
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన మలిదశ తెలంగాణ ఉద్యమంలో సబండ వర్ణాలు పాల్గొన్నాయి. విద్యార్థులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, రాజకీయ నాయకులు కీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలో నిర్వహించిన సహాయ నిరాకణ, మియన్ మార్చ్, సకలజనుల సమ్మె, సాగర హారం కార్యక్రమాలు ప్రత్యేక రాష్ట్ర సాధనకు దోహదపడ్డాయి.
సహాయ నిరాకరణ :
తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి 2011 ఫిబ్రవరి 17 నుంచి సహాయ నిరాకరణ ఉద్యమానికి పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా కార్యాచరణను ప్రకటించింది. ఫిబ్రవరి 13న గ్రామగ్రామాన డప్పు చాటింపులు, దీక్షా కంకణం కట్టుకోవడం, 14న నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహణ, 15న జైల్‌భరో కార్యక్రమం, 16న తెలంగాణపై నిర్ణయం తీసుకోవాలని కాంగ్రెస్, టీడీపీ, ఎంపీలు, ఎమ్మెల్యేల ఇండ్ల ఎదుట ధర్నాలు నిర్వహించారు. ఫిబ్రవరి 17 నుంచి తెలంగాణ రాజకీయ జేఏసీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించింది. ఈ ఉద్యమంలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులు సహాయ నిరాకరణ చేయాలని, సాధారణ ప్రజలు పన్నులు చెల్లించకుండా ఉండాలని నిర్ణయించడమైంది. 18న కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ఎదుట పికెటింగ్ నిర్వహించారు. 19న పట్టణాల్లో వాక్ ఫర్ తెలంగాణ, గ్రామాల్లో ప్రభాతభేరి కార్యక్రమాలు నిర్వహించింది. 22, 23వ తేదీల్లో అత్యవసర సర్వీసులు మినహా మిగతా అన్ని కార్యక్రమాలను బంద్ చేశారు.
ఫిబ్రవరి 25:
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ప్రభుత్వ ఉద్యోగులు ప్రారంభించిన సహాయ నిరాకణ ఉద్యమంలో భాగంగా పోలీసు శాఖల్లోని మినిస్టీరియల్ సిబ్బంది చేరారు. పార్లమెంటులో తెలంగాణ రాష్ట్ర బిల్లు పెట్టాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఉస్మానియా లా కాలేజీ విద్యార్థులు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఫిబ్రవరి 27: హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌లో గల ప్రెస్‌క్లబ్‌లో సురవరం ప్రతాపరెడ్డి ఆడిటోరియంలో తెలంగాణ రచయితల వేదిక, సింగిడి తెలంగాణ రచయితల సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ కవుల గర్జన సభ నిర్వహించారు. ఈ సభకు జూలూరు గౌరీశంకర్ అధ్యక్షత వహించారు.
మార్చి 1:
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర డిమాండ్‌తో తెలంగాణ జేఏసీ పిలుపు మేరకు పల్లెపల్లె పట్టాలపైకి అనే కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. 5వ తేదీన పార్లమెంటులో తెలంగాణ బిల్లును ప్రవేశ పెట్టాలని చేపట్టిన సహాయ నిరాకరణ ఉద్యమం విరమించారు
తెలంగాణ మార్చ్/ సాగర హారం :
2012, సెప్టెంబర్ 30న హైదరాబాద్ నెక్లెస్ రోడ్డు, ట్యాంక్‌బండ్‌పై నిర్వహించే తెలంగాణ మార్చ్‌కు అనుమతి ఇవ్వాలని తెలంగాణ ఎమ్మెల్యేలు, జేఏసీ నేతలు 2012, సెప్టెంబర్ 27న డీజీపీని కలిశారు. శాంతిభద్రతల దృష్ట్యా అనుమతి ఇవ్వలేమని డీజీపీ తేల్చి చెప్పారు. ప్రభుత్వం కూడా అనుమతిని నిరాకరించింది. ట్యాంక్‌బండ్ బదులుగా వేదికను నెక్లెస్ రోడ్డుకు మార్చుకోవాలని సూచించింది. సెప్టెంబర్ 30న మధ్యాహ్నం 3 గంటల నుంచి 7 గంటల వరకు మార్చ్‌ను నిర్వహించుకోవడానికి ప్రభుత్వం అనుమతినిచ్చింది. తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు తరలిరావడంతో సాగరహారం కార్యక్రమం విజయవంతమైంది. శాంతియుతంగా ముగిసింది.
