బీజేపీ బిగ్ స్కెచ్.. గెలుపే లక్ష్యంగా ఆపరేషన్ తెలంగాణ

  • బీజేపీ బిగ్ స్కెచ్
  • గెలుపే లక్ష్యంగా ఆపరేషన్ తెలంగాణ
  • పుసుపుబోర్డు, గిరిజన వర్సీటీ ప్రకటనతో జోష్
  • రేపు  నిజామాబాద్ లో మోదీ .. ఇందూరు ప్రజాగర్జన
  • త్వరలో కరీంనగర్, నిర్మల్ లో సభలకు ప్రణాళిక
  • 6న తెలంగాణకు జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా
  • 10న రాష్ట్రానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా
  • కేంద్ర మంత్రులు, జాతీయ నేతల పర్యటనలకు ప్లాన్
  • మోదీ పథకాలను ప్రజలకు చెప్పేలా తీసుకెళ్లేలా ఏర్పాట్లు
  • బీఆర్ఎస్ సర్కారుపై విమర్శల దాడి పెంచే యోచన

హైదరాబాద్ : తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కార్యాచరణకు బీజేపీ శ్రీకారం చుట్టింది. నిన్న ప్రధాని పాలమూరు సభతో పార్టీ కేడర్ లో జోష్ పెరిగింది. మహబూబ్ నగర్  కు వచ్చిన ప్రధాన మంత్రి పసుపుబోర్డు, గిరిజన యూనివర్సిటీని ప్రకటించడం బాగా కలిసి వస్తుందని కమలనాథులు భావిస్తున్నారు. పీఎం ప్రకటన నిజామాబాద్, ములుగు జిల్లాల్లో జోష్ నింపింది. ఇవాళ ఉదయం నుంచి ప్రధాని చిత్రపటాలకు పాలాభిషేకాలు చేస్తున్నారు.

నిజామాబాద్ లో పసుపు రైతులతో కలిసి ఎంపీ అర్వింద్ భారీ ర్యాలీ నిర్వహించడం విశేషం. రేపు ప్రధానమంత్రి నరేంద్ర మ మోదీ నిజామాబాద్ లో నిర్వహించే ఇందూరు ప్రజాగర్జన సభలో  పాల్గొననున్నారు. త్వరలోనే నిర్మల్, కరీంనగర్ లలో ప్రధానమంత్రి సభలకు ఏర్పాట్లు చేస్తున్నట్టు బీజేపీ రాష్ట్ర నాయకత్వం చెబుతోంది. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనంటూ కాంగ్రెస్ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు బీజేపీ రెడీ అవుతోంది. మరింత మంది జాతీయ నాయకులు తెలంగాణలో పర్యటించేలా బీజేపీ రాష్ట్ర నాయకత్వం కార్యాచరణను సిద్ధం చేస్తోంది.
 

పసుపు బోర్డుతో ఫుల్ జోష్

మహబూబ్ నగర్ పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో పసుపుబోర్డు ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించడం, ములుగు జిల్లాలో సమ్మక్క, సారక్క ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు బీజేపీ క్యాడర్ లో కొత్త జోష్ నింపాయి. పసుపుబోర్డు విషయంలో నిజామాబాద్ ఎంపీ అర్వింద్ పై బీఆర్ఎస్  నేతలు చేస్తున్న ప్రచారానికి బ్రేక్ పడింది. నిజామాబాద్ లో ఇవాళ రైతులు పెద్ద ఎత్తున పటాకులు కాల్చుతూ, స్వీట్లు పంచుకొంటూ.. పసుపు చల్లుకొంటూ సంబరరాలు చేసుకున్నారు. అటు ములుగు జిల్లాల్లోనూ ట్రైబల్ వర్సిటీ ఏర్పాటుపై హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. 
 

జాతీయ నేతల పర్యటనలు

బీజేపీ జాతీయ అధ్యక్షుడు  జేపీ నడ్డా ఈ నెల 6న హైదరాబాద్ వస్తున్నారు. ఎన్నికలకు సన్నద్దం చేయడంతోపాటు గెలుపుకోసం అనుసరించాల్సిన వ్యూహాలను చర్చించడమే లక్ష్యంగా ఆయన పర్యటన సాగనుంది. ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ నిర్మల్, కరీంనగర్ లలో జరిగే సభల్లో పాల్గొంటారు. 10 వ తేదీన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాష్ట్రంలో పర్యటించనున్నారు. పలువురు కేంద్ర  మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతోపాటు  తెలంగాణకు చుట్టుపక్కల ఉన్న కర్నాటక, మహారాష్ట్ర, ఏపీకి చెందిన పార్టీ జాతీయ నాయకులను, ఎంపీలు, ఎమ్మెల్యేలను రాష్ట్రానికి తీసుకొచ్చిన ప్రచారం చేయించేందుకు బీజేపీ ప్లాన్ చేస్తోంది. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు.. వాటిలో కేంద్ర వాటాను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు ఉపయుక్తంగా ఉంటాయని భావిస్తోంది. 
 

బీఆర్ఎస్ పై విమర్శల దాడి 

బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనంటూ కాంగ్రెస్ చేస్తున్న ప్రచారానికి చెక్ పెట్టే చర్యలకూ త్వరలోనే శ్రీకారం చుట్టనుంది.  సీఎం కేసీఆర్ పై.. సర్కారు అవినీతిపై పదునైన వివర్శనాస్త్రాలు సంధించేందుకు ప్లాన్ చేస్తోంది. బీఆర్ఎస్ కు బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయమనే వాదనను  ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు అస్త్రాలు  సిద్ధం చేసకున్నది. 
 

అమిత్​ షాకు రిపోర్ట్ కార్డ్ 

తాను బాధ్యతలు స్వీకరించిన తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు, చేపట్టిన కార్యక్రమాలపై బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి ఇవాళ ఉదయం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు రిపోర్ట్ కార్డు సమర్పించారు. గెలుపు కోసం ప్లాన్ చేయాల్సిన కార్యక్రమాలపై చర్చించారు.