కొత్త రెవెన్యూ చట్టాలకు సంబంధించిన బిల్లులను సెప్టెంబర్‌లో అసెంబ్లీ ఆమోదించింది. రెవెన్యూ శాఖ కూడా ముఖ్యమంత్రి దగ్గరే ఉన్నందువలన లోతుగానే కసరత్తు చేసి ఈ చట్టాలను ప్రవేశపెట్టారు. అయినప్పటికీ అసెంబ్లీలోనూ, బయటా అనేక సూచనలు, సలహాలను దృష్టిలో ఉంచుకొని కొన్ని మార్పులు, చేర్పులు చేశారు. తహసీల్దార్ కే సబ్ రిజిస్ట్రార్ బాధ్యతలు కూడా ఇవ్వడంతో ఆ పదవి కీలకంగా మారింది. కొత్త చట్టంలో వీఆర్వోలకు స్థానం కల్పించకుండా ఆ వ్యవస్థను రద్దు చేయడంతో గ్రామం , మండలాల మధ్య సమన్వయకర్త ఎవరనే ప్రశ్న తలెత్తుతోంది. రికార్డులు సరిచేసిన తర్వాత సర్వే నంబర్ వారీగా సమగ్ర సర్వే చేయడం ద్వారా ఇబ్బందులు రావన్నట్టుగా ముఖ్యమంత్రి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కానీ, థియరీకీ – ప్రాక్టికల్ కు చాలా తేడా ఉంటుంది.
గత ప్రభుత్వాలు కూడా రికార్డులు సరిచేయడానికి అనేక ప్రయత్నాలు చేశాయి. అయినా పూర్తి చేయలేకపోయాయి. రికార్డులు సరి చేయడగానికి అనేక కమిషన్లు వేశారు. ఇప్పుడు సీఎం కేసీఆర్ కూడా భూప్రక్షాళన పేరుతో ప్రయత్నం చేస్తున్నప్పటికీ అనేక తప్పులు దొర్లడం వల్ల పూర్తిస్థాయిలో రికార్డులు సరికావడం లేదు. అక్టోబర్ 29న ధరణి పోర్టల్‌ను ప్రారంభిస్తూ తహసీల్దార్ ఆఫీసులో భూముల రిజిస్ట్రేషన్లకు శ్రీకారం చుట్టారు. ధరణి పోర్టల్ లో అన్ని రికార్డులు సరవుతాయని, ఎలాంటి ఇబ్బందులకు తావులేదని ప్రభుత్వం వాదిస్తోంది. ఇప్పటికే పట్టణాలు/నగరాల్లో ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీం(ఎస్ఆర్ఎస్) కింద దరఖాస్తులు స్వీకరించి, భూ రికార్డులు సరిచేయడం ప్రభుత్వం ఆలోచనగా కనపడుతున్నది. అయితే సర్వే నంబర్ వారీగా సమగ్ర సర్వే జరగకుండా రికార్డులు సరికావనేది రెవెన్యూ నిపుణులు, రైతుల అభిప్రాయం. ధరణి పోర్టల్ ద్వారానే మొత్తం భూ సమస్యలు పరిష్కారమవుతాయని సీఎం భావిస్తున్నారు.
భూమి చుట్టే జీవితం
వ్యవసాయమే ప్రధాన వృత్తిగా ఉన్న మన దేశంలో ఇప్పటికీ చాలా మంది జీవితాలు భూమితోనే ముడిపడి ఉన్నాయి. మరోవైపు భూముల విలువలు భారీగా పెరిగాయి. ఆక్రమణలు జరుగుతున్నాయి. భూమి కోసమే ఎన్నో నేరాలు, ఘోరాలకు పాల్పడుతున్నారు. అన్నిటికీ మించి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం చేసి పది లక్షల ఎకరాల భూమి పంపిణీ జరిగిన ఈ నేలపైనే దశాబ్దాలు గడిచినా, తరాలు మారినా ఇప్పటికీ భూ పంపిణీ పూర్తిగా జరగలేదు. ఇటీవల తుపాన్లు భారీ వర్షాలతో వరంగల్, హైదరాబాద్ సిటీలతో పాటు ఇతర పట్టణాల్లోని అనేక కాలనీలు ముంపునకు గురై ప్రజలు నరకయాతన పడ్డారు. దీనికి మూల కారణం చెరువులు, కుంటలు, నాలాలు, పార్కులు అన్యాక్రాంతం కావడమే. “ఇల్లు అలకగానే పండుగ కాదు” అనే సామెత లాగా ధరణిలో అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని, అదే సర్వస్వం అనే ఆలోచనను ప్రభుత్వం మార్చుకోవాలి. ‘‘పుండు ఒక దగ్గర ఉంటే మందు మరో చోట రాస్తే అది మానదు”. పారదర్శకత, అంకితభావంతో పనిచేయాలి. అవసరమైన మేరకు సిబ్బందిని నియమించుకోకపోతే పై ఇలాంటి అంశాలకు ఏనాటికీ పరిష్కారం లభించదు. రెవెన్యూ చట్టాలలో తెచ్చిన సవరణలను అమలు చేయడానికి ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించుకోవాలి. అప్పుడే రైతులకు ఉపశమనం లభిస్తున్నది.