సకల జనుల సమ్మె :
2011 సెప్టెంబర్ 13 నుంచి అక్టోబర్ 24 వరకు తెలంగాణ ఉద్యమ చరిత్రలో 42 రోజులపాటు తెలంగాణ ప్రాంతంలోని ఉద్యోగులు, కార్మికులు, అన్నివర్గాల ప్రజలు సకల జనుల సమ్మెలో పాల్గొన్నారు. తొలిరోజు తెలంగాణ బంద్, రాస్తారోకోలు జరిగాయి. ఉద్యోగులు విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు. హైదరాబాద్ మినహా మిగిలిన తెలంగాణ జిల్లాలన్నింటిలో ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. సమ్మె జరిగినన్ని రోజులు ఉద్యోగులు విధిగా తమ కార్యాలయాల వద్దకు వచ్చి దీక్ష శిబిరాల్లో పాల్గొనాలని, కార్యాలయాల వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హాజరుపట్టికల్లో సంతకాలు చేయాలని జేఏసీ సూచించింది. 16వ తేదీన ఉపాధ్యాయులు సమ్మెలోకి వచ్చారు. తెలంగాణ ఉద్యోగులు సెప్టెంబర్ 21 నుంచి సమ్మెలో పాల్గొంటున్నట్లు ప్రకటించారు. సెప్టెంబర్ 22: ఖమ్మం జిల్లాలో సీపీఐ(ఎంఎల్) న్యూడమోక్రసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోరుగర్జన విజయవంతమైంది. ఈ సభకు న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి పోటు రంగారావు అధ్యక్షత వహించారు. రాష్ట్రంలోని వైద్యారోగ్య సిబ్బంది సమ్మెలో పాల్గొన్నారు.
మిలియన్ మార్చ్
ఉద్యమాలు నాయకుల చేతిలో నుంచి ప్రజల చేతిలోకి వెళ్లి ప్రజా ఉద్యమాలుగా మారే తరుణంలో తలెత్తే సవాళ్లు ఎలా ఉంటాయో మిలియన్ మార్చ్ ద్వారా తెలుస్తుంది. 60ఏళ్ల కోస్తాంధ్ర వలస దోపిడీ పాలనను తుద ముట్టించడానికి ఈజిప్టులోని తెహిరీ స్క్వేర్ వద్ద జరిగిన నిరసనను ఆధారంగా చేసుకొని హైదరాబాద్‌లో మిలియన్ మార్చ్ కార్యక్రమం నిర్వహించారు. ఫిబ్రవరి 21న విద్యార్థి జేఏసీ చలో అసెంబ్లీ, న్యాయవాదుల జేఏసీ చలో రాజ్‌భవన్ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ పోరాట కార్యక్రమాలను తెలంగాణ ప్రజా ఫ్రంట్ వివిధ జేఏసీల సహాయంతో తెలంగాణ ప్రజల సంపూర్ణ సహాయ సహకారంతో విజయవంతంగా నిర్వహించి తెలంగాణ ఉద్యమానికి గొప్ప స్ఫూర్తినిచ్చాయి. 2011, మార్చి 10న హైదరాబాద్ దిగ్బంధనానికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి మిలియన్ మార్చ్‌గా పేరు పెట్టారు. విద్యార్థుల వార్షిక పరీక్షలను దృష్టిలో పెట్టుకొని జేఏసీ మిలియన్ మార్చ్ నిరసన కార్యక్రమం మధ్యాహ్నం 1గంటకు ప్రారంభమై సాయంత్రం 4గంటల వరకు జరుగుతుందని తెలిపింది. బీజేపీ, టీఆర్ఎస్, న్యూడెమోక్రసీ పార్టీలతోపాటు విద్యార్థులు, న్యాయవాదులు, ఉద్యమ సంస్థలు, ఉద్యోగ సంఘాలు మద్దతు ప్రకటించడంతో కార్యక్రమం విజయవంతమైంది.