తెలంగాణ గడ్డపై దశాబ్దాల కాలం పాటు విప్లవోద్యమాలు, రైతాంగ సాయుధ పోరాటాలు, భూమి భుక్తి, పేదల హక్కుల కోసం ఉద్యమాలు జరిగాయి. ఆ క్రమంలో పోలీసుల బూటకపు ఎన్కౌంటర్లు, ప్రజాస్వామ్యంపై నిర్బంధం, అమాయక యువకులపై అక్రమ కేసులతో యువత జీవితాలు నాశనమయ్యాయి. తెలంగాణ స్వరాష్ట్రంలో కూడా కొందరు పోలీసుల తీరు వివాదాస్పదమవుతున్నది. చట్టాలను అతిక్రమించి పనిచేస్తున్న సందర్భాలు వెలుగులోకి వస్తున్నాయి. సూర్యాపేటలోని ఆత్మకూరు పోలీస్ స్టేషన్లో గిరిజనుడైన వీరశేఖర్ ను ఆసుపత్రి పాలయ్యేలా కొట్టడం, నల్లగొండ పట్టణంలో టూటౌన్ పోలీసులు రొయ్యల శ్రీనివాస్ అనే దళితుడిని చిత్రహింసలకు గురిచేయడం, మహబూబాబాద్ పట్టణంలో హెల్మెట్ ధరించలేదనే కారణంతో స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ వాహనదారుడిని ప్రజలు చూస్తుండగా కొట్టిన ఘటనలు అనేకం బయటకు వచ్చాయి. భారత రాజ్యాంగం ఆర్టికల్ 21 ద్వారా దేశంలో పౌరులందరికీ స్వేచ్ఛగా జీవించే హక్కును ప్రసాదించింది. క్రిమినల్ నేరాల్లో నిందితులను కోర్టులు దోషులుగా గుర్తించి శిక్ష విధించే వరకు సామాన్య మానవులకు ఏవిధంగా మానవ హక్కులు ఉన్నాయో, వారికి కూడా వర్తిస్తాయని తెలంగాణలో కొందరు పోలీసులు గుర్తించడం లేదు. కేంద్ర ప్రభుత్వం1973లో నూతనంగా తీసుకొచ్చిన కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్(సీఆర్పీసీ)లోని పలు సెక్షన్ల ప్రకారం నిందితులకు కొన్ని హక్కులు ఉన్నాయి. సీఆర్పీసీలోని సెక్షన్ 41, 41ఏ ప్రకారం సబ్ ఇన్స్పెక్టర్ లేదా ఇన్వెస్టిగేషన్ అధికారి నిందితులను అరెస్టు చేసే విచక్షణాధికారాన్ని కలిగి ఉన్నాడు. కానీ ఆ అధికారంతో ఇష్టానుసారంగా ప్రవర్తించడం చట్టవిరుద్ధం.
ఉమ్మడి రాష్ట్రంలో పలు కేసులు
ఉమ్మడి హైకోర్టు 2018లో ఎంఏ కాలిక్ వర్సెస్ అశోక్ కుమార్ మధ్య జరిగిన కేసులో నిందితుడు ఎం.ఏ కాలిక్ హైకోర్టులో కోర్టు ధిక్కరణ నేరం కింద ఆంధ్రప్రదేశ్‌లోని ఆకివీడు ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసుపై దావా వేశాడు. విచారణ అనంతరం హైకోర్టు 2020లో ఇన్స్పెక్టర్ కోర్టు ధిక్కరణ నేరానికి పాల్పడినట్లు గుర్తించి మూడు నెలల జైలు శిక్షతోపాటు అపరాధ రుసుం విధించింది. చివరికి కేసు సుప్రీంకోర్టు విచారించి శిక్షను తగ్గించి ఆకివీడు ఇన్స్పెక్టర్ను రెండు వారాలపాటు జైలుకు పంపింది. తెలంగాణ హైకోర్టు 2020లో రామడుగు ఓంకార్ వర్మ వర్సెస్ అశోక్ నాయక్ మధ్య జరిగిన కోర్టు ధిక్కరణ కేసులో సబ్ ఇన్స్పెక్టర్ అశోక్ నాయక్ కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లు గుర్తించి నాలుగు వారాల జైలు శిక్షతోపాటు అపరాధ రుసుము విధించింది. మరో కేసు 2022లో జక్కా వినోద్ కుమార్ రెడ్డి వర్సెస్ ఏ.