ఫోన్ హ్యాక్ అయ్యిందా? .. కనుక్కోండి ఇలా

ఫోన్ హ్యాక్ అయ్యిందా? .. కనుక్కోండి ఇలా
  • ఛార్జింగ్ నిలవదు, ఫోన్ తొందరగా వేడెక్కుతుంది, యాప్స్ సరిగ్గా పనిచేయవు..
  • బ్లూటూత్, వైఫై ఆన్‌‌‌‌లో ఉంటే  హ్యాకింగ్‌‌‌‌కు గురయ్యే ఛాన్స్‌‌‌‌
  • పబ్లిక్ వైఫై నెట్‌‌‌‌వర్క్స్‌‌‌‌ను ఎక్కువగా వాడొద్దంటున్న నిపుణులు

బిజినెస్‌‌‌‌ డెస్క్‌‌‌‌, వెలుగు: ప్రస్తుత టెక్ యుగంలో ఎలక్ట్రానిక్ డివైజ్‌‌‌‌లు ఈజీగా హ్యాకింగ్‌కు గురవుతున్నాయి. చాలా మంది యూజర్లకు తమ ఫోన్లు హ్యాక్‌‌‌‌ అయ్యాయనే విషయం కూడా తెలీయడం లేదు. యూజర్లు  సోషల్ మీడియాలో బ్రౌజింగ్ చేస్తూనో లేదా  ఏ వీడియో చూస్తూ తెలియకుండానే  కొన్ని ప్రమాదకరమైన లింకులను క్లిక్ చేస్తున్నారు. దీనిని అనువుగా చేసుకొని సైబర్ నేరగాళ్లు మాల్వేర్‌‌, స్పైవేర్‌‌తో అటాక్‌ చేస్తున్నారు.

 యూజర్  లింక్ క్లిక్ చేసి  తన తప్పు తెలుసుకొని బ్యాక్‌‌‌‌కు వచ్చేసినా బ్యాక్‌‌‌‌గ్రౌండ్‌‌‌‌లో  ఏ మాల్వేర్ యాప్ డౌన్‌‌‌‌లోడ్ అయిపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో  తమ ఫోన్లు హ్యాకింగ్‌‌‌‌కు గురయ్యాయనేది కొన్ని లక్షణాల బట్టి తెలుసుకోవచ్చు. ఫోన్ హ్యాకింగ్‌‌‌‌కు గురైతే  బ్యాటరీ  ఛార్జింగ్ తొందరగా అయిపోతుంది. ఫోన్ ఈజీగా వేడెక్కడం, యాప్స్‌‌‌‌ సడెన్‌‌‌‌గా ఆగిపోవడం, ఫోన్ సడెన్‌‌‌‌గా రీబూట్‌‌‌‌ అవ్వడం వంటివి  కొన్ని సంకేతాలు. 

యూజర్ల ఫోన్‌‌‌‌ బిల్లులో గుర్తుతెలియని డేటా, టెక్స్ట్‌‌‌‌లు, వింత ఛార్జీలు ఉండొచ్చు. హ్యాకర్ల బారిన పడకుండా ఉండాలంటే యూజర్లు  తమ ఫోన్లను ఎన్‌‌‌‌క్రిఫ్ట్ (సెక్యూరిటీ సెట్టింగ్స్‌‌‌‌లో ఉంటుంది) చేసుకోవాలని సైబర్‌‌‌‌‌‌‌‌సెక్యూరిటీ కంపెనీ మెకెఫీ  సలహా ఇస్తోంది.   సిమ్‌‌‌‌ కార్డులను లాక్ చేసుకోవాలని, వీలున్నప్పుడల్లా వర్చువల్ ప్రైవేట్ నెట్‌‌‌‌వర్క్స్‌‌‌‌ను వాడాలని, వైఫై, బ్లూటూత్ వాడని టైమ్‌‌‌‌లో వీటిని ఆపేయాలని పేర్కొంది. థర్డ్‌‌‌‌ పార్టీ యాప్‌‌‌‌ స్టోర్లకు దూరంగా ఉండాలని, ఎప్పటికప్పుడు ఫోన్ సాఫ్ట్‌‌‌‌వేర్‌‌‌‌‌‌‌‌, ఆపరేటింగ్‌‌‌‌ సిస్టమ్‌‌‌‌ను అప్‌‌‌‌డేట్ చేసుకోవాలని తెలిపింది. 

ఫోన్లను ఎలా హ్యాక్‌‌‌‌ చేస్తారంటే!

