- సూర్యాపేటలో లోకల్ బీఆర్ఎస్ నాయకుడి ఇంటి ముందు బైఠాయింపు
- పంచుమని పార్టీ రూ.40 లక్షలిస్తే నొక్కేశాడని ఫైర్
సూర్యాపేట/కామారెడ్డి, వెలుగు : స్థానిక నాయకులు డబ్బులు ఇవ్వలేదంటూ ఓటర్లు నిరసనకు దిగారు. శనివారం సూర్యాపేట, కామారెడ్డిలో ఆందోళనలు చేశారు. సూర్యాపేట మున్సిపాలిటీ 20వ వార్డులోని జమ్మిగడ్డలో లోకల్ బీఆర్ఎస్ నాయకుడి ఇంటి ముందు ఓటర్లు బైఠాయించారు. ఓటర్లకు పంచుమని పార్టీ డబ్బులిస్తే, ఆ నాయకుడే నొక్కేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘రావాలమ్మ రావాలి.. డబ్బులు పంచుతున్రు రావాలి.. డబ్బులు రానోళ్లు అందరూ రావాలి’ అంటూ మైక్ పెట్టుకుని నిరసన తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని నిరసనకారులను పంపించి వేశారు. ఈ సందర్భంగా కొందరు ఓటర్లు మాట్లాడు తూ.. తమ వార్డులో డబ్బులు పంచుమని బీఆర్ఎస్ పార్టీ పంపినప్పటికీ, లోకల్ నాయకుడు పంచలేదని మండిపడ్డారు. పార్టీ రూ.40 లక్షలు ఇస్తే, ఆ నాయకుడే వాటిని నొక్కేశాడంటూ ఫైర్ అయ్యారు. ‘‘పోలింగ్ రోజున డబ్బులు ఇస్తామంటూ పేర్లు, ఫోన్ నంబర్లు తీసుకునిపోయారు.
డబ్బుల కోసం పోలింగ్ రోజు తెల్లవారుజాముదాకా నిద్ర పోకుండా ఉన్నాం. అయినా ఇవ్వకపోవడంతో సాయంత్రం 5 గంటల వరకు ఓటెయ్యకుండా ఎదురుచూశాం. పిచ్చి కుక్కలను తిప్పినట్టు తిప్పి చివరికి సాయంత్రం 5 గంటలకు 10 మందికి మాత్రమే డబ్బులు ఇచ్చా రు. దీంతో ఆలస్యంగా ఓటేయడానికి వెళ్తే రాత్రి 11గంటల వరకు పోలింగ్ జరిగింది. డబ్బుల విషయం తేల్చుకుందామని నాయకుడి ఇంటికి వస్తే, హైదరాబాద్ వెళ్లాడని చెప్తున్నారు. మా డబ్బులు ఎవరికిచ్చారో చెప్పకుంటే అతనిపై మంత్రి జగదీశ్ రెడ్డికి ఫిర్యాదు చేస్తాం’’ అని హెచ్చరించారు.
కామారెడ్డిలోనూ..
తమకు డబ్బులు ఇస్తామని చెప్పి ఇవ్వలేదంటూ కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఇసాయిపేటలో ఓటర్లు ఆందోళనకు దిగారు. బీఆర్ఎస్ పార్టీ లోకల్ ఇన్చార్జ్ తమకు పైసలు ఇస్తామని చెప్పి, ఇప్పుడు ముఖం చాటేశాడంటూ పలువురు ఓటర్లు చౌరస్తాలో నిరసన తెలిపారు. తమకెందుకు పైస లివ్వడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరికే పైసలిచ్చారని, మిగతా వారికి ఎందుకు ఇవ్వలేదంటూ ప్రశ్నించారు.