ఆదిలాబాద్, వెలుగు: ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబా. ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో జరిగే నాగోబా జాతర దేశంలోనే రెండో అతిపెద్ద గిరిజన వేడుక. ప్రతి ఏడాది పుష్యమాసం అమావాస్య నాటి రాత్రి మెస్రం వంశీయులు పవిత్ర గంగాజలంతో ప్రత్యేక పూజలు నిర్వహించి జాతర ప్రారంభిస్తారు. ఈ ఏడాది ఇప్పటికే గంగాజలం కోసం మెస్రం వంశీయులు పాదయాత్రగా బయల్దేరారు. ఈ నెల 21న నాగోబాకు మహాపూజతో జాతర ప్రారంభమై.. 24న ముగుస్తుంది. మెస్రం వంశీయులు పవిత్ర గంగాజలం కోసం కాలినడకన జన్నారం మండలంలోని కలమడుగు గోదావరికి వెళ్తారు. ఇలా పలు మండలాలు, గ్రామాల మీదుగా తిరిగి నాగోబా చేరుకునేంతవరకు ప్రతిచోట వారికి ఆదివాసీలు అతిథ్యమిస్తారు. జాతరకు మెస్రం వంశీయులు ఎంత మంది వచ్చినా అక్కడ 22 పొయ్యిల మీదనే వంటలు చేసుకోవడం ఆచారం. నాగోబా జాతరలో కొత్త కోడళ్లు బేటింగ్ కావడం ఒక ప్రత్యేకత. నాగోబా జాతరను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించింది. జాతరకు జిల్లా నుంచే కాకుండా ఏపీ, మహారాష్ట్ర నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. చివరి రోజు నిర్వహించే దర్బార్ దాదాపు 70 ఏళ్ల నుంచి జరుగుతోంది.
ఖాందేవ్ జాతర
నాగోబా జాతర ప్రారంభానికి ముందు నార్నూర్ మండల కేంద్రంలో ఖాందేవ్ జాతర ప్రారంభమవుతుంది. ఈ నెల 6 నుంచి ఈ జాతర ప్రారంభం కానుండగా, 15 రోజుల పాటు నిర్వహిస్తారు. 94 ఏళ్ల క్రితం తొడసం వంశస్థుడైన ఖమ్ము పటేల్‌కు రాత్రివేళ కలలో ఖాందేవుడు ప్రత్యక్షమై నీ వ్యవసాయ భూమిలో నేను కొలువయ్యానని, గ్రామమంతా సుఖ సంతోషాలతో ఉండాలంటే తనకు పూజలు చేయాలని చెప్పారు. ఆ తర్వాత వ్యవసాయ పొలంలో ఖాందేవుడు ఓ స్తంభంలా వెలిసి దర్శనమిచ్చారు. నాటి నుంచి ఏటా పుష్య పౌర్ణమితో ఖాందేవుడి జాతరను తొడసం వంశీయులు జరుపుతున్నారు. ఈ జాతర ముగింపు రోజు ఇక్కడికి వచ్చిన ఆదివాసీలు నాగోబా జాతర కేస్లాపూర్‌కు తరలివెళ్తారు. తొడసం ఆడపడుచుతో మూడేళ్లు నువ్వుల నూనెను తాగించడం ఇక్కడి ఆనవాయితీ. ఈ నూనె తాగడం ద్వారా సంతానయోగం ఉంటుందని విశ్వాసం.
జంగుబాయి జాతర
శార్దూల వాహిని దుర్గామాత ప్రతి రూపమే జంగుబాయి అని ఆదివాసీల నమ్మకం. ఆంధ్ర, మహారాష్ట్ర సరిహద్దు కెరమెరి మండలం పరందోళి గ్రామం సమీపంలో గల శంకర్‌లొద్ది అటవీ ప్రాంతంలో జంగుబాయి కొలువైంది. ఏటా పుష్య మాసంలో నెల రోజులపాటు ఆదివాసీలు అత్యంత నియమనిష్టలతో జంగుబాయిని కొలుస్తారు. ప్రస్తుతం జాతర ప్రాంభమైంది. చిమ్మచీకటిలో దీపం వెలుతురులో కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా దేవత దర్శనం ఇస్తుంది. వివిధ రాష్ట్రాల్లో ఉన్న జంగుబాయి వారసులు వేలాదిగా ఒకే వేదికపై మొక్కులు చెల్లించుకుంటారు.
బుడుందేవ్, మహాదేవ్ జాతర
నాగోబా జాతర ముగిసిన తర్వాత ఉట్నూర్ మండలం శ్యాంపూర్‌లో బుడుందేవ్ జాతరను మెస్రం వంశీయులు ప్రారంభిస్తారు. శ్యాంపూర్‌లో బుడుందేవ్ జాతర ముగిసిన తర్వాత సిర్పూర్(యు) మండల కేంద్రంలో మహాదేవ్ జాతరను ప్రారంభిస్తారు. ఆత్రం వంశీయులు ప్రత్యేక పూజలతో మహాదేవ్‌ను కొలుస్తారు.
సదల్పూర్ జాతర
ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని సదల్ పూర్ గ్రామంలో 52 ఏళ్ల నుంచి బైరందేవ్, మహాదేవ్ ఆలయాల్లో జాతర నిర్వహిస్తున్నారు. ఈ నెల 15న జాతర ప్రారంభం కానుంది. ఈ రెండు ఆలయాలను శాతవాహనుల కాలంలో నిర్మించారు. మనసులో ఏదైనా కోరుకొని బైరం దేవ్ ఆలయంలో ఉన్న శివలింగాన్ని పైకి ఎత్తాలి. కోరిక నెరవేరేదైతే లింగం సులువుగా పైకి లేస్తుందని భక్తుల నమ్మకం. లేదంటే ఎటూ కదలకుండా ఉంటుంది. ప్రతి ఏటా పుష్యమాసంలో ఇక్కడ జాతర నిర్వహిస్తారు. అటవీ ప్రాంతంలో నిర్వహిస్తుండటంతో ఈ జాతరను జంగి జాతరగా పిలుస్తుంటారు. ఈ ఆలయాల్లో కేవలం కోరంగే వంశీయులతోనే పూజలు ప్రారంభిస్తారు. వారం రోజుల పాటు జాతర కొనసాగిన తర్వాత అమవాస్య రోజున ‘కాలదహి హండి’ కార్యక్రమం నిర్వహించి జాతర ముగిస్తారు. ఈ కాలదహి కార్యక్రమానికి ఓ ప్రత్యేకత ఉంది. ఒక కుండలో పెరుగు వేసి ఆలయంపైన జెండా ఎగురవేసిన అనంతరం పెరుగు కుండను పగలగొడతారు. అందులోని పెరుగును కింద అప్పటికే ఉంచిన పాలు, కుడుకలు, అటుకులు, పేలాలు ఉన్న ప్రసాదంలో కలిసే విధంగా ఏర్పాటు చేస్తారు. ఇలా పెరుగుతో కలిపిన ఈ ప్రసాదాన్ని భక్తుల చేతులకు ఇవ్వకుండా ఆలయం పై నుంచి కింద ఉన్న భక్తులకు విసిరివేయడం ఇక్కడి ప్రత్యేకత.