తెలంగాణలో.. కొత్త పార్టీల సత్తా ఎంత?

మనం నేషనల్​ హైవేపై ప్రయాణిస్తున్నప్పుడు మనకు చాలా రెస్టారెంట్లు కనిపిస్తాయి. వీటిలో కొన్ని పాతవి ఉంటాయి. కొన్ని కొత్త రెస్టారెంట్లు సడెన్​గా ఓపెన్​ అవుతాయి. కొద్ది నెలల తర్వాత మళ్లీ మనం అదే హైవేపై వెళుతుంటే వీటిలో చాలా వరకూ కనుమరుగు అయిపోతుంటాయి. ఎందుకంటే మార్పు అన్నది శాశ్వతం. ప్రస్తుతం, తెలంగాణలో చాలా రాజకీయ పార్టీలు ఎప్పటి నుంచో వేళ్లూనుకుని ఉన్నాయి. ఇప్పుడు కొన్ని సెక్షన్లకు ప్రాతినిధ్యం వహిస్తామంటూ కొత్త పార్టీలు పుట్టుకొస్తున్నాయి. అయితే చాలా వరకూ కొత్త పార్టీలు ఇలా వచ్చి అలా కనుమరుగైపోతుంటాయి. మాజీ ఐపీఎస్​ అధికారి ఆర్ఎస్​ ప్రవీణ్​కుమార్.. నిస్తేజంగా ఉన్న బీఎస్పీలో చేరడం ద్వారా అసాధారణంగా ఏమీ చేయలేదు. కానీ, ప్రవీణ్​ అనూహ్యమైనది ఒకటి చేశారు. పదవుల కోసం ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీల నుంచి ఆఫర్లు వచ్చినా వాటిని తీసుకోలేదు. కఠినమైన మార్గంలోనే నడవాలని నిర్ణయించుకున్నారు. తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీల ఏర్పాటును చూస్తుంటే వారంతా టీఆర్ఎస్​ ప్రభుత్వం బలహీనంగా ఉందని భావిస్తున్నట్లు కనిపిస్తోంది.

తెలంగాణ రాజకీయాలు 1956 నుంచి 2014 వరకూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​తో ముడిపడి ఉన్నాయి. పెద్ద లీడర్లు, కులాల గ్రూపులు పెద్ద రాష్ట్రాలకు సరిపోతాయి. కొత్తగా ఏర్పాటైన తెలంగాణలో ఈ గ్రూపులు తమ వంతు పాత్ర పోషించాలని భావిస్తున్నాయి. అయితే చిన్న రాష్ట్రమైన తెలంగాణలో 119 ఎమ్మెల్యే సీట్లు మాత్రమే ఉన్నాయి. కేరళలో దాదాపు తెలంగాణలో ఉన్నంత జనాభానే ఉంది. అక్కడ సుమారు 30 రాజకీయ పార్టీలు యాక్టివ్​గా ఉన్నాయి. ప్రస్తుతం తెలంగాణలో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, తెలుగుదేశం, ఎంఐఎం, రెండు లెఫ్ట్​ పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా రెండు పార్టీలు వచ్చాయి. అందులో ఒకటి షర్మిల వైఎస్సార్​ తెలంగాణ పార్టీ, ఇంకొకటి ఆర్ఎస్​ ప్రవీణ్​కుమార్​ బీఎస్పీ పార్టీ. షర్మిల పార్టీ ఏర్పాటు గురించి ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఇక రాష్ట్రంలో బీఎస్పీ ఎప్పటి నుంచో ఉన్నా దాని ఉనికి చాలా పరిమితం. అయితే ఇప్పుడు ఈ రెండు పార్టీలు బిగ్​ బ్యాంగ్​ తరహాలో ఎంట్రీ ఇచ్చాయి. ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి, మరిన్ని పొలిటికల్​ పార్టీలు ఏర్పాటయ్యే అవకాశాలు లేకపోలేదు. ఎక్కువ కొత్త పార్టీలు ఏర్పాటైనప్పుడు పెద్ద సామాజిక వర్గాలు, రాజకీయ పార్టీల పవర్​పై ప్రభావం పడుతుంది. కొత్త రాజకీయ పార్టీ అప్పటి వరకూ ఉన్న పార్టీలు ప్రభావం చూపిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. 
