పెళ్లి విషయంలో పిల్లల ఇష్టాలకు విలువ ఇయ్యాలె

ఇష్టం లేని పెళ్లిళ్ల తాలూకు ఫలితాలు ఇటీవలి ఘటనల్లో బయటపడ్డాయి.  సర్​ప్రైజ్​గిఫ్ట్ ఇస్తానని కాబోయే భర్తపై దాడి చేసిన యువతి,​ పెళ్లైన నెల రోజుల్లోనే ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. పెళ్లి ఇష్టం లేక ఆత్మహత్యకు పాల్పడిన యువతి.. ఇలా ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి. నిండు నూరేళ్ల జీవితాన్ని అర్ధంతరంగానే ముగిస్తూ... పిల్లలు కన్నవారికి తీరని శోకం మిగులుస్తున్నారు. మారుతున్న పరిస్థితులను బట్టి తల్లిదండ్రుల పెంపకం, ఆలోచనల్లోనూ మార్పు రావాలి. పిల్లల ఇష్టాలకు విలువ ఇవ్వడంతోపాటు, వారి ఎంపికను పరిశీలించి సరైనదైతే మద్దతు ఇవ్వాలి.

పెళ్లి ఇద్దరు వ్యక్తుల జీవితం. వారు ప్రతి విషయంలోనూ.. ఒకరికొకరు తోడుగా నీడగా ఉంటూ జీవితాంతం కష్ట సుఖాలను అనుభవిస్తూ బతకాల్సి ఉంటుంది. ఎంత మంచి దంపతులైనా అప్పుడప్పుడు ఇద్దరి మధ్య వాదనలు, గొడవలు, తగాదాలు జరగడం సహజం. అయితే... ఇష్టం లేకుండా పెళ్లి బంధంలోకి అడుగుపెడితే జీవితం ఎలా ఉంటుందో ఊహించుకోలేం. ఒకరంటే మరొకరికి కనీసం ఇష్టం, అవగాహన కూడా లేకపోతే.. వారి దాంపత్య జీవితం చాలా నిస్తేజంగా ఉంటుంది. ఒకప్పుడు పెద్దలు కుదిర్చిన పెండ్లిళ్లు విజయవంతమయ్యేవి. ఇప్పుడు అలా లేదు. సమాజం మారుతోంది. ఆధునిక జీవన శైలి, ఆలోచనల్లో మార్పు, నచ్చినవాణ్ని కోరుకునే స్వేచ్ఛ కావాలని పిల్లలు కోరుకుంటున్నారు. 

ఇటీవలి ఘటనలు కొన్ని..

ఇష్టంలేని పెళ్లి చేశారని మెట్టినింట ఉండలేనని భర్తకు చెప్పిన ఓ యువతి స్నేహితుడి బర్త్​డే పార్టీలో భర్తకు విష మాత్రలు, ఇంజక్షన్ ఇచ్చి చంపేసింది. తనకు పెళ్లి ఇష్టం లేని ఓ యువతి సర్​ప్రైజ్ గిఫ్ట్ ఇస్తానని చెప్పి కాబోయే వరుడిపై దాడి చేసిన ఘటన సంచలనం సృష్టించింది. పెళ్లి ఇష్టం లేని వధువులు కాబోయే వాడినో, భర్తనో లేదంటే తనను తానే చంపుకుంటున్న ఘటనలు ఈ మధ్య ఎక్కువగా జరిగాయి. 

మార్పును గమనించాల్సిందే..

ఆధునిక సమాజంలో పితృస్వామ్య వైఖరిలో మార్పు రావాల్సిన అవసరం ఉంది. మగపిల్లలు బయట, ఆడపిల్లలు ఇంటిపనులు చేయడానికే పుట్టారనే భావన అనాదిగా తల్లిదండ్రుల్లో నిలిచిపోయింది. అది మారాలె. గతంలో పెళ్లిళ్ల విషయంలో అమ్మాయిలు తల్లిదండ్రుల మాట జవదాటే వారు కాదు. అప్పట్లో ఆర్థిక స్వేచ్ఛ, చదువులు, ఉద్యోగాలు ఉండేవి కాదు. గతానికి పూర్తి విరుద్ధంగా నేటి అమ్మాయిల పరిస్థితి ఉంది. అబ్బాయిలకు ఏ మాత్రం తీసిపోని విధంగా చదువుల్లో, ఉద్యోగాల్లో, ఆర్థికంగా సమానంగా పోటీ పడుతున్నారు. తమ కాళ్ల మీద తాము నిలబడాలని, తమ జీవితాన్ని నిర్ణయించుకునే హక్కు, స్వేచ్ఛ తమకే ఉండాలని ధైర్యంగా చెబుతున్నారు. అందుకోసం రిస్క్ తీసుకోవడానికి కూడా ఏమాత్రం వెనుకంజ వేయడం లేదు. 

పిల్లల పెంపకంలోనూ..

గతంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ వల్ల పిల్లల పెంపకంలో తల్లిదండ్రులతో పాటు నానమ్మ, తాతయ్య, మేనత్త, చిన్నాన్న, పెద్దనాన్న, చిన్నమ్మ, పెద్దమ్మ తదితరుల పాత్ర  ఉండేది. కానీ ఇప్పుడు ఆ కుటుంబ వ్యవస్థ లేదు. పిల్లలు కొన్నిసార్లు తమ తల్లిదండ్రుల ప్రేమకు, అనురాగానికి కూడా నోచుకోలేని పరిస్థితి ఉంది. వయసు పెరిగే కొద్దీ ప్రేమ కోసం తపిస్తూ.. పరిచయమైన స్నేహితుల సాన్నిహిత్యంతో ప్రేమ పక్షులుగా మారిపోయి విడదీయలేని బంధంగా చుట్టుకొని, వాళ్ల నుంచి దూరం కాలేక, తల్లిదండ్రులు చూసే సంబంధాలను ఒప్పుకోలేక తనువు చాలిస్తూ కడుపుకోత మిగులుస్తున్నారు. 

వ్యక్తిగత ఎంపికకు..

పిల్లల ఇష్టాలకు విలువ ఇవ్వకుండా పరువు కోసం తల్లితండ్రులు తొందరపడి సంబంధాలు ఓకే చేయడం సరికాదు. వారి వ్యక్తిగత స్వేచ్ఛ, నిర్ణయాలకు కచ్చితంగా విలువ ఇవ్వాల్సిందే. పిల్లల వ్యక్తిగత ఎంపికకు మద్దతు ఇవ్వాలి. ఇతరుల ఒత్తడి లేదా ప్రమేయం లేకుండా వధూవరులకు ఇష్టమైతేనే పెండ్లి చేయాలి. అప్పుడే ఇలాంటి దారుణ ఘటనలు జరగకుండా ఉంటాయి. పరిస్థితులు మారినప్పుడు మనమూ మారాల్సిందే. 
- డాక్టర్. బి. కేశవులు, ఎండీ, న్యూరో సైకియాట్రీ