ఆర్ శ్రీనివాస్ మధ్య జరిగిన కేసు తీర్పులో ఐపీఎస్ అధికారితో పాటు నలుగురు పోలీసు అధికారులపై కోర్టు ధిక్కరణ నేరం కింద నాలుగు వారాల జైలు శిక్షతోపాటు అపరాధ రుసుము పడింది. ఇదే హైకోర్టు 2022లో కె. రోహిత్ వర్సెస్ ఎం. విజయ కృష్ణ మూర్తి మధ్య జరిగిన కేసులో మాత్రం సబ్ ఇన్స్పెక్టర్ ఎం. విజయ కృష్ణ మూర్తి కోర్టు ధిక్కరణ నేరానికి పాల్పడినట్లు గుర్తించి ఎలాంటి శిక్ష విధించకుండా సబ్ ఇన్స్పెక్టర్ పై సరైన చర్యలు తీసుకోవాలని రాచకొండ కమిషనర్‌ను ఆదేశించింది. కోర్టులు బాధితుల పక్షాన నిలబడినప్పుడే న్యాయవ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతుంది.
నిబంధనలు పాటించకపోవడం ధిక్కరణే
పోలీసుల అధికార దుర్వినియోగానికి అడ్డుకట్టవేసి, మానవులు స్వేచ్ఛగా జీవించే రాజ్యాంగ హక్కును కాపాడాలనే తలంపుతో 2014లో సుప్రీంకోర్టు ధర్మాసనం ఆర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసు తీర్పులో నిందితులపై సీఆర్పీసీ సెక్షన్ 41, 41ఏ లను ఏవిధంగా ప్రయోగించాలనే నిబంధనలు పొందుపరిచి దేశవ్యాప్తంగా అమలు చేయాలని ఆదేశించింది. అందులో ముఖ్యంగా ఏడు సంవత్సరాల లోపు శిక్షలు విధించే అన్ని రకాల నేరాల్లో నిందితులను ఉన్నట్లుండి అరెస్టు చేయరాదు. నిందితులకు ముందుగా నేరానికి సంబంధించిన వివరణ కోరుతూ 41ఏ నోటీసు ఇచ్చి వివరణపై సంతృప్తి చెందనిచో చట్టంలోని నిబంధనల ప్రకారం అరెస్టు చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాల్సి ఉంటుంది. పోలీసు అధికారి నిబంధనలు పాటించకపోతే సంబంధిత రాష్ట్రాల్లోని హైకోర్టులో సంబంధిత అధికారులపై కోర్టు ధిక్కరణ నేరం కింద కేసును నమోదు చేసి, కోర్టు ధిక్కరణకు పాల్పడిన అధికారులపై శాఖాపరమైన చర్యతోపాటు కోర్టు ధిక్కరణ నేరం కింద ఆరు నెలలకు మించకుండా జైలు శిక్ష లేదా అపరాధ రుసుం లేదా రెండూ విధించాలని హైకోర్టులను ఆదేశించింది. సంబంధిత కేసుల్లో కింది స్థాయి కోర్టులోని న్యాయమూర్తులు నిందితులను రిమాండు చేసి జైలుకు పంపేముందు పోలీస్ అధికారులు చట్టబద్ధంగా, సుప్రీంకోర్టు నిబంధనలను పాటించారా లేదా అనే విషయాలను జాగ్రత్తగా చూసిన తర్వాతే నిందితులను జైలుకు పంపాలని ఆదేశించింది. లేదంటే బాధ్యులైన న్యాయమూర్తులపై కూడా చర్యలు తీసుకోవాలని హైకోర్టులను ఆదేశించింది.
- కోడెపాక కుమార స్వామి, సామాజిక కార్యకర్త