ఉపాధ్యాయ లోకానికి ఎమ్మెల్సీ ఎన్నికల పరీక్ష: ముత్యాల రవీందర్

ఇది ఎమ్మెల్సీ ఎన్నికల సమయం. విజ్ఞతతో ఆలోచించాల్సిన సమయం. సాధారణ ఓటరులాగా కాకుండా తెలివిగా ఓటు వేయాల్సిన సమయం. వ్యక్తిగతమైన అభిమానంతోనో.. సంఘపరమైన, రాజకీయ పార్టీపై అభిమానంతోనో కాకుండా విజ్ఞతతో ముందుకు వెళ్లాల్సిన సందర్భం. 2018 మే నెలలో ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం జరిపి సీఎం కేసీఆర్ ​ఒప్పందం చేసుకున్నా ఒక్క సమస్యా పరిష్కారానికి నోచుకోలేదు. దానిపై ఒక్క ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నోరు మెదప లేదు. అంతా ప్రభుత్వం చెప్పింది చేయడమే గానీ ప్రజల, విద్యా సంక్షేమం అనే ఆలోచనే లేకుండా మరోసారి ఎమ్మెల్సీ ఎన్నికలు రానే వచ్చాయి. విద్యారంగంలో వస్తున్న నూతన ధోరణుల పైన, ప్రభుత్వము తెస్తున్న పాలసీల పైన, ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహిస్తూ, ప్రభుత్వ విద్యా సంస్థలను ప్రభుత్వమే నిర్వీర్యం చేస్తున్నప్పటికీ గెలిచిన ఎమ్మెల్సీలు నోరు మెదపకుండా ఉండటం వల్ల రోజు రోజుకూ సర్కారు బడుల విద్యా ప్రమాణాలు పడిపోయి కొత్త తరాలకు సమగ్ర, నాణ్యమైన విద్య అందకుండా పోతోంది. అధికారమే పరమావధిగా సాధారణ ఎన్నికల లాగా జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన వారు పాలకవర్గాలకు అధికారికంగానో, అనధికారికంగానో చేరువవ్వడం అనంతరం ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో నిస్సహాయంగా మారి, విద్యా రంగ సమస్యల సాధనలో అశక్తులుగా మారడం చూస్తున్నాం. 

విద్యా వ్యవస్థ దుస్థితి

రెండు ప్రైవేటు సంస్థల ఆస్తిగా మారిన ఇంటర్మీడియేట్ విద్యా వ్యవస్థలో జరిగే అక్రమాలు ఇంకెక్కడా జరగడం లేదు. ప్రభుత్వ నియంత్రణ పూర్తిగా కొరవడిన ఈ కాలేజీల మేనేజ్​మెంట్లు ఇష్టా రాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నా అదుపు చేయలేకపోవడం. ప్రభుత్వ కాలేజీల్లో లెక్చరర్ల రిక్రూట్మెంట్ చేయక కాంట్రాక్ట్ పద్ధతిలో అవర్లీ బేస్డ్, డైలీ బేస్డ్, మంత్లీ బేస్డ్ వేతనాలతో అధ్యాపకుల శ్రమ దోపిడీ ఒక వైపు, మరో వైపు ర్యాంకుల దృష్టిలోనే పనిచేస్తూ పోవడం వల్ల మన వద్ద ఇంటర్ టాపర్స్ కూడా జాతీయ స్థాయి ఐఐటీ, నీట్​లాంటి పరీక్షల్లో సత్తా చాటలేకపోవడం మన ఇంటర్ విద్యా నాణ్యతకు తార్కాణం. అనధికార తరగతుల నిర్వహణ, ఫలితాలపై కార్పొరేట్ గుత్తాధిపత్యం వెరసి విద్యార్థులను తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురిచేస్తూ ఆత్మహత్యలకు దారి తీస్తున్నా స్పందించని వారు మన నాయకులు. రాష్ట్రంలోని వర్సిటీలు, అనుబంధ కాలేజీలు పార్ట్ టైం ప్రొఫెసర్లు, లెక్చరర్లతో ఇంకా అవర్లీ బేస్డ్, మంత్లీ బేస్డ్ బోధనా సిబ్బంది తో ప్రమాణాలకు పరిశోధనలకు దూరమౌతుంటే ప్రశ్నించకుండా మిన్నకుంటున్న ఎమ్మెల్సీలు, ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లు మూజువాణి ఓటుతో అసెంబ్లీలో ఆమోదం పొందినప్పుడు మౌన సాక్షులుగా నిలవడం చూశాం. సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతున్న ఈ రోజుల్లో ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మరుగుదొడ్లు, మంచి నీటి సౌకర్యం, కనీస భౌతిక వసతులు కూడా కల్పించలేని దీనావస్థలో విద్యా శాఖ నిధుల లేమితో(2014 లో 10.58 % నుంచి 2023 బడ్జెట్ లో 6.57% శాతానికి తగ్గి) కొట్టు మిట్టాడడం ఎమ్మెల్సీల సాక్షిగా చూస్తూనే ఉన్నాం. చాక్​పీసులు మొదలు, తాగునీటి సరఫరా, విద్యుత్ బిల్లులు, మున్సిపల్ వాటర్ బిల్లుల చెల్లింపుల జాప్యంతో బడుల నిర్వహణ క్లిష్టంగా మారింది. ఒక వైపు సర్వీస్ పర్సన్స్ నియామకం లేక మరుగుదొడ్ల నిర్వహణ తలకు మించిన భారంగా పరిణమిస్తున్నది. అమ్మాయిలకు ప్రత్యేక మరుగుదొడ్లు ఏర్పాటు అందని ద్రాక్ష లాగానే మారింది.  

