చెన్నై: తమిళనాడులో ప్రయాణికులతో వెళుతున్న రైలు పెద్ద గండం నుంచి త్రుటిలో తప్పించుకుంది. వేలూరు జిల్లా కాట్పాడి సమీపంలో వివేక్ ఎక్స్ప్రెస్ ట్రైన్కు పెను ప్రమాదం తప్పింది. కాట్పాడి రైల్వేస్టేషన్ సమీపంలో ఇంజన్కు, బోగీలకు మధ్య ఉండే లింక్ తెగింది. లోకో పైలట్ వెంటనే అప్రమత్తం కావడంతో లింక్ రాడ్ విరిగిపోయినప్పటికీ అదృష్టవశాత్తూ బోగీలు పట్టాల పైనే నిలిచిపోయాయి. దీంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ముకుందరాయపురం, తిరువాళం రైల్వే స్టేషన్ల మధ్య ఈ ఘటన జరిగింది.
ఈ ఘటనపై అధికారులకు సమాచారం ఇవ్వడంతో 20 మంది సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. శుక్రవారం ఉదయం 9:30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఈ రైలు నిలిచిపోవడంతో చెన్నై, బెంగుళూరు మధ్య రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ రూట్లో రాకపోకలు సాగించాల్సిన రైళ్లను ఎక్కడికక్కడ స్టేషన్లలోనే నిలిపివేశారు.