బీజేపీకే మొగ్గు!..ఎగ్జిట్ పోల్స్​లో కమలం పార్టీకి ఆధిక్యం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్​ పోల్స్​ అంచనా

బీజేపీకే మొగ్గు!..ఎగ్జిట్ పోల్స్​లో కమలం పార్టీకి ఆధిక్యం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్​ పోల్స్​ అంచనా
  • మ్యాజిక్ ఫిగర్ 36ను బీజేపీ ఈజీగా దాటుతుందన్న మెజార్టీ పోల్స్  
  • ఆప్​ హ్యాట్రిక్​ ఆశలు గల్లంతవుతాయన్న సర్వే సంస్థలు
  • సింగిల్​ డిజిట్​కే కాంగ్రెస్ పరిమితమన్న పోల్స్​
  • 60% పోలింగ్.. ఓటేసిన రాష్ట్రపతి, రాహుల్, కేజ్రీవాల్
  • 27 ఏండ్ల తర్వాత కమలం హవా
  • 40 సీట్లు బీజేపీవేనని అంచనా
  • కాంగ్రెస్ పార్టీకి 0 నుంచి 3 స్థానాలలోపేనన్న ఎగ్జిట్ పోల్స్

న్యూఢిల్లీ:   దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా మూడోసారి జయకేతనం ఎగురవేయాలన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఆశలు గల్లంతు అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. గత రెండు ఎన్నికల్లో సింగిల్ డిజిట్ కే పరిమితమైన బీజేపీ ఈసారి బాగా పుంజుకున్నదని.. 27 ఏండ్ల తర్వాత మళ్లీ కమలం పార్టీ ఢిల్లీలో అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. 

బుధవారం సాయంత్రం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ముగియగానే పలు సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేశాయి. ఢిల్లీ అసెంబ్లీలో మొత్తం 70 సీట్లకు గాను మ్యాజిక్ ఫిగర్ 36ను బీజేపీ సునాయాసంగా దాటుతుందని సర్వే సంస్థలు అంచనా వేశాయి. గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ఖాతా కూడా తెరవలేకపోయిన కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇప్పుడు కూడా పెద్దగా మెరుగుపడలేదని.. ఈసారి ఆ పార్టీకి 0 నుంచి 3 సీట్లే రావచ్చని సర్వేలు తెలిపాయి. ఈ ఎన్నికల్లో బీజేపీవైపే జనం మొగ్గు చూపారని పీమార్క్, టైమ్స్ నౌ జేవీసీ, పీపుల్స్ పల్స్ వంటి 7 సంస్థలు అంచనా వేయగా.. వీప్రిసైడ్, మైండ్ బ్రింక్ అనే 2 సంస్థలు మాత్రం ఆప్ గెలిచే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నాయి. 

యావరేజ్ గా బీజేపీ 42 సీట్లతో ఘన విజయం సాధించవచ్చని, ఆప్ 25 సీట్లకే పరిమితం కావచ్చని 4 ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. బీజేపీ 51 నుంచి 60 సీట్లతో ఘన విజయం సాధించవచ్చని పీపుల్స్ పల్స్ సంస్థ వెల్లడించింది. ఆప్ 10 నుంచి 19 సీట్లకే పరిమితం కావచ్చని తెలిపింది. మాట్రిజ్ సంస్థ ఒక్కటే బీజేపీ, ఆప్ మధ్య టఫ్ పోటీ ఉంటుందని తెలిపింది. ఆప్ 35 నుంచి 40, బీజేపీ 32 నుంచి 37 సీట్లు గెలవొచ్చని పేర్కొంది. మొత్తంగా 2015, 2020 అసెంబ్లీ ఎన్నికల్లో స్వీప్ చేసిన ఆప్ ఈసారి ఓడిపోవటం ఖాయమని మెజార్టీ సర్వేలు తేల్చిచెప్పడంతో 
ఆ పార్టీ కన్వీనర్, మాజీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టయింది.

ఎగ్జిట్ పోల్స్ నిజమయ్యేనా?

గత ఎన్నికల్లో అనేక సార్లు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలకు, అసలు ఫలితాలకు పొంతన లేని సందర్భాలు కూడా ఉన్నాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలనే తీసుకుంటే గత రెండు ఎన్నికల్లోనూ ఆప్ ఓడిపోతుందని మెజార్టీ సంస్థలు ఎగ్జిట్ పోల్స్​లో అంచనా వేశాయి. కానీ అసలు ఫలితాల్లో మాత్రం ఆప్ భారీ మెజార్టీతో విజయ దుందుభి మోగించింది. దీంతో ఈ ఎగ్జిట్ పోల్స్ కూడా నిజమవుతాయా? లేదా అన్నదీ ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలపై బీజేపీ ఢిల్లీ చీఫ్ స్పందిస్తూ.. ఢిల్లీకి ‘ఆప్-దా(ఆపద)’ తొలగిపోతున్నదన్నారు. అయితే, తమ పార్టీ చరిత్రాత్మక విజయం సాధిస్తుందని, కేజ్రీవాల్ నాలుగో సారి సీఎం అవుతారని ఆప్ నేత రీనా గుప్తా ధీమా వ్యక్తం చేశారు.

 
ఢిల్లీ అసెంబ్లీలో మొత్తం సీట్లు: 70.. మ్యాజిక్ ఫిగర్: 36

చాణక్య స్ట్రాటజీస్
బీజేపీ: 39 - 44
ఆప్: 25 - 28
కాంగ్రెస్: 2 - 3

డీవీ రీసెర్చ్
బీజేపీ:  36 - 44
ఆప్:  26 - 34
కాంగ్రెస్:  0

టైమ్స్ నౌ జేవీసీ
బీజేపీ: 39 - 45
ఆప్:  22 - 31
కాంగ్రెస్:  0 - 2

మాట్రిజ్
బీజేపీ: 35 - 40
ఆప్:  32 - 37
కాంగ్రెస్:  0 - 1

మైండ్ బ్రింక్
బీజేపీ: 21 - 25
ఆప్: 44 - 49 
0 - 1 

పీ - మార్క్
బీజేపీ:  39 - 49
ఆప్:  21 - 31
కాంగ్రెస్:  0 - 1

పీపుల్స్ ఇన్ సైట్
బీజేపీ:  40 - 44
ఆప్:  25 - 29
కాంగ్రెస్:  0 - 2

పీపుల్స్ పల్స్
బీజేపీ:  51 - 60
ఆప్:  10 - 19
కాంగ్రెస్: 0

పోల్ డైరీ
బీజేపీ:  42 - 50
ఆప్:  18 - 25
కాంగ్రెస్: 0 - 2
 
వీప్రిసైడ్
బీజేపీ: 18 - 23
ఆప్: 46 - 52
కాంగ్రెస్: 0 - 1

ఎన్డీటీవీ పోల్ ఆఫ్ పోల్స్
బీజేపీ:  39
ఆప్:  30
కాంగ్రెస్:  01