- నిరుడు వానాకాలంతో పోలిస్తే మూడు రెట్లు అదనం
- ప్రస్తుతం 3 లక్షల ఎకరాల్లో సాగు
- రూ.500 బోనస్ ప్రకటనతో సన్నాల వైపు అన్నదాతలమొగ్గు
- గ్రామాల్లో జోరుగా వరి నాట్లు
కరీంనగర్, వెలుగు : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈ వానాకాలం సన్న రకం సాగు పెరిగింది. నిరుడు వానాకాలంతో పోలిస్తే ఈ ఏడాది సన్నాల సాగు మూడు రెట్లు పెరిగినట్లు వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సన్న రకం వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించిన నేపథ్యంలో రైతులు ఆ వైపుగా మొగ్గుచూపుతున్నారు.
ప్రతి ఏటా వానకాలంలో ఉమ్మడి జిల్లాలో 9.50 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తుండగా ఈసారీ 9.65 లక్షల ఎకరాలకు పెరుగుతుందని అంచనా. గతంలో 80 శాతం దొడ్డు రకాలు సాగుచేయగా 20 శాతం మాత్రమే సన్న రకాలు సాగు చేస్తుండేవారు. నిరుడు వానాకాలంలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 87 వేల ఎకరాల్లో మాత్రమే సన్నాలు సాగు చేయగా ఈసారి బోనస్ ప్రకటనతో ఈసారి 3 లక్షల ఎకరాలు దాటే అవకాశం ఉందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ఈ లెక్కన సుమారు సన్న వడ్ల సాగు విస్తీర్ణం 35 శాతానికి పెరిగే అవకాశముంది.
బడ్జెట్‌లో కేటాయింపుతో రైతుల్లో నమ్మకం..
రాష్ట్ర ప్రభుత్వం ఈ సారి బడ్జెట్‌లో సన్న వడ్లకు రూ.500 బోనస్ స్కీమ్ అమలు కోసం రూ.1800 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. అలాగే బీపీటీ-5204, ఆర్‌ఎన్‌ఆర్15048, హెచ్‌ఎంటీ సోనా, జై శ్రీరామ్ తదితర 33 రకాల వడ్లను సన్న రకాలుగా గుర్తిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. దీంతో అన్నదాతలు ఆ రకం సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఆగస్టు చివరి దాకా నాట్లకు అవకాశం ఉండడంతో గతంలో దొడ్డు రకం నారు పెట్టినోళ్లు సైతం సన్న వడ్ల వైపు మళ్లుతున్నారు.
పెట్టుబడి ఎక్కువ.. దిగుబడి తక్కువ
మార్కెట్‌లో సన్న రకం వడ్లకు విపరీతమైన డిమాండ్ ఉన్నప్పటికీ చీడ పీడలు ఎక్కువ ఆశిస్తాయని, పెట్టుబడి పెట్టినా తక్కువ దిగుబడి వస్తుందనే కారణంతో రైతులు ఎక్కువగా దొడ్డు వడ్ల రకాలను ఎంచుకుంటున్నారు. భూమిని దున్నడం, కలుపు తొలగించడం, పురుగు మందులు పిచికారీ చేయడం, కూలీ ఖర్చులు కలిపి ఎకరంలో దొడ్డు రకం సాగుకు రూ.30 వేలు ఖర్చయితే, సన్న రకాలకు రూ.35 వేలు అవుతోంది. క్రిమికీటకాల బారిన పడే అవకాశం ఉన్నందున రైతులు అదనంగా రెండు, మూడు సార్లు మందులు పిచికారీ చేయాల్సి ఉంటుంది. ఇందుకు రూ.3 వేల నుంచి రూ.3,500 వరకు ఖర్చవుతోంది. సన్నరకం వడ్ల దిగుబడి 5 నుంచి 10 బస్తాలు తక్కువగా వస్తుందని, అందుకే గతంలో దొడ్డు రకానికి మొగ్గుచూపేవారని అధికారులు చెబుతున్నారు.