పండ్ల తోటల పెంపకంపై సర్కారు నజర్ రాయితీపై 16 రకాల పండ్ల మొక్కలు, మండలానికి 50 ఎకరాల్లో సాగు

 పండ్ల తోటల పెంపకంపై సర్కారు నజర్ రాయితీపై 16 రకాల పండ్ల మొక్కలు, మండలానికి 50 ఎకరాల్లో సాగు

హైదరాబాద్, వెలుగు:   పండ్ల కొరత నేపథ్యంలో పండ్లతోటల సాగును ప్రోత్సహించేందుకు రాష్ట్ర సర్కారు సన్నాహాలు చేస్తున్నది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేసి వివిధ రకాల పండ్ల తోటల విస్తీర్ణం పెంచేందుకు కసరత్తు చేస్తున్నది. పండ్లసాగులో ఆసక్తి ఉన్న రైతులకు రాయితీలతో సహకారం అందిస్తోంది. ఈ నేపథ్యంలో హార్టికల్చర్​ డిపార్ట్ మెంట్ అధికారులు నరేగాను అనుసంధానించి ప్రతి మండలానికి  50 ఎకరాల్లో పండ్లతోటల సాగును ప్రోత్సహించేందుకు ప్లాన్​ చేస్తున్నారు. 

ప్రత్యామ్నాయ పంటల సాగులో భాగంగా రాష్ట్రంలో ఐదెకరాలలోపు సాగుభూమి ఉన్న సన్న, చిన్నకారు రైతులకు రాయితీ కల్పించి పండ్లతోటలను ప్రోత్సహించాలని ప్లాన్​ చేస్తున్నారు. అగ్రికల్చర్,  హార్టికల్చర్, నరేగా శాఖల సమన్వయంతో రైతులను ఎంపిక చేయనున్నారు. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రంలో పెరుగుతున్న పండ్ల అవసరాలకు అనుగుణంగా మామిడి మినహా ఇతర పండ్లను వేరే రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకునే పరిస్థితి ఉంది. దీంతో పండ్ల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అలాగే పండ్లకు మార్కెట్‌‌‌‌లో డిమాండ్‌‌‌‌  విపరీతంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో పండ్లతోటల సాగును పెంచేందుకు సర్కారు చర్యలు చేపట్టింది. 

మొదటి దిగుబడి వచ్చే వరకు సాయం

రాష్ట్రవ్యాప్తంగా మండలానికి 50 ఎకరాల విస్తీర్ణంలో పండ్లతోటలకు రాయితీ కల్పించాలని ప్రభుత్వం టార్గెట్ గా పెట్టుకుంది.  డిమాండ్  ఉన్న తోటలను పండించే రైతులకు ప్రోత్సాహకాలను అందించాలని నిర్ణయించింది. మామిడి, నిమ్మ, బత్తాయి, జామ, సీతాఫలం, జీడిమామిడి, సపోట, ఆపిల్​ బేర్, దానిమ్మ, డ్రాగన్  ఫ్రూట్  పంటలతో పాటు పొలం గట్లపై వేసుకునే కొబ్బరి తోటలు, నేరేడు, కరోంద (వాక్కాయ), చింత చెట్లు, మునగ ఇలా 16 రకాల పండ్లతోటల పెంపకానికి సబ్సిడీ అందించనున్నారు. 

ఉపాధి జాబ్​ కార్డు, ఐదెకరాలలోపు సాగుభూమి ఉన్న రైతులకు అవకాశం కల్పిస్తున్నారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో ప్రతి మండలానికి 50 ఎకరాల చొప్పున పండ్లతోటలను సాగు చేయించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం అర్హులైన రైతుల నుంచి అప్లికేషన్లు స్వీకరిస్తున్నారు. మొక్కలను వంద శాతం రాయితీపై అందిస్తున్నారు. ఈ పథకం కింద ఎంపికైన రైతులకు పండ్లతోటల సాగుకు మూడేళ్ల వరకు నిర్వహణ ఖర్చు చెల్లిస్తారు. ఎంపికైన రైతుల భూమి సారాన్ని బట్టి హార్టికల్చర్​ అధికారుల సూచనల మేరకు పండ్లతోటలను ఎంపిక చేస్తారు. 

మొక్కల పెంపకానికి సంబంధించి గుంతలు తీసేందుకు కూలీలకు డబ్బులు, తోట చుట్టూ కంచె ఏర్పాటు, ఎరువుల కొనుగోలు కోసం రైతులకు డబ్బులు చెల్లిస్తారు. పంట మొదటి దిగుబడి వచ్చే వరకు సాయం అందిస్తారు. అలాగే డ్రిప్  ఇరిగేషన్ పైనా రాయితీ కల్పించనున్నారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు వంద శాతం, మిగిలిన వారికి 90 శాతం మేర సబ్సిడీపై మైక్రో ఇరిగేషన్  నిబంధన ప్రకారం డ్రిప్​ పరికరాలను పంపిణీ చేయనున్నారు. ఆసక్తి కలిగిన రైతులకు  పండ్లతోటల సాగుపై ఎప్పటికప్పుడు సలహాలు సూచలు అందించనున్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని హార్టికల్చర్ ​ అధికారులు సూచించారు.