మన్నెగూడ యువతి కిడ్నాప్ కేసులో నవీన్ రెడ్డి,చంద్రశేఖర్ లను ఒక రోజు పోలీస్ కస్టడీకి అప్పగించేందుకు ఇబ్రహీంపట్నం కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ కేసులో A1- నిందితుడు నవీన్ రెడ్డి, A6 నిందితుడు - చంద్రశేఖర్ అలియాస్ చందులను 8 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ ఆదిభట్ల పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్ పై ఇవాళ విచారణ జరిగింది. పిటిషన్ ను పరిశీలించిన ఇబ్రహీంపట్నం కోర్టు .. ఒకే రోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చింది.
రిమాండ్ రిపోర్ట్‌లో కీలక వివరాలు
కోర్టుకు అందజేసిన రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు కీలక వివరాలు వెల్లడించారు. ఆదిభట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలోని మన్నెగూడకు చెందిన యువతి కిడ్నాప్‌కు వారం రోజులు ముందే నవీన్ రెడ్డి ప్లాన్ చేశాడు. తన ఫ్రెండ్స్ రుమాన్, సిద్దు, చందు, సాయినాథ్, నాగరాజు కీలకంగా వ్యవహరించారు. దాడి, కిడ్నాప్ ఎలా చేయాలి? ఎక్కడికి పారిపోవాలి? అందుకోసం ఎలాంటి ఏర్పాట్లు చేసుకోవాలి? అన్నదానిపై ముందే మాట్లాడుకున్నారు. ప్లాన్ ప్రకారం దాడి చేశాక నవీన్ రెడ్డికి చెందిన వోల్వో కారులో యువతిని కిడ్నాప్ చేశారు. చందు డ్రైవింగ్ చేస్తుండగా సిద్దు ముందు సీట్‌లో కూర్చున్నాడు. వైశాలిని మధ్య సీట్లో కూర్చొబెట్టుకుని నవీన్‌రెడ్డి, రుమాన్, సాయినాథ్, నాగరాజు దాడి చేశారు. అరిస్తే పేరెంట్స్‌ను చంపేస్తామని బెదిరించారు.
పోలీసులను డైవర్ట్ చేసేందుకు..
పోలీసులను డైవర్ట్ చేసేందుకు నవీన్‌రెడ్డి ఫోన్‌ను మరో కారులో వేసి విజయవాడ రూట్‌లో పంపించారు. వోల్వో కారును సాగర్ రూట్‌లో తీసుకెళ్లారు. పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు యువతిని మరో కారులో పంపించాడు. మన్నెగూడ ఆర్టీఏ ఆఫీస్ వద్ద ఆమెను వదిలి రుమాన్, సిద్దు, చందు, సాయినాథ్, నాగరాజు ఎస్కేప్ అయ్యారు. నవీన్‌రెడ్డి తన వోల్వో కారును శంషాబాద్ ఓల్డ్ విలేజ్ సమీపంలో వదిలి గోవాకు పారిపోయాడు. తొలుత నవీన్ రెడ్డి కర్నాటకకు పరారయ్యాడు. అక్కడి నుంచి హుబ్లీ, పణజీ మీదుగా గోవాకు వెళ్లాడు. అక్కడే హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి కాటేజ్‌లో దిగాడు. కాటేజ్ యజమానికి ఆధార్ కార్డ్ ఇవ్వడంతో పాటు దాడి వివరాలు చెప్పాడు. మొబైల్ నంబర్ ట్రేస్ చేసిన రాచకొండ పోలీసులు.. నవీన్ రెడ్డిని డిసెంబరు 14న గోవాలో అరెస్ట్ చేశారు. కాండోలిమ్ బీచ్‌లో పట్టుబడిన అతన్ని హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. అతని వద్ద నుంచి ఐదు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.