వివిధ పార్టీలపై ఇంపాక్ట్​ ఎలా ఉంటది
ఒవైసీకి చెందిన ఎంఐఎం పార్టీ తెలంగాణలో గొప్ప హోదాను పొందుతోంది. కచ్చితంగా గెలిచే ఏడుగురు ఎమ్మెల్యేలతో తాను ఎంత ముఖ్యమో ఒవైసీ స్పష్టం చేస్తూనే ఉన్నారు. అయితే కొత్త పార్టీలు ఏర్పాటైతే, ఎంఐఎం తన ప్రాముఖ్యతను కోల్పోతుంది. ఒకవేళ కొత్త పార్టీలు కొన్ని ఎమ్మెల్యే సీట్లు గెలిచినా, అప్పుడు ఎంఐఎం అవసరం లేకుండా పోతుంది. అందువల్ల కొన్ని కొత్త పార్టీలతో ఎంఐఎం పొత్తు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. కాంగ్రెస్​ పార్టీ తనకు తాను పునరుత్తేజం తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్​లోని మొత్తం సంప్రదాయ నాయకత్వం అంతా ఇప్పుడు టీఆర్​ఎస్ లో, మరికొంత బీజేపీలో చేరిపోయింది. కొత్త పార్టీల రాకతో కాంగ్రెస్​పై ప్రతికూల ప్రభావం పడుతుంది. కొన్ని కొత్త పార్టీలతో కాంగ్రెస్​ పొత్తు పెట్టుకునే అవకాశం ఉంది. బీజేపీ రాష్ట్రంలో బలపడేందుకు ప్రయత్నిస్తోంది. 2019 లోక్​సభ ఎన్నికల్లో ఆ పార్టీ ఎవరూ ఊహించని స్థాయిలో 4 ఎంపీ సీట్లు సాధించింది. రెడ్డి, వెలమ దొరలు బీజేపీతో పాటు అన్ని పార్టీలకూ విస్తరించారు. అయితే మనకు కనిపించేది ఏమిటంటే బీసీలు, ఎస్సీ, ఎస్టీలు బీజేపీలో సులభంగా ప్రవేశం పొందగలుగుతున్నారు. అధికారంలో లేకపోవడం వల్ల బీజేపీకి ఎక్కువ స్పేస్​ ఉన్నందున ఎక్కువ మందికి లీడర్​షిప్​ పొజిషన్లు దక్కుతాయి. ఓటర్లలో గందరగోళం ఏర్పడటం వల్ల బీజేపీ కూడా కొత్త పార్టీలతో ప్రభావితమవుతుంది. టీఆర్ఎస్​ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది. కానీ ఉప ఎన్నికలను ఎదుర్కోవడానికి తీవ్రంగా భయాందోళనలకు గురవుతోంది. తెలంగాణలో 2023 డిసెంబర్​లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. టీఆర్ఎస్​లో కనిపిస్తున్న ఆందోళనను చూస్తుంటే.. దానికంటే ముందే ఎన్నికలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. టీఆర్ఎస్​లో అత్యంత అనుభవం కలిగిన సంప్రదాయ లీడర్లు ఉన్నారు. అయితే ఈ గొప్ప పొలిటికల్​ టాలెంట్​ను వాడుకోవడానికి టీఆర్ఎస్ సిద్ధంగా ఉన్నట్టు కనిపించడం లేదు. యాక్టివ్​గా లేకుండా పక్కన ఉన్న కనీసం 20 మంది టీఆర్ఎస్ లీడర్ల పేర్లు చెప్పమంటే ఎవరైనా చెప్పేస్తారు. కొత్త పార్టీలు ప్రభుత్వంపై దాడి చేస్తుండటంతో అవి టీఆర్ఎస్ పైనా ప్రభావం చూపిస్తాయి. భయం, ఉచిత పథకాలు కొత్త పార్టీలను మరింత దూకుడుగా మారుస్తాయి.
కొత్త పార్టీల సమస్య ఏమిటంటే..
