-
50 కోట్లు ఇచ్చినందుకే శరత్ కు బెయిల్
-
ముడిపై వ్యాఖ్యలను నిరూపిస్తే సజీవ దహనానికి సిద్ధం
-
ఐదేళ్లు కాంగ్రెస్‌దే అధికారం: మంత్రి పొన్నం ప్రభాకర్
కరీంనగర్: ఎన్నికల్లో రాముని ఫోటోతో కాకుండ మోదీ ఫోటోతో ఓట్లు అడగాలని బీజేపీ నేతలకు మంత్రి పొన్నం ప్రభాకర్ సవాల్‌విసిరారు. ఇవాళ (ఏప్రిల్ 19) కరీంనగర్ లో ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజ్ లో మార్నింగ్ వాకర్స్‌ని కలిసి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీజేపీకి యాభై కోట్లు ఇచ్చినందుకే లిక్కర్ స్కాంలో అరెస్టయిన అరబిందో డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డికి బెయిల్ మంజూరైందని విమర్శించారు. ఐదేళ్లలో బీజేపీ, బీఆర్ఎస్ ఎంపీలు ఏమి చేశారో చెప్పాలని ప్రశ్నించారు. మెజారిటీ సీట్లలో తమదే గెలుపు అని ధీమా వ్యక్తం చేశారు. బాండ్ల విషయంలో బీజేపీ సమర్ధించుకుంటున్న తీరు గర్హనీయమన్నారు. అవినీతి డబ్బు పార్టీలకు వస్తే అది నీతివంతంగా మారిపోతుందా అని ప్రశ్నించారు. కరీంనగర్‌లో కాంగ్రెస్ గెలుపు ఖాయమన్నారు.
తెలంగాణ ప్రయోజనాలకు బీజేపీ సహకరించలేదన్నారు. తెలంగాణకు బీజేపీ ఏం ఇచ్చిందో చెప్పాలని మంత్రి పొన్నం ప్రశ్నించారు. ప్రసాదం స్కీం కింద వేములవాడ, కొండగట్టుకు ఒక్క రూపాయి అయినా తీసుకు వచ్చారా అని తెలంగాణ బీజేపీ ఎంపీలను నిలదీశారు. రాముడి పేరుతో బీజేపీ నేతలు రాజకీయం చేస్తున్నారని పొన్నం మండిపడ్డారు. రాముడిపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. ఒకవేళ తాను రాముడి గురించి తప్పుగా ఏమైనా మాట్లాడినట్టు బీజేపీ ఎంపీ బండి సంజయ్ నిరూపిస్తే తాను సజీవ దహనానికి సైతం సిద్ధమన్నారు. తాము రాముడిని ఆరాధిస్తాం కానీ రాజకీయాలు చేయబోమని తెలిపారు.
తెలంగాణలో ఐదేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం సుస్థిరంగా ఉంటుందని పొన్నం వ్యాఖ్యానించారు. కేసీఆర్ మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారన్నారు. ట్యాపింగ్ పై కేటీఆర్ రోజుకో మాట మాట్లాడుతున్నారని పొన్నం ఫైర్ అయ్యారు. ఫోన్ ట్యాపింగ్ పై విచారణ సాగుతుందన్నారు. హరీశ్ రావు ఏమి మాట్లాడుతున్నారో ఆయనకే తెలియడం లేదని మండిపడ్డారు.