కీలక శాఖలన్నింటిలో ఇన్​చార్జిల పాలన

  •     అదనపు బాధ్యతలతో ఇన్​చార్జులపై భారం
  •     ఏండ్లు గడుస్తున్నా మారని పరిస్థితి

నిజామాబాద్, వెలుగు : జిల్లాలోని  ఇంపార్టెంట్​ గవర్నమెంట్​ శాఖల్లో రెగ్యులర్​ అధికారులు లేక, ఇన్​చార్జ్​ ఆఫీసర్లతోనే నెట్టుకొస్తున్నారు. ఒకే అధికారి రెండు మూడు శాఖలకు బాధ్యతలు చూడాల్సి రావడంతో వారిపై పనిభారం పడుతోంది. కొన్ని శాఖల్లో ఏళ్ల తరబడి రెగ్యులర్​ అధికారులు లేకపోవడం వల్ల ప్రజలకు సరైన సేవలు అందడం లేదు.

మెడికల్​ డిపార్ట్ మెంట్​లో అయిదేండ్లు మించి..

జిల్లాలో పీహెచ్​సీలను పర్యవేక్షించే డీఎంహెచ్ వో పోస్టులో ఐదేండ్ల నుంచి డాక్టర్ ​సుదర్శనం ఇన్​చార్జి ​గా కొనసాగుతున్నారు. లెప్రసీ అధికారిగా ఆయన వచ్చారు. డీఎంహెచ్​వో  చైర్​లో పూర్తి స్థాయి ఆఫీసర్​ రావడం లేదు. డాక్టర్​ వెంకటి బదిలీ తర్వాత తాత్కాలికంగా సుదర్శనంను నియమిస్తున్నట్లు డిపార్ట్​మెంట్​ ప్రకటించింది. మధ్యలో వచ్చిన డాక్టర్​ బాలమూర్తి నాలుగు నెలలు డీఎంహెచ్​వోగా పనిచేశారు. ఆయన హఠాన్మరణం తర్వాత మళ్లీ సుదర్శనం కంటిన్యూ అవుతున్నారు. కీలకమైన డీఎంహెచ్​వో పోస్ట్​లో ఆయన కొనసాగుతున్నందున, లెప్రసీ విభాగంపై పర్యవేక్షణ కొరవడింది.

రెండు చోట్ల నుంచి పని..  

కమ్యూనిటీ, ఏరియా, జిల్లా ఆస్పత్రులు వైద్య విధాన పరిషత్​లో ఉంటాయి. వీటిని డీసీహెచ్​ఎస్​ పర్యవేక్షిస్తారు. ప్రస్తుతం ఈ పోస్టులో ఉన్న శివశంకర్​ రెండు చోట్లనుంచి పనిచేయాల్సి వస్తుంది. నిజామాబాద్​లో మెడికల్ ​కాలేజీ స్టార్ట్​ అయ్యాక జీజీహెచ్​ ​ఏర్పడింది. దీంతో అక్కడి జిల్లా హాస్పిటల్​ను బోధన్ కు తరలించారు. నిబంధనల ప్రకారం జిల్లా హాస్పిటల్​సూపరింటెండెంట్​ డీసీహెచ్ఎస్​గా వ్యవహరిస్తారు. ఈ క్రమంలో వచ్చిన డాక్టర్​ శివశంకర్ బోధన్​ జిల్లా హాస్పిటల్​లో సూపరింటెండెంట్​ పోస్టింగ్​ తీసుకొని, నిజామాబాద్​ కలెక్టరేట్​లో డీసీహెచ్ఎస్​గా విధులు విధులు నిర్వహిస్తున్నారు. ఆయన ఒక చోట ఉన్నప్పుడు మరో చోట సేవలు ఎఫెక్ట్​ అవుతున్నాయి

పోలీస్​శాఖకు ఇన్​చార్జే

జిల్లా పోలీస్​ చరిత్రలో ఎప్పుడూలేని రీతిలో ఇన్​చార్జి పాలన నడుస్తోంది. మార్చి నెలాఖరు కమిషనర్​నాగరాజ్​ రిటైర్​మెంట్​తర్వాత, నిర్మల్​ఎస్పీ ప్రవీణ్​కుమార్​ను ఇన్​చార్జిగా నియమించారు. మూడు అదనపు కమిషనర్​ పోస్టులు ఇప్పటికీ ఖాళీగా ఉన్నాయి. 

మంత్రి ఇలాకాలోనూ..

భీంగల్​ మున్సిపల్ ​ఇన్​చార్జి కమిషనర్​గా దాదాపు రెండేండ్ల నుంచి వేల్పూర్​ తహసీల్దార్​ రాజేందర్ ​పనిచేస్తున్నారు. 2020 లోకల్​బాడీ ​ఎన్నికలప్పుడు కొత్తగా ఈ మున్సిపాలిటీ ఏర్పడింది. మంత్రి ప్రశాంత్​రెడ్డి నియోజకవర్గం పరిధిలోని ఈ​ మున్సిపాలిటీకి కమిషనర్​గా గోపు గంగాధర్​ కొంతకాలం పనిచేసి, జగిత్యాల ట్రాన్స్​ఫర్​ అయ్యారు. అప్పటి నుంచి రాజేందర్​ ఇన్​చార్జిగా వ్యవహరిస్తున్నారు.

మైనార్టీ, బీసీ వెల్ఫేర్..​

బీసీ వెల్ఫేర్​కుర్చీ ఏడాదికి పైగా ఖాళీగా ఉంది. అసిస్టెంట్​ఆఫీసర్​పల్లె నర్సయ్యకు ఇన్​చార్జి ఇచ్చారు. అంతకు ముందు కామారెడ్డి బీసీ సంక్షేమ శాఖ ఆఫీసర్​ను కొంతకాలం కొనసాగించారు. మైనార్టీ వెల్ఫేర్​కు ఎస్సీ కార్పొరేషన్​ ఈడీ రమేశ్​ ఇన్​చార్జిగా పనిచేస్తున్నారు. 

మున్సిపల్​ కమిషనర్​గా..

నిజామాబాద్​ మున్సిపల్ ​కార్పొరేషన్​ జనాభా 5 లక్షలకు పైగా ఉంది. ఐఏఎస్​ అధికారి జితేశ్​ వీ పాటిల్​ ఇక్కడి కమిషనర్​గా పనిచేసి, 2021, సెప్టెంబర్ లో కామారెడ్డి జిల్లా కలెక్టర్​గా ప్రమోషన్​పై వెళ్లారు. అప్పటి నుంచి అదనపు కలెక్టర్​(లోకల్​బాడీస్) చిత్రామిశ్రాకు ఇన్​చార్జి బాధ్యతలు అప్పగించారు. ఆమె మున్సిపల్​ ఆఫీస్​కు రాని సందర్భంలో కలెక్టరేట్​లోని ఆమె ఛాంబర్​కు సిబ్బంది ఫైల్స్​ తీసుకెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. పూర్తి స్థాయి కమిషనర్ ​లేకపోవడంతో పాలన గాడితప్పుతోంది. టౌన్​ప్లానింగ్​స్టాఫ్​పై తీవ్ర అవినీతి ఆరోపణలు వస్తున్నాయి.