మన నేవీ మరింత షార్ప్​!

మన దేశ సెక్యూరిటీ మరింత బలోపేతం కానుంది. ముఖ్యంగా నేవీ ఇంకా షార్ప్​గా తయారవనుంది. దీనికి కావాల్సిన లేటెస్ట్​ వెర్షన్​ గన్ను​లు అమ్మడానికి అమెరికా అంగీకరించింది. ఆ దేశం నుంచి ఈ వెపన్స్​ కొనే ఛాన్స్​ వచ్చిన కొద్ది దేశాల్లో ఇండియా ఒకటి కానుంది. ఒక బిలియన్​ డాలర్ల (రూ.7100 కోట్ల) విలువ చేసే ఈ డీల్​కి అమెరికా చట్టసభ ఆమోద ముద్ర వేయాల్సి ఉంది. ఈ ఒప్పందం ఇండియా–యూఎస్​ సంబంధాల్లో సరికొత్త చాప్టర్​కి తెర తీస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఏడాదిన్నర కాలంగా ఇండియా, అమెరికా మధ్య ఏర్పడ్డ బిజినెస్​ విభేదాలు క్రమంగా తొలగిపోతున్నాయి. ప్రధాని మోదీ రెండు నెలల కిందట ఆ దేశంలో వారం పాటు జరిపిన టూర్​ సక్సెసయ్యిందనే టాక్​ వినిపిస్తోంది. యూఎస్​లోని హ్యూస్టన్ సిటీ​లో సక్సెస్​ఫుల్​గా చేపట్టిన ‘హౌడీ మోడీ’ ఈవెంట్​ ఫలితాలు మెల్లగా కనిపిస్తున్నాయి. మన నేవీకి అవసరమైన మోడ్రన్​ వెపన్స్​ని ఇచ్చేందుకు ఆ దేశం ఒప్పుకుంది. మోడిఫైడ్​–4 నావల్​ గన్నులను ఇండియాకి అమ్మాలనుకున్న విషయాన్ని ట్రంప్​ ప్రభుత్వం ఆ దేశ చట్టసభకు చెప్పింది.

ఇప్పుడు, ముందు ముందు శత్రు దేశాల నుంచి ఎదురయ్యే ప్రమాదాల దృష్ట్యా మన దేశం ఈ ఆయుధాల్ని కొంటోంది. పొరుగు దేశాల్లో ప్రధానంగా పాకిస్థాన్​, చైనా మనతో ఎప్పుడూ కయ్యానికి కాలుదువ్వుతుండటం తెలిసిందే. ఈమధ్య నేపాల్​ కూడా ఆ లిస్టులో చేరుతోంది. కాలాపానీ ఏరియా విషయమై కటువుగానే స్పందించింది. ముఖ్యంగా అరేబియా సముద్రంలో ఆధిపత్యం కోసం ఆరాటపడుతున్న దేశాలు ఇండియాకి థ్రెట్​గా మారకుండా ఉండాలంటే నేవీ బలం పెంచటం ఎంతైనా అవసరం.

కంటికి కనిపించకుండానే ఖతం చేయొచ్చు

ఇండియా అంటే పడని ఆసియాలోని మరికొన్ని ప్రాంతీయ దేశాలు వార్​షిప్​లతో, యాంటీ ఎయిర్​క్రాఫ్ట్​లతో, బాంబు పేలుళ్లలతో ఎటాక్​ చేయొచ్చనే హెచ్చరికల్ని వింటూనే ఉన్నాం. వాటికి చెక్​ పెట్టాలంటే మనం ‘5 ఇంచ్​/62 కేలిబర్​ కెపాసిటీ గల ఎంకే–45 (మోడిఫైడ్​–4) నావల్ గన్నులు’ తెప్పించుకోవాలని డిఫెన్స్​ వర్గాలు కేంద్రానికి ఎప్పటి నుంచో సూచిస్తున్నారు. దీంతో ఒక బిలియన్​ డాలర్లు ఖర్చయ్యే 13 లేటెస్ట్​ నావల్​ గన్నుల కొనుగోలుకు మోడీ సర్కారు చర్యలు తీసుకుంది.

ఎంకే–45 వెపన్స్​ని అమెరికాలోని ‘బీఏఈ సిస్టమ్స్​ ల్యాండ్​ అండ్​ ఆర్మమెంట్స్​’ సంస్థ తయారుచేస్తుంది.​ ఈ లైట్​ వెయిట్​, అడ్వాన్స్​డ్​ సిస్టమ్స్​తో సముద్రాల్లో నీటిపై నుంచి కాకుండా లోపల నుంచే దాడి చేసి శత్రువును మట్టు పెట్టొచ్చు. అంటే.. రెగ్యులర్​గా చేపట్టే సర్ఫేస్​ వార్​ఫేర్​కి, ఎయిర్​ డిఫెన్స్ మిషన్స్​కి ఇది రివర్స్​ అన్న మాట. ఎదుటోడిపై ఇలా విరుచుకుపడే గట్స్​ ప్రపంచంలో కొన్ని దేశాలకే ఉన్నాయి. అవి కూడా అమెరికా నుంచే వెపన్స్​ కొని ఆ సామర్థ్యాన్ని సొంతం చేసుకున్నాయి.

నాలుగో దేశం మనదే

అమెరికాతోపాటు ఇతర మిత్ర దేశాలతో ఈ వెపన్స్​ని ఇచ్చిపుచ్చుకునే ఛాన్స్​ ప్రస్తుతం మూడింటికే ఉంది. అవి.. ఆస్ట్రేలియా, జపాన్​, సౌత్​ కొరియా. ఇప్పుడు వీటి సరసన ఇండియా చేరనుంది. అయితే.. ఈ ఎక్విప్​మెంట్​, సపోర్ట్​ ఆయా దేశాల్లోని బేసిక్​ మిలటరీ బ్యాలెన్స్​కి అదనమే తప్ప ప్రత్యామ్నాయం కాదని అమెరికా అంటోంది. ఈ నాలుగు దేశాల్లో ఇప్పటికే వెపన్స్​ ఎనర్జీని ఎంకే–45 సిస్టమ్స్ ​పెంచుతాయని వివరిస్తోంది. ఈ డీల్​కి చట్ట సభ కూడా గ్రీన్​సిగ్నల్ ఇవ్వాల్సి ఉందని, దీనికి ఇంకా నెల రోజులు పట్టొచ్చని చెబుతోంది.

ఈ ఒప్పందానికి అమెరికా చట్ట సభ ఒప్పుకునే సూచనలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. ప్రధాని మోడీ ఆ దేశంలో పర్యటించి వచ్చిన కొద్దిరోజులకే డీల్​ ఓకే కావటంతో ఈ అంచనాలు నెలకొన్నాయి. రెండు దేశాల మధ్య సెక్యూరిటీ రిలేషన్స్ పెరుగుతున్నాయనడానికి ఈ లేటెస్ట్ డెవలప్​మెంట్​నే ఉదాహరణగా చూపుతున్నారు. విశాఖలోని నావల్​ బేస్​లో ఇండియా, అమెరికా జాయింట్​ మిలటరీ ఎక్స్​ర్​సైజ్ జరుగుతున్న టైమ్​లోనే వెపన్స్​ కొనుగోలు ఒప్పందంపై ప్రకటన రావటం గమనించాల్సిన విషయం.   ​  ​  ​

వెపన్స్​తోపాటు ఇవి కూడా..

అమెరికాలోని డిపార్ట్​మెంట్​ ఆఫ్​ డిఫెన్స్​(డీఓడీ)కి అనుబంధంగా పనిచేసే డిఫెన్స్​ సెక్యూరిటీ కోపరేషన్​ ఏజెన్సీ (డీఎస్​సీఏ) ఈ ఫారిన్​ మిలటరీ సేల్స్​ (ఎఫ్​ఎంఎస్​) ప్రోగ్రామ్​ని అమలుచేస్తోంది. ఇందులో భాగంగా మన దేశానికి మోడిఫైడ్​–4 నావల్​ గన్నులతోపాటు ఇతర ప్రయోజనాలూ కల్పిస్తుంది. అవి.. 3500 డీ349 ప్రొజెక్టైల్స్, 5 ఇంచ్​/54 ఎంకే–92 మోడిఫైడ్​–1​ మందు సామగ్రి, తుపాకీల విడి భాగాలు, ఆ వెపన్స్​ వాడే జవాన్లకు ట్రైనింగ్​, టెక్నికల్​ డేటా, పబ్లికేషన్స్​; టెక్నికల్,​ లాజికల్​ అసిస్టెన్స్​, ట్రాన్స్​పోర్ట్​.

మిస్సైల్స్​​ కన్నా చాలా చౌక

ప్రపంచంలోని ఏ దేశ సైన్యం వద్దయినా రకరకాల గన్నులు ఉంటాయి. వాటిలోని నావల్​ గన్నుల వల్ల అతి పెద్ద లాభం ఏంటంటే మిస్సైల్స్​ని పేల్చటం కన్నా వీటిని ప్రయోగించటమే ఎంతో చౌక. నావల్​ గన్నులు మాత్రమే చేయగలిగే టాస్క్​లు, ఆపరేషన్స్​ చాలా ఉంటాయి. ఇవి డ్యూయెల్​ రోల్​ పోషిస్తాయి. ఈ వెపన్స్​ని అటు నీటిలోనూ, ఇటు నేల మీదా వాడుకోవచ్చు. సోల్జర్లను నేరుగా పంపటానికి వీల్లేని ప్రాంతాల్లో ఉన్న శత్రువుల పొజిషన్లకు, అసెట్లకు భారీ నష్టం కలిగించటం నావల్​ గన్నులకే సాధ్యం. ఇండియా వద్ద ఇప్పటికే బ్రహ్మోస్​ మిస్సైల్​ ఉంది. అయితే దీన్ని లాంగ్​ రేంజ్​ టార్గెట్లకు వాడుతున్నారు. అంతకన్నా దగ్గరలోని లక్ష్యాలను ఛేదించటానికి ఎంకే–45 వెపన్స్​ని ఉపయోగించనున్నారు. రష్యా అందించే ఏకే–176 గన్నులు 21.5 కిలోమీటర్ల దూరంలోని టార్గెట్లను, ఇటలీ అందుబాటులోకి తెచ్చిన ఒటో మలేరా–76 ఎంఎం క్యానన్లు 20 కిలోమీటర్ల రేంజ్​లోని లక్ష్యాలను మాత్రమే ఫినిష్​ చేయగలవు. వీటితో పోల్చితే అమెరికా ఇస్తున్న ఎంకే–45 ఆయుధాలు 36 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించగలవు.

36 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని కూడా..

బీఏఈ సిస్టమ్స్​ ల్యాండ్​ అండ్​ ఆర్మమెంట్స్​ సంస్థ చెబుతున్న వివరాల ప్రకారం.. ఎంకే–45 మోడిఫైడ్​–4 గన్నులు 20 నాటికల్​ మైళ్ల (36 కిలోమీటర్ల) దూరంలో ఉన్న శత్రువులను సైతం మటాష్​ చేయగలవు. వీటిని అమెరికా నేవీ ‘డీడీజీ–51 క్లాస్​ డిస్ట్రాయర్లు’గా వాడుతోంది. ఎంకే–45 వెపన్లను భూమ్మీద​ ఉన్న బలగాలకు ప్రొటెక్టివ్​గా, సపోర్టివ్​గా వాడుకోవచ్చు. వీటి సాయంతో లోతట్టు ప్రాంతాలను కంట్రోల్​లోకి తీసుకోవచ్చు. తమ పరిధి లోపు భూభాగంలో యుద్ధానికి క్షణాల్లో సిద్ధం కాగలవు.

In the case of the Navy, our country's security will be strengthened