- వాడీవేడిగా ఆసిఫాబాద్ జడ్పీ మీటింగ్
- అడవులను దోచుకుంటున్నది మీరేనన్న సభ్యులు
- ఇసుక మాఫియాకు అడ్డుకట్ట వేయలేదని ఆరోపణ
- రోడ్డు పనులు కంప్లీట్ కాక జనాలు మమ్మల్ని తిడుతున్నరు
- ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, పాల్వాయి హరీశ్ బాబు ఫైర్
- డీఎఫ్ఓ, ఎఫ్డీఓల సరెండర్‌కు తీర్మానం
ఆసిఫాబాద్, వెలుగు : అధికారుల తీరుపై సభ్యులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజల ఆస్తులు కాపాడాల్సిన అధికారులే దోచుకుంటున్నారని.. ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నా, ఇసుక మాఫియా రెచ్చిపోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యారు. ఆసిఫాబాద్కలెక్టరేట్ సమావేశ మందిరంలో జడ్పీ చైర్మన్ కోనేరు కృష్ణా రావు అధ్యక్షతన శనివారం నిర్వహించిన జడ్పీ సర్వసభ్య సమావేశానికి కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే, ఆసిఫాబాద్, సిర్పూర్ ఎమ్మెల్యేలు కోవలక్ష్మి, పాల్వాయి హరీశ్ బాబు, జడ్పీటీసీలు
ఎంపీపీలు, జిల్లా అధికారులు హాజరయ్యారు. కాగా ఈ మీటింగ్ హాట్ హాట్ గా సాగింది. రోడ్లు భవనాల శాఖ, పంచాయతీరాజ్ శాఖ, గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రహదారి, భవనాల పనులు నత్తనడకన సాగుతున్నాయని, అన్ని అనుమతులు మంజూరైనా కాంట్రాక్టర్లు పనులు ప్రారంభించడంలేదని, కొన్ని మధ్యలోనే ఆపేయడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అర్అండ్బీ ఈఈ పెద్దన్నపై సభ్యులు మండిపడ్డారు. ఒంటిమామిడి, బుగ్గగుడా రోడ్డుకు ఫారెస్ట్ పర్మిషన్ వచ్చినా పనులు ఎందుకు ప్రారంభించలేదని నిలదీశారు.
ఆసిఫాబాద్ నుంచి కెరమెరి రోడ్డుకు టెండర్లు పూర్తయినా పనులు ప్రారంభించడం లేదని, గ్రామాల్లోకి వెళ్తే ప్రజలు మమ్మల్ని తిడితున్నారని ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, హరీశ్ బాబు మండిపడ్డారు. జిల్లా వెనకబడడానికి అధికారులే కారణమన్నారు. రోడ్డు పనులు పూర్తిచేయని కాంట్రాక్టర్ ను బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలని కలెక్టర్‌ను కోరారు.
విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలి
వానాకాలం సాగు కోసం రైతులకు సరిపడా పత్తి విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలని, నకిలీ విత్తనాలను డీలర్లు అమ్మకుండా వ్యవసాయ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని సభ్యులు కోరారు. జిల్లా ఆస్పత్రిలో ప్రసవాలు జరిగేలా, రోగులకు తక్షణ వైద్యం అందేలా చూడాలని వైద్యాధికారులను కోరారు. జిల్లాలో ఇసుక అక్రమ రవాణా విచ్చలవిడిగా సాగుతున్నా మైనింగ్ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని
ఫోన్ ద్వారా ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని సభ్యులు నిలదీశారు. పోడు భూముల్లో వ్యవసాయ పనులను ట్రాక్టర్లతో చేపడితే అటవీశాఖ అధికారులు అడ్డుకుంటున్నారని, సాగుచేయనీయడం లేదని సభ్యులు నిలదీశారు. డీఎఫ్ఓ, ఎఫ్డీవోలను సరెండర్ చేయాలని సభ్యులు తీర్మానించారు.