పదోన్నతులు, విద్యా ప్రమాణాలు ఏవి?

పదోన్నతులు అనగానే అదేదో టీచర్ల ఆర్థిక ప్రయోజనం కోసమేననే భ్రమల్లో ఉన్నంతకాలం బడులు సంతృప్తికరమైన స్టాఫ్ పాటర్న్ ను కలిగి ఉండలేవని, నాణ్యమైన విద్యను అందించలేవనేది నగ్న సత్యం. పదోన్నతుల ద్వారా ఉపాధ్యాయుడికి ఆర్థిక ప్రయోజనం స్పష్టంగా కనబడినా అదొక దీర్ఘకాలిక సామాజిక ప్రయోజనం అని మరువరాదు. కొఠారి ఏనాడో చెప్పినట్టు టీచర్లకు గౌరవప్రద వేతనాలు, పదోన్నతులు ఇచ్చినప్పుడే ఉన్నత విద్యనభ్యసించిన యువత ఉపాధ్యాయ వృత్తి వైపు వచ్చి మెరుగైన సమాజ నిర్మాణంలో భాగస్వాములయ్యే అవకాశం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా అమలు చేసిన జీవో 317 వల్ల దాదాపు 5 వేలకు పైగా టీచర్లు స్థానికత కోల్పోయామని, జూనియర్లుగా చాలా నష్టపోయామని, భార్యాభర్తలు వేర్వేరు జిల్లాలకు కేటాయించబడి ఇబ్బందులు పడుతున్నామని, తమకు న్యాయం చేయాలని, ఒంటరి మహిళలు, వితంతువులు తమ లోకల్ జిల్లాలకు కేటాయించాలని కోరుతూ విద్యా శాఖ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. లాభం లేక కోర్టు మెట్లెక్కడం ద్వారా కొద్ది మందికి న్యాయం జరిగింది. ప్రభుత్వానికి టీచర్లకు అనుసంధానంగా ఉండాల్సిన ఎమ్మెల్సీలు ప్రభుత్వం చేసిన వాదననే చేస్తూ సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు చేస్తున్న టీచర్లకు మద్దతు ఇవ్వలేదు. తద్వారా వందలాది టీచర్లు కేసులు వేయడం.. బదిలీలు, ప్రమోషన్లు ప్రక్రియకు కోర్టు బ్రేక్ వేయడం తెలిసిందే.