ఎకరానికి రూ.2,500 అదనం
ధరణిలో ఒక కోటి 45 లక్షల 58 వేల ఎకరాల భూ వివరాలకు సంబంధించిన సమాచారం నిక్షిప్తమై ఉన్నదని, ఆన్లైన్లో చూసుకోవడానికి అవకాశం కల్పించినట్లు సీఎం, అధికారులు చెబుతున్నారు. అయితే, ఇదేదో కొత్తగా పెట్టింది కాదు. ప్రభుత్వం వద్ద ఇప్పటి వరకు డాక్యుమెంట్ల రూపంలో ఉన్న రికార్డే. కానీ, రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు, రికార్డుల నిర్వహణలో పారదర్శకత, మధ్య దళారుల ప్రమేయం లేకుండా, అంతులేని జాప్యం జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం తీసుకువచ్చామని చెబుతున్న ‘ధరణి’ ఒక ప్రయోగమే. రిజిస్ట్రేషన్ ఫీజు వసూలులో భాగంగా భూముల విలువను పెంచలేదని ‘ధరణి’ ప్రారంభ సభలో సీఎం ప్రకటించారు. కానీ, ఆ తర్వాత మెల్లగా అసలు విషయాన్ని ప్రభుత్వం బయటపెట్టింది. ఇప్పటి వరకు ఉచితంగా చేస్తూ వస్తున్న మ్యుటేషన్‌కు ఎకరానికి రూ.2,500 ఫీజు, పాస్బుక్కు రూ.300, కొరియర్ చార్జీల కింద రూ. 200, ధరణి చార్జీలు రూ.425గా నిర్ణయించారు. అంటే ఎకరం రిజిస్ట్రేషన్ చేసుకుంటే సుమారు రూ.3,500 అదనంగా రైతుపై భారం పడుతుంది. గతంలో ఇదంతా నామమాత్రపు రుసుముకే పూర్తయ్యేది. ఈ చార్జీల ద్వారా ఏటా రూ.300 కోట్లు సమకూర్చుకోవాలని ప్రభుత్వం భావించడం సరికాదు. నామమాత్రపు రుసుమునే వసూలు చేయాలి.
సమగ్ర సర్వే-ఆపై భూ పంపిణీయే పరిష్కారం
రికార్డులను ‘ధరణి’లో పారదర్శకంగా ఉంచడమే అన్ని సమస్యలకు పరిష్కారం కాదు. పేదలకు భూపంపిణీ, ప్రభుత్వ భూముల ఆక్రమణలు, చెరువులు, కుంటల కబ్జాల తొలగింపు వంటి అంశాలు ఎప్పటి నుంచో నానుతున్నాయి. ఇప్పటికే టీఆర్ఎస్ తొలి మేనిఫెస్టోలో ఇచ్చిన దళిత, గిరిజనులకు మూడెకరాల భూ పంపిణీ, డబుల్ బెడ్రూం ఇండ్ల హామీ నెరవేరలేదు. భూమి దొరకకపోవడమే కారణమని ప్రభుత్వం చెబుతోంది. వీటన్నిటి పరిష్కారంతోపాటు, ‘ధరణి’ ప్రభుత్వం ఆశించిన లక్ష్యాలను అందుకోవాలంటే కచ్చితంగా సమగ్ర భూ సర్వే చేపట్టాల్సిందే. ఎప్పుడో నిజాం కాలంలో చేసిన సర్వేనే నేటికీ ఆధారంగా ఉన్నది. ఇప్పటికే అనేక మార్పులు వచ్చాయి. అతి త్వరలోనే డిజిటల్ సర్వే అని చాలా కాలంగా సీఎం కేసీఆర్ ఊరిస్తున్నారే తప్ప, నిర్దిష్టంగా ఎప్పటి నుంచి భూ సమగ్ర సర్వే చేపడుతారో ప్రకటించలేదు. ఈ ప్రక్రియను వెంటనే చేపట్టి, నిర్దిష్ట కాలపరిమితిలో పూర్తి చేయాలి. కబ్జాదారుల నుంచి భూములను నిక్కచ్చిగా స్వాధీనం చేసుకోవాలి. ప్రభుత్వ, మిగులు, అటవీ, బంజరు, ఇతర భూములను అవసరమైన పేదలకు పంపిణీ చేసే ప్రక్రియను కూడా సత్వరమే చేపట్టాలి. ఇదంతా గొలుసుకట్టుగా శరవేగంగా సాగితేనే మంచి ఫలితాలను ఇస్తుంది. లేదంటే కథ మళ్లీ మొదటికి వస్తుంది.