్మం కేంద్రంగా సాగుతున్న ఈ దందాను ఇటీవల పోలీసులు బయట పెట్టారు. ఇప్పటికే కొంతమంది ఆర్‌‌‌‌‌‌‌‌ఎం‌‌‌‌‌‌‌‌పీలపై కేసులు నమోదు చేయగా మరి కొంతమందిపై నిఘా పెట్టినట్లు సమాచారం. 

ఖమ్మం  కేంద్రంగా అబార్షన్లు

ఖమ్మం  కేంద్రంగా జిల్లాలో ఎక్కువగా ఆర్‌‌‌‌‌‌‌‌ఎం‌‌‌‌‌‌‌‌పీలు అబార్షన్లు చేయిస్తున్నారు.  లింగ నిర్ధారణ చేసుకునే వారిలో ఎక్కువగా మగ పిల్లాడు కావాలనుకునేవారు ఉంటున్నారు. మొదట ఆడపిల్ల పుట్టాక మగ సంతానం కోసం ఆర్‌‌‌‌‌‌‌‌ఎం‌‌‌‌‌‌‌‌పీ లను ఆశ్రయిస్తున్నారు.  జిల్లాలోని కొంతమంది ఆర్ఎంపీలు ముఠాగా ఏర్పడి ఖమ్మం జిల్లాలోని ఒక వ్యక్తితో కలిసి జిల్లాలోని స్కానింగ్ సెంటర్లు, డాక్టర్లు,  మెడికల్ షాప్స్ తో కలిసి ఈ దందా నడిపిస్తున్నాయి.  ఇందులో స్కానింగ్ సెంటర్లు టెస్టులు చేసి ఆడ, మగ వివరాలు చెప్పడం ఒకటైతే, డాక్టర్లు దొంగచాటున క్లినిక్ లో అబార్షన్లు చేయడం మరో అంశం. ఇవేవీ లేకుండా కొంతమంది ఆర్‌‌‌‌‌‌‌‌ఎం‌‌‌‌‌‌‌‌పీలే స్వయంగా ఇంటికి వచ్చి టాబ్లెట్ పద్ధతిలో అబార్షన్ చేస్తున్నారు. ఒక్కో అబార్షన్ కోసం రూ. 20 వేల నుంచి రూ.50 వేల వరకు వసూలు చేస్తున్నారు.

స్కానింగ్ సెంటర్లలో కోడ్ లాంగ్వేజ్  

పుట్టబోయే బిడ్డ మగ, ఆడ చెప్పే సమయంలో కొన్ని స్కానింగ్ సెంటర్లలో పట్టుబడకుండా కోడ్ లాంగ్వేజ్ తో మేనేజ్ చేస్తున్నారు. గర్భిణిలు మొదటగా ఆర్‌‌‌‌‌‌‌‌ఎం‌‌‌‌‌‌‌‌పీ ల వద్దకు రాగానే  ఒంటరిగా స్కానింగ్ సెంటర్లకు తీసుకెళ్తారు. అక్కడ  లోపలికి వెళ్లే ముందు మొబైల్ తీసుకు రానివ్వరు. స్కానింగ్ చేశాక ఆడ పిల్ల అయితే పాప మంచిగా ఉందంటూ, బాబు అయితే అబ్బాయి చాలా ముద్దుగా ఉన్నడంటూ కోడ్ లాంగ్వేజ్ లో చెప్తారు.  జిల్లా కేంద్రంలోని ఒక స్కానింగ్ సెంటర్, కోదాడ, హుజూర్ నగర్ లో ఈ వ్యవహారం గుట్టుగా సాగుతుండగా ఇప్పుడు ఖమ్మం నుంచి టెక్నీషియన్లు పోర్టబుల్ అల్ట్రా సౌండ్ మిషన్ తీసుకొచ్చి ప్రైవేట్ హాస్పిటల్స్ లో స్కానింగ్ చేస్తున్నారు.  

ఇటీవల 10  మంది ఆర్ఎంపీలను అరెస్ట్ చేసిన పోలీసులు

జిల్లా కేంద్రంలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో ఇద్దరు గర్భిణులకు అబార్షన్ చేస్తుండగా డీ‌‌‌‌‌‌‌‌ఎం‌‌‌‌‌‌‌‌హెచ్‌‌‌‌‌‌‌‌ఓ ఆకస్మికంగా తనిఖీలు చేపట్టి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. హాస్పిటల్ పై కేసు పెట్టగా విచారణ చేపట్టిన పోలీసులు ఈ వ్యవహారంలో కీలక పాత్ర ఆర్‌‌‌‌‌‌‌‌ఎం‌‌‌‌‌‌‌‌పీలదే అని తేల్చారు. మొత్తం 17మంది పేర్లను బయట పెట్టగా వీరిలో 10 మంది ఆర్‌‌‌‌‌‌‌‌ఎం‌‌‌‌‌‌‌‌పీలే ఉండడం గమనార్హం. మరి కొన్ని హాస్పిటల్స్, స్కానింగ్ సెంటర్ల పై నిఘా పెట్టిన పోలీసులు మరి కొంత మందిని అదుపులోకి తీసుకునే అవకాశలు ఉన్నట్లు సమాచారం. 

లింగ నిర్ధారణ చేస్తే కఠిన చర్యలు..  

స్కానింగ్ సెంటర్లు, హాస్పిటల్స్ లలో లింగ నిర్దారణ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ఇటీవల అబార్షన్​ చేస్తున్న హాస్పిటల్ ను సీజ్ చేశాం.  స్కానింగ్ సెంటర్ల పై నిఘా ఉంచాం. 
- డాక్టర్ కోట చలం, డిఎం‌‌‌‌‌‌‌‌హెచ్‌‌‌‌‌‌‌‌ఓ, సూర్యాపేట