టీచర్లు ఆలోచించాలి

ధనిక రాష్ట్రం అనుకున్న మన రాష్ట్రంలో నెలల తరబడి ఆర్థిక బిల్లులు పెండింగ్ ఉంటున్నా ఉపాధ్యాయుల పక్షాన మాట్లాడే ఎమ్మెల్సీలు కరువయ్యారు. పాఠశాలల వార్షికోత్సవాలకు, పదవీ విరమణ వేడుకలకు, పదో తరగతి స్పాట్ కేంద్రాలకు మాత్రమే పరిమితమైన ఎమ్మెల్సీలు, ఉపాధ్యాయ సంఘాల నాయకులకన్నా గొప్పగా సాధించిన విజయాలు లేవనే చెప్పాలి. అందుకే  ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం రాజీ లేకుండా మండలిలో పోరాడే ఉపాధ్యాయ గొంతుకను పంపాల్సిన అవసరం ఉంది. గెలిచిన అనంతరం పాలక వర్గాలకు లేదా పాలక పార్టీ అనుబంధ రాజకీయాలకు తలొగ్గకుండా నిజాయతీగా ఉంటూ ప్రమాణాలతో కూడిన సమాన విద్యా ప్రయోజనాల కోసం, విద్యా రంగ పాలసీల నిర్ణయంలో తన వంతు పాత్ర పోషించే అభ్యర్థిని గెలిపించాలి. మేధావుల సభకు మేధావిని పంపే విధంగా, ఉపాధ్యాయులకు మాత్రమే ఇచ్చిన ప్రత్యేక ఓటు హక్కును సాధారణ ఓటర్లకు భిన్నంగా ఆలోచించి సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ..

శిక్షణ, పర్యవేక్షణ, ఖాళీలు

రాష్ట్ర వ్యాప్తంగా 539 మండల విద్యాధికారుల పోస్టుల్లో 503, 56 ఉప విద్యాధికారి పోస్టుల్లో 56, 33 జిల్లాలకు మంజూరైన10 పోస్టుల్లో కేవలం 6 గురు మాత్రమే పనిచేస్తుండగా, 27 డైట్ కాలేజీల్లో లెక్చరర్ 276 కు గాను 248, బీఈడీ కాలేజీల్లో 107 కు గాను 96, ఎస్సీఈఆర్టీలో మంజూరైన 32 ప్రొఫెసర్ పోస్టుల్లో 29 ఖాళీలే. అంటే పాఠశాలల పర్యవేక్షణ పడకేయగా, ఉపాధ్యాయ శిక్షణ కోసం బీఈఎడ్, డైట్ కాలేజీల్లో శిక్షకులు లేక పూర్తిగా విద్యా వ్యవస్థ చుక్కాని లేని నావలా మారింది. ఈ సమస్యలను పరిష్కరించడంలో, సర్కారు దృష్టికి తీసుకువెళ్లడంలో ఎమ్మెల్సీలు పూర్తిగా విఫలమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 7500 మంది స్కూల్ అసిస్టెంట్ల, 17,873 ఎస్జీటీ, 2043 పీఎస్ హెచెం, 1962 ఉన్నత ప్రధానోపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నా ప్రభుత్వం 2019–-20 విద్యా సంవత్సరం తర్వాత కనీసం విద్యా వాలంటీర్లనైనా ఇవ్వక పోవడం అత్యంత శోచనీయం. 2016 ప్రపంచ తెలుగు మహాసభల్లో సీఎం కేసీఆర్​ హామీ ఇచ్చిన 10,479 పండిత, పీఈటీ పోస్టుల ఉన్నతీకరణ, పదోన్నతుల ప్రక్రియ కోర్టు కేసుల పేరుతో అటకెక్కింది!. మరో వైపు ఉన్నతీకరించిన పండిత, పీఈటీ పోస్టుల ఉత్తర్వులపై అసంతృప్తిగానున్న ఎస్జీటీ లను సంతృప్తి పరచడం కోసం ఉప్పెక్కువైతే కారం, కారమెక్కువైతే ఉప్పు అన్న చందంగా 5,571 ఎస్జీటీ పోస్టులను పీఎస్ హెచ్ఎం పోస్టులుగా అప్​గ్రేడ్ చేయడానికి జీవోలు ఇచ్చినా అవి న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొంటూ కోర్టు మెట్లెక్కి పరస్పర న్యాయం కోసం నెలలుగా కేసులు రూపంలో నడుస్తుండటం ఎందరో పదోన్నతుల ఆశావహులకు కొరకరాని కొయ్యగా మారింది. ఇంగ్లీష్​ మీడియం ప్రారంభమైనా, ఒక్క టీచర్​ పోస్టు మంజూరు చేయలేదు. ఉన్న టీచర్లపైనే బోధనా పనిభారం రెట్టింపైంది.

- ముత్యాల రవీందర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, టీపీటీఎఫ్​