బిర్యానీ అంటే చాలామంది లొట్టలేసుకుని మరీ తింటారు. ఇంట్లో కుదరకపోతే.. బయటి నుంచి ఆర్డర్ తెప్పించుకుని తింటుంటారు ఫుడ్ ప్రియులు. మెచ్చిన రెస్టారెంట్‌లో నచ్చిన బిర్యానీ కోసం ఎంతైనా ఖర్చు చేయడానికైనా.. ఎంత దూరం వెళ్లడానికైనా.. ఫుడ్ డెలివరీ యాప్‌లో ఆర్డర్లు చేయడానికైనా కొంతమంది వెనక్కి తగ్గరు. అదే.. రూపాయికే బిర్యానీ వస్తుందంటే మాత్రం ఆగుతారా.. ? అబ్బే తగ్గేదేలే అంటారు. అవును కదా..!
అదే ఇప్పుడు కరీంనగర్ పట్టణంలోని తెలంగాణ చౌక్ లో జరిగింది. ఒక్క రూపాయి నోటుకే బిర్యానీ ఆఫర్ విషయం తెలుసుకున్న నాన్ వెజ్ ప్రియులు.. వందల సంఖ్యలో వెళ్లారు. చాలామంది వాళ్ల దగ్గర ఉన్న పాత నోట్లతో బిర్యానీ సెంటర్ వద్దకు చేరుకున్నారు. రోడ్లపై పెద్ద సంఖ్యలో జనం రావడంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. అక్కడ గందరగోళం నెలకొనడంతో న్యూసెన్స్ నెలకొంది. ఈ విషయం ట్రాఫిక్ పోలీసులకు తెలియడంతో అక్కడకు వెళ్లారు. బిర్యానీ పంపిణీ దగ్గర న్యూసెన్స్ కావడంతో రెస్టారెంట్ ఓనర్ కు వార్నింగ్ ఇచ్చారు పోలీసులు.
ఇక్కడ అసలు విషయం ఏంటంటే.. రూపాయి నోటు పట్టుకుని టూవీలర్ పై బిర్యానీ కోసం వచ్చిన వారికి పోలీసులు ఫైన్ వేశారు. రోడ్లపై వాహనాలను పార్కింగ్ చేసిన వారికి (ఒక్కో వ్యక్తికి) రూ.200 ఫైన్ చేశారు పోలీసులు. ఈ విషయం తెలిసి చాలామంది నవ్వుకుంటున్నారు ఇప్పుడు. రూపాయి బిర్యానీ కోసం వెళ్లి 200 రూపాయలతో జేబుకు చిల్లులు పెట్టుకున్నారంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పేలిపోతున్నాయి. నెటిజన్లు తమకు నచ్చిన విధంగా కామెంట్స్ తో కేక పుట్టిస్తున్నారు.
‘‘రూపాయికే బిర్యానీ వస్తుందంటే ఇలాగే ఉంటుంది బ్రో. పోలీసులు తమ స్టైల్లో మర్యాద చేశారులెండీ’’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఇక కొంతమంది అయితే.. ఎందుకు వచ్చాం అని బాధతో వెనుదిరిగారు. బిర్యానీ అయితే దొరికింది కానీ.. 200 రూపాయల ఫైనే బాగోలేదంటూ తెగ బాధపడిపోతూ వెళ్లిపోయారు. ఈ విషయం ఇంట్లో తెలిస్తే నా పరిస్థితి ఏంటి..? అని మరికొందరు ఉసూరుమంటూ వెళ్లారు.