సమస్యల పరిష్కారానికి కృషి : కలెక్టర్
జిల్లాలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే తెలిపారు. మిషన్ భగీరథ పథకం ద్వారా తాగునీరు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. చిన్నచిన్న రిపేర్లు చేపట్టి సమస్యలు పరిష్కరిస్తామన్నారు. సభ దృష్టికి సభ్యులు తీసుకొచ్చిన సమస్యలు అన్నింటినీ పరిష్కరిస్తామని చెప్పారు. జిల్లా అభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో కలిసికట్టుగా పనిచేయాలని జడ్పీ చైర్మన్ కోనేరు కృష్ణారావు కోరారు. జిల్లాలో అసంపూర్తిగా ఉన్న రోడ్లు, వంతెన పనులు సత్వరమే పూర్తి చేయాలన్నారు.
మీరే పెద్ద స్మగ్లర్లు, దొంగలు : ఎమ్మెల్యే కోవ లక్ష్మి
‘‘మీరే అసలు స్మగ్లర్లు, దొంగలు. మీ బిడ్డలు రోడ్డు, బ్రిడ్జిలు లేని ఆదివాసీ గిరిజన గ్రామాల్లో ప్రసవ వేదన పడితే మీకు కష్టం తెలిసేది. అడవులను నమ్ముకొని బతుకుతున్న ఆదివాసీ గూడేలకు రోడ్లు వేసేందుకు, తాగు నీరు కోసం బోర్లు వేసేందుకు అనుమతి ఇవ్వకుండా అడ్డుకుంటున్నరు ఇదేం పద్ధతి’’ అంటూ ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఫారెస్ట్ అఫీసర్లపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తన పరిధిలోని గ్రామాలకు రోడ్డు, బ్రిడ్జిలకు అనుమతులు ఇవ్వకుండా జాప్యం చేయడంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఫారెస్ట్ ఆఫీసర్ నీరజ్ కుమార్‌కు బదులు కాగజ్ నగర్ ఇన్చార్జ్ ఎఫ్‌డీవో హాజరవడంపై అసహనం వ్యక్తం చేశారు. సమావేశానికి డీఎఫ్‌వో రాకపోతే సమస్యలు ఎవరికి చెప్పుకోవాలని ప్రశ్నించారు. అధికారులు అడవులను పూర్తిగా అమ్ముకుంటున్నారని, గిరిజనులకు అన్యాయం చేస్తుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. పల్లెలకు కనెక్టివిటీ కోసం సెల్ టవర్ నిర్మాణాలను కూడా అడ్డుకుంటున్నారని ఫైర్ అయ్యారు. ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయని
పూర్తిచేయకుండా కాలయాపన చేస్తున్నారని ఆర్అండ్ బీ, ఇరిగేషన్ అధికారుల పనితీరుపైనా ఆమె మండిపడ్డారు. అధికారుల తీరుతో గ్రామాల్లో పర్యటిస్తే జనాలు తమను తిడుతున్నారని ఆవేదన చెందారు. ఇసుక మాఫియా రెచ్చిపోతున్నా అధికారులు చోద్యం చూస్తున్నారని.. ఆసిఫాబాద్, రెబ్బెన నుంచి వందలాది లారీలు అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు.
వడ్ల కొనుగోళ్లలో కోతపెడితే కలెక్టరేట్‌ను ముట్టడిస్తం : హరీశ్ బాబు
వడ్ల కొనుగోళ్లలో కోతపెడితే రైతులతోకలిసి కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని ఎమ్మెల్యే హరీశ్ బాబు హెచ్చరించారు. రబీ ధాన్యం సేకరణ లక్ష్యం 48 వేల మెట్రిక్ టన్నులు కాగా, ఇప్పటి వరకు 2,200 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే సేకరించారని, మిగతా ధాన్యాన్ని ఎప్పుడు సేకరిస్తారని నిలదీశారు. వడ్ల కొనుగోలులో కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు.
వడ్ల కొనుగోలులో రైతుల కడుపు కొట్టి దళారులకు దోచిపెడుతున్నారని అధికారులపై విరుచుకుపడ్డారు. మెడికల్ కాలేజీ పనులు నత్తనడకన సాగుతున్నాయని వెంటనే కంప్లీట్ చేయాలన్నారు. కాగజ్ నగర్ లో 288 డబుల్ బెడ్రూంల పనులు 90 శాతం కంప్లీట్ అయ్యాయని, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తయినప్పటికీ.. ఇంకా టాయిలెట్ పనులు పూర్తిచేయకపోవడంపై నిలదీశారు.