యూజర్లు జాగ్రత్తగా ఉంటే ఫోన్లను, ల్యాప్‌‌‌‌టాప్‌‌‌‌లను సైబర్ మోసగాళ్లు అంత ఈజీగా హ్యాక్ చేయలేరు. హ్యాక్ చేయడానికి మాల్వేర్‌‌‌‌‌‌‌‌ ఉన్న యాప్‌‌‌‌లను డౌన్‌‌‌‌లోడ్‌‌‌‌ చేసుకునేలా యూజర్లను ప్రలోభ పెడతారు. భారీ డిస్కౌంట్‌‌‌‌లు పొందొచ్చనో లేదా కారు గెలుచుకున్నారు మీ పూర్తి డిటైల్స్ ఇవ్వాలనో అడుగుతారు.  ఇలా మాల్వేర్‌‌‌‌‌‌‌‌ యాప్‌‌‌‌ను డౌన్‌‌‌‌లోడ్ చేసుకునేలా చేస్తారు. లేకపోతే యూజర్ల నమ్మకం పొంది ఫోన్‌‌‌‌ను హ్యాక్‌‌‌‌ చేస్తారు. అంతే కాకుండా పబ్లిక్ వైఫై హాట్‌‌‌‌ స్పాట్‌‌‌‌లను వాడి  హ్యాక్ చేయొచ్చు. కీలాగర్స్‌‌‌‌ (కీబోర్డులోని స్ట్రోక్స్‌‌‌‌ను రికార్డ్ చేయడం) టెక్నాలజీతో యూజర్లు ఏం టైప్ చేశారో తెలుసుకోగలరు. ఒక వేళ  బ్లూటూత్ ఆన్‌‌‌‌లో ఉంటే  30 అడుగుల దూరంలో ఉండి కూడా ఫోన్లను సైబర్ మోసగాళ్లు హ్యాక్ చేయగలరు. 

ఆండ్రాయిడ్ కంటే ఐఫోన్ సేఫ్‌‌‌‌ కదా! 

సింగిల్ ఆపరేటింగ్ సిస్టమ్‌‌‌‌ కావడంతో బగ్స్‌‌‌‌ను యాపిల్‌‌‌‌ ఈజీగా ఫిక్స్ చేయగలుగుతుంది. కానీ, ఆండ్రాయిడ్‌‌‌‌ ఓఎస్  వివిధ రూపాల్లో వస్తోంది. దీంతో అప్‌‌‌‌డేట్స్‌‌‌‌ అంత ఈజీగా జరగవు. పెగాసస్ వంటి స్పైవేర్‌‌‌‌‌‌‌‌లు యాపిల్‌‌‌‌ ఫోన్లను కూడా  హ్యాక్‌‌‌‌ చేయగలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. కానీ, వీటిని హ్యాక్ చేయడం ఎక్కువ ఖర్చుతో కూడుకున్నదని అన్నారు.

స్టేట్‌‌‌‌ స్పాన్సర్డ్‌‌‌‌ అటాక్‌‌‌‌ అంటే..!

స్టేట్‌‌‌‌ స్పాన్సర్డ్‌‌‌‌ సైబర్‌‌‌‌‌‌‌‌ అటాక్స్ అంటే ఏదైనా దేశానికి చెందిన హ్యాకర్లు మరో దేశంలోని ప్రభుత్వ వెబ్‌‌‌‌సైట్‌‌‌‌లు, పవర్ గ్రిడ్స్ వంటి కీలకమైన ఇన్‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌‌‌‌‌లను హ్యాక్ చేయడం. ఉదాహరణకు ఇండియాపై  చైనా లేదా పాకిస్తాన్  చేస్తున్న సైబర్ దాడులు. ఈ  మధ్య కాలంలో ప్రతిపక్ష నాయకుల ఐఫోన్లు హ్యాకింగ్‌‌‌‌కు గురయ్యాయనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఐఫోన్ యూజర్లు మంగళవారం ‘స్టేట్ స్పాన్సర్డ్‌‌‌‌’ అటాక్స్‌‌‌‌ జరుగుతున్నట్టు  వార్నింగ్స్ అందుకున్నారు. దీనిపై దర్యాప్తు చేయాలని ప్రభుత్వం  యాపిల్‌‌‌‌ను కోరింది. 

అంతేకాకుండా 150 దేశాల్లోని యూజర్లకు  ఇటువంటి అలర్ట్స్‌‌‌‌ను  ఎందుకు పంపిందో క్లారిటీ ఇవ్వాలని  ఆదేశించింది. ఈ వార్నింగ్స్‌‌‌‌ ఎటువంటి స్టేట్‌‌‌‌ స్పాన్సర్డ్‌‌‌‌ అటాక్స్‌‌‌‌ కావని కంపెనీ పేర్కొంది.  ప్రభుత్వం  యాక్టివిస్ట్‌‌‌‌లు, జర్నలిస్టుల ఫోన్లను హ్యాక్ చేయడానికి   మిలిటరీ గ్రేడ్‌‌‌‌ పెగాసస్‌‌‌‌ స్పైవేర్‌‌‌‌‌‌‌‌ను వాడిందని 2021 లో  ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ అంశంపై దర్యాప్తు జరిపిన సుప్రీం కోర్టు అలాంటిది ఏం జరగలేదని పేర్కొంది. కానీ, ప్రభుత్వ అధికారులు దర్యాప్తుకు సహకరించలేదని తెలిపింది. పెగాసస్‌తో చైనా, రష్యా, యూకే, యూఎస్ ప్రభుత్వాలు  తమ ప్రజలపై నిఘా పెట్టాయని రూమర్స్ వచ్చాయి.