తెలంగాణలో చాలా కొత్త పార్టీలకు అవకాశం ఉంది. కేరళనే తీసుకుంటే అక్కడ 30 పార్టీలు ఉన్నాయి. తెలంగాణలో ఎక్కువ పార్టీలు ఎందుకు ఉండకూడదు? అందువల్ల తెంగాణ విభిన్నమైన దారిని ఎంచుకోవాలి. హైవేలపై రెస్టారెంట్ల మాదిరిగా, కొన్ని పార్టీలు ఎప్పటికీ కొనసాగుతుంటాయి.. కొన్ని సడెన్​గా మూతపడుతుంటాయి. కొత్త పార్టీలకు వచ్చిన సమస్య ఏమిటంటే అవి ఎక్కువగా కులం లేదా కొన్ని సెక్షన్లపై ఆధారపడటం. ఆ సెక్షన్లు, కులాలు ప్రస్తుతం వారు ఉన్న పొలిటికల్​ పార్టీలను విడిచి వచ్చే అవకాశాలు తక్కువ. కొత్త పార్టీలు కచ్చితంగా గెలుస్తాయని అనుకుంటేనే వారు అటువైపు వస్తారు. దళిత్ లేదా రెడ్డి లీడర్లు ఇప్పటికిప్పుడు టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్​ పార్టీలను వదిలి కొత్త పార్టీలో చేరాల్సిన అవసరం ఏముంది? ఒకవేళ టీఆర్ఎస్ నమ్మకంగా ఉంటే కొత్త పార్టీలకు కళ్లెం పడుతుంది. అలాకాక టీఆర్ఎస్ భయాందోళనలో ఉంటే అప్పుడు కొత్త పార్టీలు దూకుడు చూపిస్తాయి. లీడర్లు కూడా పార్టీని విడిచి బయటకు వెళ్లిపోతామని బెదిరిస్తారు. తెలంగాణ వంటి చిన్న రాష్ట్రాలు ఆవేశపూరిత రాజకీయాలు, విభజనలను కలిగి ఉంటాయి. వాస్తవానికి, ఎన్నికల్లో ఎక్కువ పార్టీలు పోటీ చేస్తే టీఆర్ఎస్ అధికారంలో ఉన్నందున అది లాభం పొందుతుందని కొందరు చెప్పవచ్చు. ఎటువంటి డబ్బు ఆశ చూపకుండా ఒక కొత్త పార్టీ 5–10% ఓట్లను ఆకర్షించగలిగితే అప్పటికే ఉన్న పార్టీలు భయపడతాయి. 10% ఓటర్లు ప్రలోభాల ద్వారా ఆకర్షించబడకపోతే, మీరు ఎంత మంది ఓటర్లను ప్రలోభపెడతారనేది అసలు ముఖ్యమే కాదు. రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు.

అభ్యర్థుల కొరత అనేది ఉండదు
హైదరాబాద్​ చుట్టుపక్కల భూములు ఉన్న చాలా మంది వ్యక్తులు రాజకీయాలపై ఆసక్తిగా ఉన్నారు. ఎందుకంటే రాజకీయాలు తమకు గౌరవాన్ని తీసుకొస్తాయని వారు భావిస్తున్నారు. గౌరవం కోసం ఎంత మొత్తమైనా ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్న వారు వేలల్లో ఉన్నారు. ప్రస్తుతం భూముల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అందువల్ల అన్ని వనరులు ఉన్న క్యాండిడేట్ల కోసం ఏ పార్టీకి కరువు లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో ఒకానొక టైంలో లిక్కర్​ కాంట్రాక్టర్లు రాజకీయాల్లోకి ఎంటర్​ అయ్యారు. ఆ తర్వాత రియల్​ ఎస్టేట్ వాళ్లు, ఇసుక కాంట్రాక్టర్లు, ఎడ్యుకేషన్​ టైకూన్లు.. కొన్నాళ్లు ఎన్నారైలు కూడా డబ్బులు పట్టుకుని రాజకీయాల్లోకి వచ్చారు. పెద్ద ఆఫీసర్ల భార్యలు కూడా చాలా ఎన్నికల్లో పోటీ చేయడం మనకు తెలుసు. ఎందుకంటే ఫార్మూలా చాలా సింపుల్. మనీ=పాలిటిక్స్=రెస్పెక్ట్. అందువల్ల కొత్త పార్టీలు వచ్చినా వాటికి అభ్యర్థుల కొరత అనేది ఉండదు. అయితే కొత్త పార్టీలు తమ ఓటు బ్యాంకును జనానికి చూపించుకోవాల్సి ఉంటుంది.                                                                                 - పెంటపాటి పుల్లారావు, పొలిటికల్​ ఎనలిస్ట్