నవంబర్ నెలంతా డేంజర్‎లోనే ఢిల్లీ.. 2023 కన్నా ఈయేడు అధ్వానం

నవంబర్ నెలంతా డేంజర్‎లోనే ఢిల్లీ..  2023 కన్నా ఈయేడు అధ్వానం

న్యూఢిల్లీ: వాయుకాలుష్యంతో కొట్టుమిట్టాడుతున్న దేశ రాజధాని ఢిల్లీలో గత నెల నవంబర్ అత్యంత దుర్భరమైన నెలగా నిలిచింది. ఆ నెలలో గాలి నాణ్యత తీవ్రంగా పడిపోవడంతో 22 రోజులు ‘పూర్ డేస్’ నమోదయ్యాయి. గత ఏడేండ్లలో ఢిల్లీలో నవంబర్ నెల అత్యంత కాలుష్యమయ నెలగా నిలిచి చెత్త రికార్డును నెలకొల్పింది. 2024కు ముందు ఏ సంవత్సరంలోనూ ఇంతటి కాలుష్యం నమోదు కాలేదని ఓ టీవీ చానెల్ డేటా తెలిపింది. గత నెలలో పూర్, బెటర్  ఏక్యూఐ (ఎయిర్  క్వాలిటీ ఇండెక్స్) కేటగిరిలో ఒక్కరోజు కూడా రాలేదు.

 రెండు రోజులు ‘సివియర్  ప్లస్’ జాబితాలోకి వెళ్లాయి. ఆ రెండు రోజుల పాటు ఢిల్లీని దట్టమైన పొగమంచు కప్పేసింది. విజిబిలిటీ బాగా తగ్గిపోయింది. శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్న వారి సంఖ్య పెరిగింది. ఆరు రోజులు ‘సివియర్’ జాబితాలోకి వెళ్లాయి. మిగతా 22 రోజుల పాటు ఏక్యూఐ ‘వెరీపూర్’ గా రికార్డయింది. భవిష్యత్తులో పరిస్థితి ఎంత భయానకంగా ఉంటుందో నవంబర్  నెల హెచ్చరించింది. గత ఏడాది కన్నా 2024 అత్యంత డేంజర్‎గా నిలిచింది. 

2023 నవంబరులో కూడా వాయుకాలుష్యం తీవ్రంగా నమోదైనా.. 2024 నవంబరుతో పోలిస్తే, పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది. ఆ ఏడాది నవంబరులో నాలుగు రోజులు ‘పూర్’ కేటగిరిలోకి వెళ్లాయి. కానీ, ఈ నవంబరులో ఒక్కరోజు కూడా ‘పూర్’ కేటగిరి రికార్డు చేయలేదు. 2021లో కూడా ‘పూర్’ కేటగిరి నమోదైంది. 2020లో కరోనా మహమ్మారి కారణంగా విధించిన లాక్ డౌన్‎తో వాయుకాలుష్యం తగ్గి పరిస్థితి కొంత మెరుగైంది. ఆ ఏడాది నవంబరులో రెండు రోజులు ‘మోడరేట్’ ( ఓ మోస్తరు) కేటగిరిలోకి వెళ్లాయి. పది రోజులు ‘పూర్  డేస్’ కేటగిరిలోకి వెళ్లాయి.

నవంబరు ఎప్పుడూ భయంకరమే

కొన్ని సంవత్సరాలుగా ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రంగా పెరుగుతుండడంతో నవంబరు నెల భయంకరంగా మారుతోంది. ఏటేటా పరిస్థితి దిగజారిపోతోంది. 2018లో ఎయిర్  క్వాలిటీ పూర్‎గా ఉన్నప్పటికీ ‘సివియర్  ప్లస్’ స్థాయికి చేరుకోలేదు. 2022లో గాలిలో నాణ్యత ‘పూర్’, ‘సివియర్  ప్లస్’ గా రికార్డయింది. ఈ సంవత్సరమే పరిస్థితి అధ్వానంగా మారి రెండు రోజులు ‘సివియర్  ప్లస్’ స్థాయికి వెళ్లాయి. 

నవంబరు మాసంలో ఢిల్లీకి పొరుగున ఉన్న రాష్ట్రాల్లో పంటవ్యర్థాలను తగులబెట్టడం, నగరంలో వాహనాల నుంచే వచ్చే పొగ, నిర్మాణంలో ఉన్న భవంతుల నుంచి ఏర్పడుతున్న దుమ్ము, ఇండస్ట్రియల్  పొల్యూషన్  వంటివి ఢిల్లీలో వాయు కాలుష్యానికి కారణం అవుతున్నాయని నిపుణులు తెలిపారు. వాయు కాలుష్యం కట్టడికి వెంటనే చర్యలు తీసుకోవాలని, లేకపోతే పరిస్థితి మరింత భయంకరంగా మారుతుందని వారు హెచ్చరించారు.