- రోడ్లు వేయాలంటూ రసమయి బాలకిషన్, మహేశ్‌రెడ్డిని నిలదీసిన్రు
- గుండ్లపల్లిలో రసమయి కారును చుట్టుముట్టిన యువకులు
- లాఠీచార్జ్ చేసి అందరిని చెదరగొట్టిన పోలీసులు
- పరిగిలో ఎమ్మెల్యే ఇంటి ముందు స్థానికుల ధర్నా
- రోడ్డు వేసే పని నాది కాదు.. నేనొచ్చి రోడ్డు వేయాలా..?: మహేశ్ రెడ్డి
కరీంనగర్/గన్నేరువరం/ పరిగి, వెలుగు : అధికార పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలకు నిరసన సెగ తగిలింది. రోడ్లు వేయాలంటూ కరీంనగర్ జిల్లా మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కారును చుట్టుముట్టి యువకులు నిరసన తెలిపారు. వికారాబాద్ జిల్లా పరిగిలో ఎర్రగడ్డపల్లి, సుల్తాన్ నగర్ గ్రామాల రోడ్డు బాగు చేయాలంటూ ధర్నా చేసిన స్థానికులు.. ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి ఇంటికి వెళ్లి నిరసన తెలిపారు.
డబుల్ రోడ్డు వేయాలంటూ..
కరీంనగర్ జిల్లాలోని రాజీవ్ రహదారిపై గుండ్లపల్లి నుంచి గన్నేరువరం మీదుగా పొత్తూరు వరకు డబుల్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని యువజన సంఘాల ఆధ్వర్యంలో గుండ్లపల్లి రాజీవ్ రహదారిపై ఆదివారం మహా ధర్నా నిర్వహించారు. రోడ్డుకు అడ్డంగా కూర్చోవడంతో వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ ట్రాఫిక్‌లో స్థానిక మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కారు కూడా ఉంది. ధర్నా చేస్తున్న యువకులు.. రసమయి కారును గమనించి ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎమ్మెల్యే కారును చుట్టుముట్టారు. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు.. కారును ధర్నా జరుగుతున్న చోటు నుంచి తప్పించారు. కారు వెంట యువకులు పరిగెత్తగా.. పోలీసులు లాఠీచార్జ్ చేసి అందరిని చెదరగొట్టారు. ధర్నాకు సంఘీభావం తెలిపిన డీసీసీ ప్రెసిడెంట్ కవ్వంపల్లి సత్యనారాయణతోపాటు పలువురు యువకులను అరెస్టు చేసి తిమ్మాపూర్ మండలంలోని ఎల్ఎండీ స్టేషన్‌కు తరలించారు. ధర్నా తర్వాత ఎమ్మెల్యే రసమయి అక్కడికి వచ్చారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు కావాలనే రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. యువకులను రెచ్చగొట్టి కారుపై దాడి చేయించిన వారిపై చర్యలు తీసుకుంటానని అన్నారు.
పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత
రసమయిని అడ్డుకున్న ఘటనకు నిరసనగా ఎల్‌ఎండీ పోలీస్ స్టేషన్‌కు పెద్ద ఎత్తున టీఆర్ఎస్ నేతలు చేరుకున్నారు. స్టేషన్ లోపల ఉన్న కాంగ్రెస్, యువజన సంఘాల నేతల మీదకు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. అరెస్టు చేసిన వారిని వెంటనే పీటీసీకి పంపించారు. తర్వాత స్టేషన్‌కు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జి.వి.రామకృష్ణారావు చేరుకున్నారు. ధర్నా జరుగుతుందని సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే రసమయి ఆలస్యంగా అటువైపు వెళ్లారని, అయినా బీజేపీ, కాంగ్రెస్ లీడర్లు గూండాలుగా వ్యవహరించి దాడి చేయడం దుర్మార్గ చర్య అని వినోద్ కుమార్ మండిపడ్డారు. డీసీసీ ప్రెసిడెంట్ కవ్వంపల్లిని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఎన్టీఆర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ నాయకులు రాస్తారోకో చేపట్టారు. అరగంట పాటు రోడ్డును బ్లాక్ చేశారు. పోలీసులు వారిని చెదరగొట్టారు. ‘‘రోడ్లు, కల్వర్టుల మరమ్మతుల గురించి కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కవ్వంపల్లి ప్రశ్నిస్తే అక్రమంగా అరెస్టులు చేస్తారా. శాంతియుతంగా చేస్తున్న ధర్నాలో స్థానిక ఎమ్మెల్యే అధికార, అంగ బలంతో నిరసన కారులను అక్రమంగా అరెస్టు చేయించడం సిగ్గుచేటు” అని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు.
నిధులొచ్చినా పనులెందుకు చేస్తలే
పరిగి మున్సిపల్ పరిధిలోని ఎర్రగడ్డ పల్లి, సుల్తాన్ నగర్ గ్రామాలకు రోడ్డు బాగు చేయాలంటూ గ్రామస్తులు హైదరాబాద్ – బీజాపూర్ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో హైవేపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ఆందోళన విరమించాలని పోలీసులు కోరగా.. వారంతా ర్యాలీగా పరిగి ఎమ్మెల్యే నివాసానికి చేరుకున్నారు. గమనించిన ఎమ్మెల్యే మహేశ్ రెడ్డి ఇంట్లో నుంచి బయటికి వచ్చారు. ఎందుకు ఆందోళన చేస్తున్నారని ఆయన అడగ్గా.. ఎర్రగడ్డ పల్లి, సుల్తాన్ నగర్ గ్రామాలకు రోడ్డు సరిగా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వారు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సీరియస్ అయిన ఎమ్మెల్యే.. ‘రోడ్డు వేసే పని నాది కాదు’ అని అన్నారు. రోడ్డు వేసేందుకు నిధులు మంజూరై మూడు నెలలు గడుస్తునా పనులు ఎందుకు ప్రారంభించడం లేదని ఎమ్మెల్యేను గ్రామస్తులు నిలదీశారు. దీంతో ఆయన ‘నేనొచ్చి రోడ్డు వేయాలా?’ అంటూ వెటకారంగా మాట్లాడారు. ‘రోడ్డు బాగా లేకపోతే నేనేం చేయాలి’ అంటూ ఎదురు ప్రశ్నించారు. ఆయన మాటలతో కోపోద్రిక్తులైన గ్రామస్తులు.. వాగ్వాదానికి దిగారు. దీంతో ‘పదిహేను రోజుల్లో రోడ్డు పనులు ప్రారంభిస్తారు’ అని మహేశ్‌రెడ్డి హామీ ఇచ్చారు.