ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 38 వేల ఎకరాల్లో పోడు సాగు

నిజామాబాద్,  వెలుగు: పోడు భూముల లొల్లి రోజుకో మలుపు తిరుగుతోంది. అర్హులైన వారికి పట్టాలు ఇచ్చేందుకు దరఖాస్తులు స్వీకరించి.. సర్వే పూర్తి చేసిన సర్కారు రూల్స్ పేరిట ఇన్నాళ్లు జాప్యం చేస్తూ వస్తోంది. మరో వైపు చట్టాలకు లోబడి ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు పంపిణీ చేస్తామని మంత్రి ప్రశాంత్‌‌రెడ్డి ఇటీవల చేసిన ప్రకటనతో పోడు లొల్లి మళ్లీ మొదటికొచ్చింది. సమస్యపై పోరుకు గిరిజన సంఘాలు సిద్ధమవుతున్నాయి.

38 వేల ఎకరాల్లో...

ఉమ్మడి నిజామాబాద్‌‌ జిల్లాలో పోడు భూములపై అనేక సార్లు ఫారెస్ట్ ఆఫీసర్లు, రైతుల మధ్య వివాదాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే ఆఫీసర్లు సర్వే చేపట్టారు. నిజామాబాద్‌‌ జిల్లాలో 13 వేలు, కామారెడ్డి జిల్లాలో 25  వేల ఎకరాల ఫారెస్ట్‌‌ భూముల్లో రైతులు ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్నట్లు తేలింది. దీంతో పోడు సమస్యకు పరిష్కారం చూపిస్తామంటూ ప్రభుత్వం రైతుల నుంచి దరఖాస్తులను స్వీకరించింది. ఉమ్మడి జిల్లాలో 22 వేల అప్లికేషన్లు వచ్చాయి. కానీ వాటిని ఇప్పటి వరకు ప్రాసెస్‌‌ చేయలేదు. ప్రభుత్వ చిత్తశుద్ధిపైన ఇటు గిరిజన రైతులు, అటు రైతు సంఘాల నేతలు  అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.  

‌‌‌‌పోరుబాట తప్పదా?

ఉమ్మడి నిజామాబాద్‌‌ జిల్లాలో 853.21 కిలో మీటర్ల మేర అడవులున్నాయి. మోపాల్‌‌, ఇందల్వాయి, సిరికొండ, కమ్మర్‌‌పల్లి, మాచారెడ్డి, కామారెడ్డి, గాంధారి, లింగంపేట తదితర మండలాల్లో గిరిజనులు అటవీ భూముల్లో పంటలు పండిస్తున్నారు. తరతరాలుగా వాటినే నమ్ముకుని జీవిస్తున్నారు. అటవీ భూములను ఆక్రమించారని అధికారులు పలు మార్లు దాడులు చేశారు. పంటలు ధ్వంసం చేశారు. దీంతో గిరిజనులు తిరగబడ్డారు. సిరికొండ శివారులో 532 సర్వే నంబర్‌‌‌‌లో ఉన్న పోడు భూములపై ఫారెస్ట్ ఆఫీసర్లతో వాగ్వావాదం జరిగింది. జిల్లా వ్యాప్తంగా సుమారు 40 వేల ఎకరాల్లో అటవీ భూమి ఆక్రమణకు గురైనట్లు అటవీ శాఖ అధికారులు సర్కారుకు నివేదికలు కూడా ఇచ్చారు. అటవీ, రెవెన్యూ సర్వే శాఖల జాయింట్‌‌ సర్వే చేశారు. ఇప్పటి వరకు 52 వేల ఎకరాల్లో సర్వే పూర్తి చేశారు. పాత కబ్జాల జోలికి వెళ్లకుండా కొత్తగా అటవీ భూముల ఆక్రమణలకు పాల్పడే వారిని గుర్తిస్తున్నారు. కొన్ని చోట్ల గిరిజనేతరులు కబ్జాకు పాల్పడుతున్న విషయాన్ని గుర్తించారు. అలాంటి వారి భూములను తిరిగి స్వాధీనం చేసుకునే దిశలో కార్యచరణ రూపొందిస్తున్నారు.  

న్యాయం చేయాలి

మేం తాతల కాలం నుంచి ఈ భూముల్లోనే సాగు చేసుకుంటున్నాం. కానీ ప్రతిసారి ఫారెస్ట్ ఆఫీసర్లు వచ్చి మమ్మల్ని అడ్డుకుంటున్నారు. పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకున్నాం. ఆఫీసర్లు వచ్చి సర్వే చేశారు. కానీ ఇంతవరకు సమస్య పరిష్కారం కాలేదు.

- గంగాధర్‌‌‌‌, పోడు రైతు

అర్హులకు అన్యాయం చేస్తే ఊరుకోం..

పోడు భూములపై ప్రభుత్వం రోజుకో మాట మాట్లాడుతుంది. ఎప్పుడూ ఏదో పేరుతో సమస్యను పక్కదారి పట్టించేందుకు ప్లాన్‌‌ చేస్తోంది. 40 ఏళ్లుగా కాస్తులో ఉన్న అర్హులకు అన్యాయం చేస్తే ఊరుకోం.  

- యాదగిరి, 
కాంగ్రెస్ ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు